వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుకన్య సమృద్ధి యోజన: కూతురి పెళ్లికి గరిష్టంగా రూ.71 లక్షలు పొందే మార్గం ఇది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ పాస్ పుస్తకాలతో బాలికలు

ఇంటికి దీపం అమ్మాయి అనే చైతన్యంతో కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌.ఎస్.వై) తీసుకొచ్చింది. ఇది చిన్న మొత్తాల పొదుపు పథకం. పథకం ఆడపిల్లలకు మాత్రమే వర్తిస్తుంది.

అమ్మాయికి 21 సంవత్సరాలు నిండినపుడు ఈ పథకం మెచ్యూరిటీకి వస్తుంది. చదువు, పెళ్లి అవసరాలకు సహాయపడే విధంగా రూపొందించిన పొదుపు పథకం ఇది.

డిఫాల్ట్ లేకుండా మెచ్యూరిటీ అయ్యే దాకా నిర్ణీత సొమ్ము కడితే ఖాతా ముగిసే సమయానికి సమయానికి రూ.71 లక్షల వరకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఈ డిపాజిట్​పై ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంది.

ప్రయోజనం ఏమిటి?

సమాజంలో ఆడపిల్ల పట్ల ఉన్న వివక్షతా భావం పోగొట్టే లక్ష్యంతో 2015, జనవరి నెలలో 'బేటీ బచావో, బేటీ పడావో’('సేవ్ ది గర్ల్ ఛైల్డ్, ఎడ్యుకేట్ ది గర్ల్ ఛైల్డ్’) పాలసీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇందులో భాగంగానే 'సుకన్య సమృద్ధి యోజన’ను కూడా ప్రారంభించింది.

ఆడపిల్లల పెంపకం, బాధ్యతల విషయంలో అమ్మాయి తల్లిదండ్రులు లేదా గార్డియన్​ ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ఈ పొదుపు పథకం ఆర్థికంగా అండగా ఉంటుంది.

అమ్మాయిల చదువు, పెళ్లి ఖర్చులకు కావాల్సిన డబ్బును దీర్ఘకాలంలో అందిస్తూ వాళ్లకి ఉన్నత భవిష్యత్తును చూపిస్తుంది.

బాలికల చదువులు, పెళ్లిళ్లకు ఉపయోగపడేలా ఈ పథకాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం

ఎవరు అర్హులు?

బాలిక పుట్టిన పది సంవత్సరాల లోపు సుకన్య సమృద్ధి పొదుపు ఖాతాను తెరవాలి. అమ్మాయి భారతీయురాలై ఉండాలి. ఇక్కడ నివసించాలి. పొదుపు ఖాతాను అమ్మాయి పేరు మీదే తెరవాలి.

ఒక కుటుంబంలో ఇద్దరు కూతుళ్లకు మాత్రమే ఈ పొదుపు ఖాతాను తెరిచే అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రం కొంత మినహాయింపు ఉంటుంది. తల్లిదండ్రులు లేదా గార్డియన్ ఖాతాను అమ్మాయి పేరు మీద తెరవవచ్చు.

రూ.250తో ఖాతాను తెరవాలి. తర్వాత సంవత్సరానికి గరిష్టంగా 1,50,000 జమ చేయాలి. ఖాతా ప్రారంభించిన తేదీ నుంచి 15 సంవత్సరాల వరకూ డబ్బు క్రమం తప్పకుండా జమ చేయాలి.

అలాగే, ఖాతాను ప్రారంభించిన తేదీ నుంచి అమ్మాయికి 21 ఏళ్లు వచ్చేటప్పటికి ఆ ఖాతా మెచ్యూరిటీకి వస్తుంది.

ఉదాహరణకు డిఫాల్ట్ లేకుండా నెలకు వెయ్యి రూపాయలు (ఈ డబ్బు ఒకేసారి జమ చేయాలని లేదు. నెలలో రెండు, మూడు దఫాలుగా కట్టొచ్చు) కడితే మెచ్యూరిటీ సమయానికి సుమారు 5 లక్షల రూపాయలు అందుతాయి.

డిఫాల్ట్ లేకుండా నెలకు పన్నెండున్నర వేలు 15 ఏళ్ల పాటు కడితే, మెచ్యూరిటీ సమయానికి సుమారు రూ. 71 లక్షల వరకూ వస్తుంది.

సంవత్సరానికి రూ. 60 వేలు దఫదఫాలుగా కడితే మెచ్యూరిటీ సమయానికి 15 సంవత్సరాలకు వడ్డీ రేటును బట్టి రూ.28 లక్షలకు పైన వస్తుంది.

ఖాతాను పోస్టాఫీసు లేదా జాతీయ బ్యాంకు లేదా ఏదైనా ఆథరైజ్డ్ కమర్షియల్ బ్యాంకులలో కూడా తెరవచ్చు.

లాభాలు

ఆదాయపు పన్ను చట్ట 80సి సెక్షన్ కింద ఏడాదికి రూ. 1.5 లక్షల ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. వడ్డీ రేటు 7.6 శాతం.

పేద వర్గాల నుంచి మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి, ఇతర సామాజిక వర్గానికి చెందిన కుటుంబాల్లోని ఆడపిల్లలను ఈ పథకం ఆదుకుంటుంది. పైగా ఇది దీర్ఘకాలిక పథకం. దీనివల్ల సంవత్సరానికి చక్రవడ్డీ రేటు బాగా ఉంటుంది.

అమ్మాయికి 18 ఏళ్లు దాటి పెళ్లీడుకు వచ్చినపుడు డిపాజిట్ సొమ్ము ఉపయోగించుకోవచ్చు.

18 ఏళ్లు నిండిన తర్వాత అమ్మాయి చదువు కోసం డబ్బు తీసుకోవాలనుకుంటే, ముందు ఏడాది చివరిలో ఉన్న నిల్వలో సగం వరకూ డబ్బులు తీసుకునే అవకాశం ఉంది.

బాలికకు 21 సంవత్సరాలు నిండే దాకా ఖాతాలోని సొమ్ము మొత్తంపై వడ్డీ వస్తుంది. అలాగే ఒక నెలలో లేదా ఆర్థిక సంవత్సరంలో ఎన్నిసార్లయినా, ఎంత మొత్తంలోనైనా డబ్బును ఖాతాలో డిపాజిట్ చేయొచ్చు.

మెచ్యూరిటీ టైము 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా డబ్బు తీసుకోకపోతే అకౌంట్ మొత్తంపై వడ్డీ జమ అవుతూనే ఉంటుంది.

తల్లిదండ్రులు లేదా గార్డియన్ వేరే ఊరు బదిలీ అయితే వాళ్లు తమ సుకన్య సమృద్ధి పొదుపు ఖాతాను దేశంలో ఎక్కడికైనా ఉచితంగా బదిలీ చేసుకోవచ్చు.

బాలిక

ఎలా ఖాతా తెరవాలి?

మీ ఇంటి దగ్గరలో ఉన్న పోస్టాఫీసులో ఈ పొదుపు పథకం అందుబాటులో ఉంటుంది. అక్కడికి వెళ్లి పోస్ట్‌మాస్టర్​ సహాయంతో దరఖాస్తు చేసుకోవచ్చు. గవర్నమెంటు పోర్టల్ నుంచి దరఖాస్తు ఫారాన్ని మొదట డౌన్లోడ్ చేసుకోవాలి.

దరఖాస్తులో అడిగిన వివరాలన్నింటినీ పూర్తిచేయాలి. ముఖ్యమైన డాక్యుమెంట్లు అంటే అకౌంటుదారురాలైన బాలిక ఫొటోలు, తల్లిదండ్రులు/గార్డియన్ ఫొటోలు ఉండాలి. ఐడి ప్రూఫ్‌ కావాలి. అడ్రస్ ప్రూఫ్ అంటే ఆధార్​ కార్డు, బాలిక జనన ధృవపత్రం ఉండాలి.

వీటన్నింటినీ జత చేసి దరఖాస్తు పత్రాన్ని పోస్టాఫీసులో అందజేయాలి.

సంబంధిత దరఖాస్తుతోపాటు చెక్, డ్రాఫ్ట్ లేదా క్యాష్ రూపంలో ప్రారంభ మొత్తం (ఇనీషియల్ అకౌంట్) కట్టాలి.

ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్లు చేయొచ్చు కూడా. ఈ స్కీముకు సంబంధించిన దరఖాస్తులు పోస్టాఫీసు లేదా గుర్తింపు పొందిన ప్రభుత్వ/ప్రైవేటు బ్యాంకుల్లో ఉంటాయి.

ఆథరైజ్డ్ బ్యాంకుల్లో కూడా ఈ పొదుపు పథకం ఖాతా తెరవచ్చు. డిపాజిట్‌ను ఒక డిజిగ్నేటెడ్ బ్యాంకు బ్రాంచి నుంచి మరొక బ్యాంకుకు మార్చుకోవాలంటే కూడా బదిలీ పత్రాలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో దొరుకుతాయి.

చిన్నారి

కండిషన్లు ఏమిటి

ఎస్.ఎస్.వై.లో ఖాతాదారు కనీసం రూ.250 కూడా కట్టలేకపోతే ఆ అకౌంటును 'డిఫాల్ట్ అకౌంట్’గా పరిగణిస్తారు.15 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరానికి రూ. 250తోపాటు రూ.50 కలిపి ఈ డిఫాల్ట్ అకౌంట్ పునరుద్ధరించవచ్చు.

బాలికకు 18 సంవత్సరాలు నిండాక సొంతంగా తన అకౌంటును ఆపరేట్ చేసుకోవచ్చు. పెళ్లి ఖర్చుల కోసం అయితే 18 సంవత్సరాలు దాటిన తర్వాత అకౌంట్‌ను ముందుగా (ప్రిమెచ్యూర్) క్లోజింగ్ చేయొచ్చు.

కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఖాతాను క్లోజ్ చేసి డబ్బులు తీసుకోవచ్చు కూడా. అకౌంటుదారైన బాలిక అనూహ్యంగా మరణిస్తే, గార్డియన్ లేదా తల్లిదండ్రులు ఫైనల్ అకౌంటును డ్రా చేసుకోవచ్చు.

ఖాతాలో పేర్కొన్న నామినీకి ఆ మొత్తం డబ్బును అందజేస్తారు. ప్రిమెచ్యూర్ విత్ డ్రాయల్స్, క్లోజర్లు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తారు.

ఖాతాను కొనసాగించలేని అసహాయ స్థితిలో డిపాజిటర్ ఉన్నప్పుడు, ఖాతా తెరిచిన నాటి నుంచి ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ప్రిమెచ్యూర్‌గా (ముందుగానే) క్లోజ్ చేయాలనే ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వొచ్చు.

ప్రాణాంతక జబ్బులు వచ్చినప్పుడు, మెడికల్ ఎమర్జన్సీల్లో మాత్రమే అకౌంట్ క్లోజ్ చేస్తారు.

స్పందన బాగుంది

''ఈ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా పోస్టల్ శాఖ ఈ పొదుపు పథకానికి సంబంధించి ప్రజలలో అవగాహన కల్పించడానికి బాగా ప్రచారం చేస్తోంది. పోస్టాఫీసు వాకింగ్ కస్టమర్లకే కాదు ఊళ్లల్లో అంగన్‌వాడీలు, టీచర్లు, సర్పంచులు వంటి వారి తోడ్పాటుతో ఈ పొదుపు ఖాతా ప్రయోజనాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కృషిచేస్తోంది. అంగన్‌వాడీ వర్కర్ల ద్వారా దీని లాభాల గురించి ప్రజలకు తెలియచెబుతున్నాం’’ అని హైదరాబాద్ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ పి.విద్యాసాగర్ రెడ్డి వెల్లడించారు.

ప్రాథమిక పాఠశాలలకు వెళ్లి టీచర్లకు, అలాగే ఆడపిల్లల తల్లిదండ్రులకు ఈ పథకం గురించి తెలియజేస్తున్నారు. పోస్టాఫీసు నుంచి పోస్ట్ మాస్టర్ గ్రామ సభలు జరిగేటప్పుడు వెళ్లి సర్పంచ్ ద్వారా ప్రజలకు ఈ పథకం ప్రాధాన్యాన్ని తెలియచెబుతున్నారు.

''గ్రామీణ ప్రాంతాల్లో దిగువ మధ్యతరగతి, పేదకుటుంబాల్లో, పలు సామాజికవర్గాల్లో ఆడపిల్లలకు చదువు చెప్పించలేని పరిస్థితి. పైగా వాళ్లకి పెళ్లి చేయాలనే బాధ్యత అమ్మాయిల తల్లిదండ్రులను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనుచేస్తోంది. గ్రాడ్యుయేషన్ వంటి ఉన్నత విద్యావకాశాల దగ్గరకు వచ్చేసరికే వీళ్లకు ఆర్థికంగా సమస్యలు ఎదురవుతున్నాయి.ఈ పొదుపు పథకం దిగువ, మధ్యతరగతి, పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉంటోంది’’ అని విద్యాసాగర్ రెడ్డి వివరించారు.

2015 జనవరి నుంచి 2021 జనవరి వరకూ తెలంగాణా రాష్ట్రంలో 7,33,507 వరకు ఈ ఖాతాలు ఓపెన్ అయ్యాయని ఆయన వెల్లడించారు.

కరోనావైరస్:భవిష్యత్‌లో చదువులన్నీ డిజిటల్ మయమేనా?

ఆడపిల్లలను చదివించే పథకం

''నేను మంచిర్యాల జిల్లా జన్నారంలో ప్రభుత్వ టీచర్ గా పనిచేస్తున్నా. నాకు ఇద్దరమ్మాయిలు. పెద్దమ్మాయి ఐదవ తరగతి చదువుతోంది. తనకి సుకన్య సమృద్ధి యోజనా పొదుపు పథకం చేయించా .

2015లో ఈ పథకాన్ని ప్రధాని ప్రకటించినపుడు అమ్మాయిలకు అన్నిరకాలుగా బాగా ఉపయోపడే పథకమని అనిపించింది. ఆదాయపు పన్ను మినహాయింపు ఉంది. మంచి వడ్డీ రేటు ఇస్తున్నారు. ఈ పథకం ఆడపిల్లల చదువు కోసం బాగా ఉపయోగపడుతుంది’’ అని మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న దాడి మల్లేశ్ వెల్లడించారు.

''నాకు ఇద్దరు పాపలు. పెద్ద పాపకు మూడు సంవత్సరాలు. తనకు ఒక సంవత్సరం నిండగానే సుకన్య సమృద్ధి పథకంలో పొదుపు ఖాతా తెరిచా. ఈ పథకం కూతుళ్ల చదువుకు, పెళ్లిళ్లకు ఆర్థికంగా ఆదుకుంటుందని చెబుతున్నారు.

మా కుటుంబాన్నే తీసుకుంటే రేపు మాకేదైనా అయినా మా పిల్లలు చదువుకోవడానికి లేదా పెళ్లి చేసుకుని స్థిరపడడానికి ఈ పథకం అండగా నిలబడుతుందనే నమ్మకం ఉంది’’ అని ఖమ్మం రూరల్ మండలానికి చెందిన ప్రైవేట్ లెక్చరర్ ఎం. నరసింహారావు చెప్పారు.

ఈ పొదుపు పథకం వివరాలకు టోల్ ఫ్రీ నెంబరు-1800 266 6868ను సంప్రదించవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Sukanya Samridhi Yojana: This is the way to get a maximum of Rs 71 lakh for a daughter's wedding
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X