వారికెలా తెలుసు: సునంద మృతిపై గుప్తా, వాద్రా పేరు..
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మరణం సహజమరణమని శవపరీక్ష నివేదిక ఇవ్వాలని తన పైన ఒత్తిడి వచ్చినట్లుగా చెప్పిన విషయానికి కట్టుబడి ఉన్నానని, తన పైన ఒత్తిడి లేదని వారికెలా తెలుసునని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా గురువారం స్పష్టం చేశారు.
తాను చెప్పిన విషయానికే కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఆయనపై ఒత్తిడి వచ్చినట్లుగా ఆధారాల్లేవని ఎయిమ్స్ అధికార ప్రతినిధులు చేసిన ప్రకటన పైన సుధీర్ గుప్తా స్పందించారు. తన పైన ఒత్తిడి లేదని వారికి ఎలా తెలుసునని ప్రశ్నించారు. తన పైన ఒత్తిడి లేదని వివరణ ఇచ్చేందుకు వారు ఎవరని ప్రశ్నించారు. అంత హడావుడిగా విలేకర్ల సమావేశం నిర్వహించాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు.

కాగా, సునంద పుష్కర్ మృతి వ్యవహారం అనుకోని మలుపులు తిరుగుతోంది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేత, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి సునంద పుష్కర్ మృతికి ఐపియల్ మనీ లాండరింగ్‌కు సంబంధం అంటగట్టారు. ఈ మేరకు జాతీయ మీడియాలో గురువారం వార్తలు వచ్చాయి. ఆయన ఓ న్యూస్ చానెల్‌లో అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
మరణించడానికి కొద్ది రోజుల ముందు సునంద పుష్కర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఐపియల్ కొచ్చి టస్కర్స్ కేరళ ఫ్రాంచైజీకి చెందిన కొన్ని వివరాలను వెల్లడించాలని అనుకున్నట్లు ఆయన తెలిపారు. తమ ప్రయోజనాలు దెబ్బ తింటాయని భావించి బడా బాబులు ఆమెను హత్య చేయాలని అనుకుని ఉంటారని ఆయన అన్నారు.
సునంద పుష్కర్ మృతిపై విచారణ జరపాలని తాను సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని ఆయన చెప్పారు. ఐపియల్ డీల్స్‌ను బయటపెడ్తానని సునంద పుష్కర్ చెప్పారని, సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా పేరు కూడా వచ్చిందని, దీనిపై సుప్రీం కోర్టు విచారణ జరగాలని అన్నారు. సునంద పోస్టు మార్టం నివేదికను మార్చాలని తనపై ఒత్తిడి వచ్చిందని ఎయిమ్స్ ఫొరెన్సిక్ వైద్యుడు చేసిన వ్యాఖ్యలపై దర్యాప్తు చేసేవారు దాన్ని పరిష్కరించాల్సి ఉంటుందని శశి థరూర్ అన్నారు. డాక్టర్ సుధీర్ గుప్తాపై మాట్లాడడానికేమీ లేదని అన్నారు.












Click it and Unblock the Notifications