భార్య సునందతో శశిథరూర్ వాగ్వాదం? పాక్ పత్రికల్లో...

హింసాత్మక చర్యల వల్లే సునంద మరణం సంభవించిందా కాదా అన్నది తేల్చేందుకు తన దర్యాఫ్తు అని అలోక్ శర్మ చెప్పారు. ఇంకా వాంగ్మూలాలు సేకరించాల్సి ఉందన్నారు. సునంద మరణించిన హోటల్లో వాస్తవానికి ఆ దంపతులు తొలుత రెండు వేర్వేరు గదులు బుక్ చేసుకున్నారని, ఆ తర్వాత సూట్‌లోకి మారారట. థరూర్ దంపతుల మధ్య లాబీలో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగిందని హోటల్ సిబ్బంది పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది.
పాక్ పత్రికల్లో తక్కువ ప్రాధాన్యం
సంచలనం సృష్టించిన సునంద ట్విటర్ వివాదం, ఆమె మృతి ఈ రెండు విషయాలూ పాకిస్థాన్ పత్రికల్లో వచ్చాయి. కానీ, వెనక పేజీల్లో, అదీ సింగిల్ కాలమ్ వార్తలుగా వచ్చాయి. వివాదానికి కేంద్ర బిందువైన మెహర్ తరార్ పని చేసే డైలీ టైమ్స్ పత్రిక ఆమె పేరు లేకుండా వార్త ప్రచురించింది. 'ద న్యూస్' పత్రిక మాత్రం కొంచెం ప్రముఖంగా ప్రచురించింది. అదే గ్రూపునకు చెందిన జియో న్యూస్ చానెల్ విస్తృత కవరేజ్ ఇచ్చింది.
సునంద పార్థివదేహానికి శనివారం సాయంత్రం లోధీ రోడ్ క్రిమెటోరియంలో దహన సంస్కారాలు నిర్వహించారు. కుమారుడు శివ్ మీనన్ ఆమె చితికి నిప్పంటించారు. ఈ సమయంలో శశిథరూర్, సునంద తండ్రి, సోదరుడు, ఇతర కుటుంబసభ్యులందరూ అక్కడే ఉన్నారు. అంతకుముందు.. పోస్ట్‌మార్టం అనంతరం సునంద భౌతిక కాయాన్ని లోధీ ఎస్టేట్‌లోని థరూర్ నివాసానికి తీసుకొచ్చారు.
కేంద్ర రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, ప్రవాస భారతీయ వ్యవహారాల శాఖ మంత్రి వయలార్ రవి, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తదితర ప్రముఖులు ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ప్రధాని మన్మోహన్ శనివారం ఆయన్ను ఉద్దేశించి ఒక లేఖ రాశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ శనివారం రాత్రి శశి థరూర్‌ను కలిసి సానుభూతి తెలిపారు. సునందకు ప్రాణాంతక వ్యాధులేవీ లేవని వారం రోజుల క్రితం తిరువనంతపురంలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన కేరళ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) వైద్యులు స్పష్టం చేశారు. ఆమె మృతి తమను తీవ్రదిగ్భ్రాంతికి గురి చేసిందని ఆస్పత్రి వైస్ చైర్మన్ విజయరాఘవన్ అన్నారు.












Click it and Unblock the Notifications