పిట్ట పోరు పిట్టపోరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా తెరపై కొత్త పేరు- భారీ ర్యాలీ
బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి పదవిపై ఏర్పడిన ప్రతిష్ఠంభన తొలగట్లేదు. శనివారమే ఫలితాలు వెలువడినప్పటికీ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంపై పీటముడి పడింది. ఆదివారం రాత్రి సీఎల్పీ భేటీ అయినప్పటికీ- ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేకపోయింది. సీఎల్పీ నేతను ఎంపిక చేసే సర్వాధికారాలను పార్టీ అధిష్ఠానానికి వదిలివేసింది. దీనితో కర్ణాటక రాజకీయాలు హస్తినకు షిఫ్ట్ అయ్యాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీని అందుకుంది. 135 స్థానాల్లో విజయఢంకా మోగించింది. 43 శాతానికి పైగా ఓట్ల షేర్‌ను సాధించింది. తమ నేతను ఎన్నుకోవడానికి ఆదివారం సాయంత్రం సీఎల్పీ భేటీ అయినప్పటికీ- ఎలాంటి నిర్ణయం కూడా వెలువడలేదు.

ఈ పరిణామాల మధ్య తాజాగా మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ జీ పరమేశ్వరను ముఖ్యమంత్రిగా నియమించాలంటూ మద్దతుదారులు రోడ్డెక్కారు. తుమకూరులో భారీ ప్రదర్శన చేపట్టారు. పరమేశ్వర ఫొటోలను ముద్రించిన ప్లకార్డులు, బ్యానర్లను ప్రదర్శించారు. ఆయనకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాబోయే ముఖ్యమంత్రి పరమేశ్వర అంటూ నినదించారు.
దళిత నేతను ముఖ్యమంత్రిని చేస్తామంటూ ఇన్నాళ్లుగా అన్ని పార్టీలు కూడా ఊరిస్తూ వస్తోన్నాయిని, దఫా దళిత ముఖ్యమంత్రిని నియమించి తీరాల్సిందేనంటూ పట్టుబట్టారు. దానికి పరమేశ్వరకు అన్ని అర్హతలు ఉన్నాయంటూ కొరటగెరె నాయకులు స్పష్టం చేశారు. తుమకూరులో నిర్వహించిన ఈ ర్యాలీలో వందలాదిమంది ఆయన అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పలు దళిత సంఘాల ప్రతినిధులు సైతం పరమేశ్వరకు మద్దతు పలికారు.

పరమేశ్వర సొంత నియోజకవర్గం తుమకూరు జిల్లాలోని కొరటగెరె. ఇక్కడినుంచి మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2008లో కొరటగెరె ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2013లో జనతాదళ్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. మళ్లీ 2018లో ఎన్నికయ్యారు. ఈ దఫా కూడా కొరటగెరె నుంచే ఘన విజయం సాధించారు. దళితుడు కావడం వల్ల పరమేశ్వరకు ముఖ్యమంత్రిని చేయాలంటూ ఆయన మద్దతుదారులు పట్టుబట్టారు.












Click it and Unblock the Notifications