వందేభారత్ రైలు స్టాప్ కోసం సుప్రీం మెట్లెక్కిన వ్యక్తి; ఇదేమైనా పోస్టాఫీసా.. ధర్మాసనం చీవాట్లు!!
వందే భారత్ రైలు.. ఏ సమయంలో ఈ రైలు ప్రారంభమైందో కానీ తరచూ చర్చనీయాంశంగా మారుతుంది. తాజాగా సుప్రీంకోర్టులో వందే భారత్ రైలు గురించి ఒక పిటిషన్ దాఖలైంది. వందే భారత్ రైలును తమ ఊరి స్టేషన్లో ఆగేలా రైల్వే శాఖకు ఆదేశాలు జారీ చేయాలంటూ కేరళకు చెందిన ఒక యువ లాయర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సదరు లాయర్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే పట్టువదలని విక్రమార్కుడిలా ఆ యువ లాయర్ కనీసం ప్రభుత్వానికైనా తమ ప్రతిపాదనను పరిశీలించాలని ఆదేశాలు ఇవ్వాలని కోరిన చీఫ్ జస్టిస్ డి వై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ పిటిషనర్ పై మండిపడింది. తిరువనంతపురం నుంచి కాసర్ గోడ్ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలు కు మలప్పురం స్టేషన్లో ఆగేలా స్టాప్ కేటాయించలేదు. దీంతో నిత్యం ప్రయాణికుల రద్దీతో ఉండే మలప్పురం రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ క్రమంలోనే ఎక్కువ రద్దీగా ఉండే చోట స్టాప్ కేటాయించకపోవడం పై ఒక యువ అడ్వకేట్ పి టి షీజీష్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్ విచారించిన సీజేఐ ధర్మాసనం ఇది ఒక అసాధారణమైన విజ్ఞప్తి అని, దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఒక పోస్ట్ ఆఫీస్ గా భావించవద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
వందే భారత్ రైలు ఎక్కడ ఆగాలో నిర్ణయించాలని మమ్మల్ని కోరుతున్నావ్, తరువాత ఢిల్లీ ముంబై రాజధానిని ఆపాలని అడుగుతావా అంటూ ప్రశ్నించింది. విధాన నిర్ణయాలపై సంబంధిత అధికారుల దగ్గరకు వెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటికీ పిటిషనర్ కనీసం ప్రభుత్వ పరిశీలనకైనా పంపాలని అభ్యర్థించారు. దీనిపై మండిపడిన సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేది లేదని స్పష్టం చేసింది.
ప్రజల డిమాండ్ మేరకు స్టాప్ లు ఏర్పాటు చేస్తే ఎక్స్ప్రెస్ అన్న మాటకే అర్థం లేకుండా పోతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వందే భారత్ రైలు వంటి హై స్పీడ్ రైళ్లకు వ్యక్తిగత లేదా స్వార్థ ప్రయోజనాల ఆధారంగా డిమాండ్ పై స్టాప్ లు కేటాయించ బడవు అని పేర్కొంది. అయితే అంతకుముందే సదరు పిటిషనర్ దీనిపై కేరళ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయగా, కేరళ హైకోర్టు న్యాయస్థానం ఇది రైల్వే పరిధిలోకి వస్తుందంటూ పిటిషన్ ను తోసిపుచ్చింది.












Click it and Unblock the Notifications