సుప్రీంకోర్టుకు హిజాబ్ వివాదం-సీజే ఎన్వీ రమణ కీలక సూచన- కర్నాటక హైకోర్టు విచారణ తర్వాతే
కర్నాటకలో మొదలై దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న హిజాబ్ వివాదం ఇఫ్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. హిజాబ్ వివాదంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరించే విషయంలో సీజే ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కర్నాటకలో చోటు చేసుకున్న హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణకు స్వీకరించే విషయంలో ఇవాళ ఛీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు ఆసక్తికర చర్చ జరిగింది ఇందులో పిటిషనర్ తరఫు వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. కర్నాటకలో మొదలైన ఈ వ్యవహారం దేశవ్యాప్తమవుతోందని, మరో రెండు నెలల్లో విద్యార్ధులకు పరీక్షలు కూడా ఉన్నాయని, ఈ దశలో సుప్రీంకోర్టు దీనిపై విచారణ జరిపి కీలక ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీంతో జోక్యం చేసుకున్న ప్రధాన న్యాయముూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు.

కర్నాటక హైకోర్టు విచారణ జరుపుతున్న హిజాబ్ వివాదంపై మరో పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తే అక్కడ విచారణ ఆగిపోయే ప్రమాదముందని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టులో పిటిషన్ పై జరుగుతున్న విచారణ కొనసాగనివ్వాలని ఆయన సూచించారు. తాము ఈ పిటిషన్ పై విచారణ ప్రారంభిస్తే అక్కడ హైకోర్టులో విచారణ ఆగిపోయే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. దీంతో పిటిషనర్ ను రెండు, మూడు రోజులు ఆగాలని సీజే సూచించారు. మొత్తం మీద ఈ కేసు విచారణకు స్వీకరిస్తామని, అయితే ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని జస్టిస్ రమణ వెల్లడించారు.
ఇప్పటికే కర్నాటక హైకోర్టులో హిజాబ్ పిటిషన్ పై విచారణ జరుపుతున్న జస్టిస్ దీక్షిత్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం దీన్ని విస్తృత బెంచ్ కు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కర్నాటక హైకోర్టు సీజే రీతూ రాజ్ అవస్ధి, జస్టిస్ కృష్ణ దీక్షిత్, జస్టిస్ జేఏం ఖాజీ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ దీనిపై విచారణ జరపబోతోంది. ఈ విచారణ పూర్తయ్యే వరకూ విద్యార్ధులు శాంతియుతంగా ఉండాలని హైకోర్టు కోరింది. మరోవైపు కర్నాటక ప్రభుత్వం విద్యాసంస్ధల దగ్గర ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా రెండు వారాల పాటు 144 సెక్షన్ విధించింది.












Click it and Unblock the Notifications