కేంద్రానికి సుప్రీం మరో బిగ్ షాక్..! ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గబోం..!
రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించి పంపిన బిల్లుల్ని గవర్నర్లు, రాష్ట్రపతి ఆమోదించకుండా కాలయాపన చేయడాన్ని తప్పుబడుతూ ఇందుకు గడువుల్ని నిర్దేశించిన సుప్రీంకోర్టు.. తీవ్ర విమర్శలు, సుదీర్ఘ విచారణ తర్వాత కూడా ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేందుకు నిరాకరించింది. ఈ మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 12న రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లుల క్లియరెన్స్ పై ఇచ్చిన ఆదేశాలను పక్కనబెట్టబోమని ఛీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్డీల సుప్రీం బెంచ్ తేల్చిచెప్పేసింది.
గతంలో తమిళనాడు అసెంబ్లీ ఆమోదించి పంపిన 10 బిల్లుల్ని క్లియర్ చేసేందుకు గవర్నర్ బీఎన్ రవి ఇష్టపడలేదు. దీంతో వాటిని రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. దీన్ని సవాల్ చేస్తూ తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. ఆ 10 బిల్లులు ఆటోమేటిగ్గా ఆమోదం పొందినట్లేనని ప్రకటించింది. దీంతో పాటు రాష్ట్రపతి, గవర్నర్లకు రాష్ట్రాలు పంపిన బిల్లుల్ని క్లియర్ చేసేందుకు గడువులు కూడా విధించింది.

అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం.. గతంలో ఇచ్చిన తీర్పును పక్కనబెట్టబోమని తేల్చిచెప్పేసింది. అయితే తమిళనాడు కేసులో అప్పీలును స్వీకరించబోమని, కానీ నిర్ణయం కాకుండా సూచన మాత్రమే చేస్తామని తెలిపింది. తాము సలహా పరిధిలో ఉన్నామని, అప్పిలేట్ పరిధిలో లేమని బెంచ్ లో ఒకరైన జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. కోర్టు ఓ అభిప్రాయాన్ని వినవచ్చు కానీ తీర్పును తోసిపుచ్చదని తెలిపారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గతంలో లేవనెత్తిన 14 ప్రశ్నలకు తమిళనాడు కేసులో ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు ద్వారా సమాధానాలు లభించాయని రాష్ట్రం తరఫున హాజరైన లాయర్ అభిషేక్ సింఘ్వీ, కేరళ తరఫున హాజరైన మరో లాయర్ కేకే వేణుగోపాల్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఇప్పటికే ఇచ్చిన తీర్పును తిరిగి సమీక్షించడానికి రాష్ట్రపతి ఆర్టికల్ 143 కింద ఉన్న అధికారాన్ని వాడలేరని తెలిపారు. కానీ అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇద్దరూ కోర్టు వాస్తవానికి ఆర్టికల్ 143 కేసుల్లో గత తీర్పుల్ని సమీక్షించవచ్చని, లేదా మార్చవచ్చని వాదించారు. చివరికి విచారణ రేపటికి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications