వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీం కోర్టు కొలీజియం: న్యాయమూర్తుల నియామకాలపై వివాదం ఎందుకు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సుప్రీం కోర్టు

న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించాలా?

ఎప్పటినుంచో భారత్‌లోని ఉన్నత న్యాయస్థానాల్లో ఖాళీలను కొలీజియం వ్యవస్థ ద్వారా న్యాయమూర్తులే భర్తీచేస్తున్నారు. సాధారణంగా సుప్రీం కోర్టులో ఖాళీలను అక్కడి న్యాయమూర్తులతో మాట్లాడిన తర్వాత భారత రాష్ట్రపతి భర్తీ చేస్తారు.

అయితే, ఈ విధానంలో విప్లవాత్మక మార్పులు అవసరమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని వారాలుగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి, ఉప రాష్ట్రపతి సహా చాలా మంది సీనియర్ పదవులు చేపట్టినవారు కొలీజియానికి వ్యతిరేకంగా మాట్లాడారు.

''ప్రపంచంలోని ఇతర దేశాల్లో న్యాయమూర్తులను న్యాయమూర్తులు నియమించరు. భారత్‌లో మాత్రం అలా కాదు. వారి నియమకాలు వారే చేపడుతున్నారు’’అని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు.

కొలీజియంను అపారదర్శకమైనదని, బాధ్యతారాహిత్యమైన వ్యవస్థ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

సుప్రీం కోర్టు

2015లో కొలీజయం వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దశాబ్దాల కాలంనాటి కొలీజియం స్థానంలో ఒక ''ఫెడరల్ కమిషన్’’ ఏర్పాటు చేయాలని, దీనిలో న్యాయ శాఖ మంత్రికి కూడా చోటు ఉంటుందని కేంద్రం ఆ చట్టంలో పేర్కొంది.

అయితే, ఆ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమైనదని చెబుతూ దాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసింది. ''ప్రభుత్వంలోని ఇతర వ్యవస్థల నుంచి స్వతంత్రంగా వ్యవహరిస్తూ ప్రజల హక్కులను పరిరక్షించడంలో న్యాయ వ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తుంది’’అని ఆ తీర్పు ఇచ్చే సమయంలో రాజ్యాంగ ధర్మాసనంలో ఒక న్యాయమూర్తి పునరుద్ఘాటించారు.

ప్రజాస్వామ్యంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ తప్పనిసరి. కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల అతిక్రమణలకు చెక్ పెట్టడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే, భారత్‌లోని శక్తిమంతమైన న్యాయవ్యవస్థ గతంలో కేంద్రంలో ప్రభుత్వాలకు మడుగులొత్తిన సందర్భాలు కూడా ఉన్నాయి.

మరోవైపు కొన్ని అంశాలను చూసీచూడటన్లు వదిలేస్తారని, మరికొన్నింటి విషయాల్లో జాప్యం ప్రదర్శిస్తున్నారని కూడా న్యాయ వ్యవస్థపై విమర్శలు ఉన్నాయి.

సీనియారిటీని పట్టించుకోకపోవడం, బదిలీలు, పదోన్నతులను అడ్డుకోవడం లాంటి చర్యలతో న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిని కేంద్రం దెబ్బతిస్తోందని తన పుస్తకం ''సుప్రీం విష్పర్స్’’లో న్యాయవాది అభినవ్ చంద్రచూడ్ రాసుకొచ్చారు.

సుప్రీం కోర్టు

ప్రభుత్వాల అనవసర జోక్యానికి అడ్డుకట్ట వేయడంలో కొలీజియం వ్యవస్థ కొంతవరకు పనిచేసిందని చెప్పుకోవచ్చు. అయితే, దీనిలో పారదర్శకత కొరవడిందని రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, న్యాయకోవిదులు ఎప్పటికప్పుడే విమర్శలు చేస్తున్నారు.

ఖాళీల భర్తీలో ఆలస్యం చేయడం, ప్రక్రియలు మందకొడిగా ముందుకు వెళ్లడం లాంటి సమస్యలను ఎక్కువగా విమర్శకులు చూపిస్తున్నారు.

ప్రస్తుతం సుప్రీం కోర్టులో 34 మంది న్యాయమూర్తులు ఉండొచ్చు. అయితే, కేవలం 27 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అంటే ఉండాల్సిన దానికంటే ఏడుగురు న్యాయమూర్తులు తక్కువగా ఉన్నారు. మరోవైపు దాదాపు 100 మంది న్యాయమూర్తులపై కొలీజియం సిఫార్సులు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి.

ఇక్కడ న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉండటంతో బాధితులకు న్యాయం జరగడంలోనూ ఆలస్యం అవుతుంది. మొత్తంగా భారత్‌లోని కోర్టుల్లో 4 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 70,000 సుప్రీం కోర్టులోనే పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో కొన్ని ఐదేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి.

సుప్రీం కోర్టు

సుప్రీం కోర్టు పూర్తి సామర్థ్యంతో పనిచేసిన సందర్భాలు చాలా అరుదని సౌత్ కరోలినా యూనివర్సిటీకి చెందిన రాహుల్ హేమరాజాని బీబీసీతో చెప్పారు. ''సాధారణంగా 87 శాతం న్యాయమూర్తుల సామర్థ్యంతో కోర్టు పనిచేస్తోంది. ఖాళీల సంఖ్య ఇటీవల కాలంలో చాలా పెరుగుతోంది’’అని ఆయన అన్నారు.

1950 నుంచి 2020 మధ్య నియామకాలు, పదవీ విరమణల డేటాను ప్రస్తావిస్తూ 2015 తర్వాత ఈ ఖాళీల సంఖ్య మరింత ఎక్కువ అయ్యిందని రాహుల్ చెప్పారు.

ఉండాల్సిన న్యాయమూర్తుల సంఖ్య పెంచినప్పటికీ, 2015 నుంచి 2020 మధ్య కేవలం 28 మంది న్యాయమూర్తులను మాత్రమే నియమించారు. అంతకుముందు ఐదేళ్లలో 30 మంది న్యాయమూర్తులను నియమించారు.

2015 తర్వాత నియామకాల భర్తీకి సగటున 285 రోజులు పడుతోంది. అంతకుముందు ఇది 274 రోజులుగా ఉండేది.

సమస్య ఏమిటి?

ఉన్నత న్యాయ స్థానాల్లో ఖాళీల భర్తీ ఆలస్యం కావడానికి కొలీజియం భేటీల్లో ఆలస్యం కూడా ఒక కారణమని న్యాయ కోవిదులు చెబుతున్నారు.

ఇక్కడ కేవలం ప్రధాన న్యాయమూర్తి, ఆ తర్వాత నలుగురు సీనియర్ న్యాయమూర్తులు అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే సమావేశాలు జరుగుతుంటాయి. అక్టోబరు 2017 నుంచి 2020 మధ్య సుప్రీం కోర్టులో నియామకాల కోసం కొలీజియం కేవలం కేవలం 12 సార్లు మాత్రమే సమావేశమైందని రాహుల్ చెప్పారు.

ఇక్కడ ఖాళీలను ముందే ఊహించొచ్చు. ఎందుకంటే న్యాయమూర్తులు 65 ఏళ్ల తర్వాత పదవీ విరమణ పొందడంతో ఇక్కడ ఖాళీలు ఏర్పాడతాయి. కానీ, ఈ ఖాళీలను వెంటనే భర్తీ చేయడంలోనూ ఆలస్యం అవుతోంది. 1977 తర్వాత ఖాళీ అయిన వెంటనే పదవులను భర్తీ చేసినట్లు ఆధారాలు లేవు.

మరోవైపు ఖాళీల సిఫార్సులను విడివిడిగా కాకుండా బ్యాచ్‌ల వారీగా ప్రభుత్వానికి సుప్రీం కోర్టు పంపిస్తోంది. గత 100 మంది న్యాయమూర్తుల నియామకాల్లో 81 మంది ఇలా బ్యాచ్‌ల వారీగానే నియమితులయినట్లు రాహుల్ చెప్పారు.

న్యాయవ్యవస్థ నియామకాల్లో జాప్యానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం, ఆలస్యం చేయడమే కారణమని చాలా మంది భావిస్తున్నారు.

గత ఏడాది డిసెంబరు మధ్యలో సుప్రీం కోర్టులో నాయమూర్తులుగా నియమించేందుకు ఐదుగురి పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది. అయితే, వీటిపై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు.

''సుప్రీం కోర్టుతో కేంద్రం ఆటలు ఆడుతోంది’’అని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకుర్ వ్యాఖ్యానించారు.

భారత్‌లో న్యాయ సేవలు రెండు వ్యవస్థల మధ్య ఆధిపత్య పోరులో సతమతం అవుతున్నాయా? ''ఇక్కడ న్యాయ వ్యవస్థ ఆధిపత్యానికి పరిష్కారం కార్యనిర్వాహక వ్యవస్థ విపరీత జోక్యం కాదు. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యమిస్తూ, అందరినీ కలుపుకొని వెళ్లేలా పరిష్కారం ఉండాలి. అయితే, అలాంటి పరిష్కారమేమీ కనిపించడం లేదు’’అని న్యాయ కోవిదుడు గౌతమ్ భాటియా చెప్పారు.

''కొలీజియంలో చాలా లోపాలున్నాయి. కానీ, మిగతా ప్రత్యామ్నాయాలతో పోలిస్తే, ఇది కాస్త ఫర్వాలేదు’’అని సీనియర్ న్యాయవాది ఫాలి నారీమన్ అన్నారు.

అయితే, కొలీజియాన్ని న్యాయవ్యవస్థ, బార్, సివిల్ వ్యవస్థల ప్రతినిధులతో ఏర్పాటుచేసే జ్యుడీషియల్ కమిషన్‌తో భర్తీ చేయాలని విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీకి చెందిన ఆర్ఘ్య సేన్‌గుప్తా సూచించారు.

''కొలీజియంలో కేవలం మార్పులు చేస్తే సరిపోదు. న్యాయ వ్యవస్థలోని ఉన్నత నియామకాల విషయంలో ఎవరికీ అపరిమిత అధికారాలు ఉండకూడదు’’అని ఆయన అన్నారు.

దీంతో అసలు న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించాలా? అనే ప్రశ్న మొత్తానికి ప్రశ్నగానే మిగిలిపోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Supreme Court Collegium: Why the Controversy over Appointment of Judges?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X