
రాజీవ్ గాంధీ హత్య కేసు: దోషుల్లో ఒకరైన ఏజీ పెరరివాలన్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో కీలక దోషుల్లో ఒకరైన ఏజీ పెరరివాలన్‌కు సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. పెరరివాలన్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడటంతో 32 ఏళ్లుగా జైలులో ఉన్నాడు. జైలు నుంచి విడుదల చేయాలంటూ పెరరివాలన్ వేసిన పిటిషన్‌పై గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. బెయిల్‌ను కేంద్రం వ్యతిరేకిస్తోందని పేర్కొంది.
పిటిషనర్ ప్రవర్తన, అతని అనారోగ్యంతోపాటు అతను 30 ఏళ్లకు పైగా జైలులో గడిపిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, అతన్ని బెయిల్‌పై విడుదల చేయాలని అభిప్రాయపడుతున్నామని సుప్రీంకోర్టు వెల్లడించింది. 1991, మే 21న రాజీవ్ హత్య జరిగింది. ఆ తర్వాత ఈ కేసులో ఇప్పుడే తొలి బెయిల్ లభించింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో పెరరివాలన్ ఇప్పటికే పెరోల్‌పై బయట ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన బెయిల్ మంజూరు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పెరోల్‌పై ఉన్నప్పటికీ బయటకు వెళ్లలేని కారణంగా పెరరివాలన్ బెయిల్ కోరాడు.

రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా ఉన్న ఏజీ పెరరివాలన్ యావజ్జీవ కారాగార శిక్షను తగ్గించాలంటూ చేసిన అభ్యర్థన పిటిషన్ భారత రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండగా సుప్రీంకోర్టు బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. పెరరివాలన్ కు షరతులతో బెయిల్ మంజూరు అయింది. అయితే, ఆయన ప్రతి నెలా స్థానిక పోలీసు అధికారి ముందు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
Recommended Video
రాజీవ్ గాంధీ హత్య జరిగిన సమయంలో పెరారివాలన్ వయసు 19 ఏళ్లు. రాజీవ్ హత్యకు ఉపయోగించిన బెల్టు బాంబుల్లోని 9 వోల్ట్ బ్యాటరీలను పెరారివాలన్ సప్లై చేశాడు. ఈ కేసులో ట్రయల్ కోర్టు మొత్తం 29 మందిని దోషులుగా తేల్చి మరణశిక్ష విధించింది. వీరిలో 19 మందిని నిర్దోషులుగా, ఏడుగురిని దోషులుగా 1999లో సుప్రీం కోర్టు తేల్చింది. దోషులుగా తేలినవారిలో నళిని, మురుగన్, శాంతన్, పెరారివాలన్‌లకు మరణశిక్ష విధించగా మిగతావారికి యావజ్జీవ శిక్ష పడింది. 2014లో నళిని, మురుగన్, శాంతన్, పెరారివాలన్‌లకు విధించిన శిక్ష కూడా యావజ్జీవ శిక్షగా మార్చడం జరిగింది.