సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం- మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకుల విడుదలకు ఆదేశం..
1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని మానవబాంబుతో హత్య చేసిన కేసులో మూడు దశబ్దాలుగా జైళ్లలో మగ్గుతున్న ఆరుగురు హంతకులకు విముక్తి లభించింది. ఈ కేసులో కీలక నిందితురాలైన నళినితో పాటు మరో ఐదుగురిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.
అంతకుముందు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఆరుగురిని విడుదల చేసేందుకు వీలుగా తమిళనాడు ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను 2018లోనే గవర్నర్ ఆమోదించారు. అయినా కేంద్రం అభ్యంతరాలతో వీరు విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో ఆరుగురు దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఇప్పటికే సుదీర్ఘ కాలం శిక్ష అనుభవించడం, తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుని వీరిని విడుదల చేయాలని ఇవాళ ఆదేశాలు ఇచ్చింది.

ఈ ఏడాది మే నెలలో సుప్రీంకోర్టు ఈ కేసులో మరో నిందితుడైన పెరరివాలన్ ను తమ అత్యున్నత అధికారాన్ని ఉపయోగించి విడుదలకు ఆదేశించింది. అనంతరం మిగతా నిందితులు కూడా తమను కూడా విడుదల చేయాలని సుప్రీంకోర్టును కోరారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. నళినీ శ్రీధరన్ తో పాటు శ్రీహరన్, శాంతన్, మురుగన్, రాబర్ట్ పయాస్, ఆర్పీ రవిచంద్రన్ ను విడుదల చేయాలని ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. వాస్తవానికి తమిళనాడులో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజీవ్ హంతకుల విడుదల వ్యవహారం భావోద్వేగపరమైన అంశంగా మారిపోయింది. రాజీవ్ హంతకు కుట్ర చేసి అమలు చేశారన్న ఆరోపణలు రుజువుకావడంతో మొత్తం ఏడుగురికి గతంలో ఉరిశిక్ష విధించారు. అయితే ఇందులో నళినిని క్షమిస్తున్నట్లు రాజీవ్ భార్య సోనియాగాంధీ, పిల్లలు రాహుల్, ప్రియాంక జైల్లో ఆమెను కలిసిన తర్వాత ప్రకటించారు. దీంతో సుప్రీంకోర్టు 2000 సంవత్సరంలో ఆమె ఉరిశిక్షను కాస్తా జీవితకాల ఖైదుగా మార్చింది. 2014లో మిగిలిన దోషులకు కూడా ఉరిశిక్ష జీవితఖైదుగా మారింది. అప్పటి నుంచి విడుదల కోసం వీరు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికి ఫలించాయి.












Click it and Unblock the Notifications