కోహ్లీతో చెప్పించండి.. బాణాసంచా బ్యాన్ పై సుప్రీం కామెంట్స్
దీపావళి పండుగ వేళ ప్రజల ఆనందోత్సాహాలను, భావోద్వేగాలను తాము గౌరవిస్తామని.. అంతమాత్రాన బాణసంచాపై పూర్తిస్థాయి నిషేధం విధించడమే ఏకైక పరిష్కారం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే, కాలుష్య నియంత్రణపై తమ మునుపటి ఉత్తర్వులను అమలు చేయడంలో తీవ్రంగా విఫలమైన ఢిల్లీ ప్రభుత్వం, ఎయిర్ క్వాలిటి కంట్రోల కమిషన్ (CAQM) తీరుపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనల అమలును క్షేత్రస్థాయిలో చూపించకుండా, ప్రతి ఏటా కాగితాల మీద నివేదికలు సమర్పిస్తూ కోర్టు ఉత్తర్వులను హేళన చేయవద్దని ఘాటుగా హెచ్చరించింది.
సామాన్యులపై కేసులు కాదు.. నిబంధనల అమలు ముఖ్యం!
కోర్టు ఆదేశాలు కేవలం అఫిడవిట్లకు మాత్రమే పరిమితం కాకూడదని, పండుగల వేళ ప్రజల ఉత్సాహాన్ని అర్థం చేసుకుంటూనే ఇతరులకు హాని కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. సాధారణ పౌరులపై కేసులు నమోదు చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదని, బాణసంచా కాల్చడం వల్ల కలిగే తీవ్ర పరిణామాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించింది. "ఇది పండుగ ఉత్సాహం.. దీనిని మేము అర్థం చేసుకోగలం. అయితే, ఎవరికీ హాని కలగకుండా పండుగలు ఎలా జరుపుకోవాలనే దానిపై అధికారులు దృష్టి పెట్టాలి. మీరు నిజంగా క్షేత్రస్థాయిలో ఏం చర్యలు తీసుకున్నారో స్పష్టమైన డేటాతో చెప్పకపోతే ఆదేశాలు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏముంది?" అని న్యాయస్థానం ప్రశ్నించింది.

'దీపావళి వెలుగుల పండుగ.. బాణసంచా కాకముందు అన్నీ సుందరమే'
విచారణ సందర్భంగా ధర్మాసనం ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేసింది. "దీపావళి అనేది వెలుగుల పండుగ. ఆనాడు ప్రమిదలు, దీపాలు వెలిగించే సంప్రదాయం ఎంతో సుందరంగా ఉండేది. బాణసంచా సంస్కృతి వచ్చిన తర్వాతే వాయు కాలుష్య సమస్యలు మొదలయ్యాయి. అసలు సమస్య వెలుగుతో కాదు.. పొగ, నిప్పుతోనే" అని అభిప్రాయపడింది. వాయు కాలుష్యం పిల్లల ఆరోగ్యంపై, పౌరుల ఆయుర్దాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నప్పటికీ.. సమాజంలో దీనిపై తగినంత తీవ్రతతో చర్చ జరగకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. బాణసంచా కాల్చేందుకు అనుమతించిన రెండు రోజుల్లో కాలుష్య భారం తగ్గించేందుకు నిర్మాణ రహిత కార్యకలాపాలను పూర్తిగా నిషేధించాలని అధికారులకు సూచించింది.
విరాట్ కోహ్లీ వంటి ప్రముఖులతో అవగాహన కల్పించండి!
ప్రజల్లో కాలుష్య పరిణామాలపై స్పృహ పెంచేందుకు క్రికెటర్ విరాట్ కోహ్లీ వంటి ఫేమస్ క్రీడాకారులు, ప్రజాదరణ ఉన్న ప్రముఖులను భాగస్వాములను చేయాలని సుప్రీంకోర్టు కోరింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో వాయు నాణ్యత పడిపోకుండా నిఘా బృందాలు నిర్దిష్టంగా ఎక్కడ తనిఖీలు చేశాయో తెలిపే స్పష్టమైన వివరాలు లేకపోవడాన్ని తప్పుపట్టింది. అధికారులు తమ సన్నద్ధతను కేవలం ప్రణాళికల్లో మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో బాణసంచా నిబంధనలను కఠినంగా అమలు చేసి చూపించాలని ఆదేశిస్తూ విచారణను ముగించింది.














Click it and Unblock the Notifications
