Bihar Polls: బీహార్ ఓటర్ల జాబితా సవరణపై సుప్రీం డౌట్స్ ! కీలక ఆదేశాలు..!
బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇందులో భాగంగా ఆధార్ ను కాకుండా మిగతా గుర్తింపు కార్డుల్నే అనుమతిస్తామంటూ ఎన్నికల సంఘం పెట్టిన షరతు ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది.
ఇందులో సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘం బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఎన్నికలకు రెండు నెలల ముందు చేపట్టిన ఈ ప్రక్రియ వల్ల ఓట్లు కోల్పోయిన వారు న్యాయపోరాటం చేసేందుకు వీల్లేకుండా పోతుందని జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఆక్షేపించింది.

ఎన్నికల సంఘం బీహార్ లో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై తమకు అభ్యంతరాలు లేకపోయినా అది చేపట్టిన సమయంపై మాత్రం అనుమానాలు ఉన్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఓసారి ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాలు ఖరారు చేసిన తర్వాత తిరిగి అందులో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోలేదని, అటువంటప్పుడు ఓట్లు కోల్పోయిన వారి పరిస్దితి ఏంటని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది.

ఎన్నికల సంఘం అధికారాల్ని తాము ప్రశ్నించడం లేదని, కానీ అది చేపట్టిన ప్రక్రియపైనే తమకు అభ్యంతరాలు ఉన్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ముఖ్యంగా ఆధార్ ను ఓటరు గుర్తింపు కార్డు కోసం తీసుకోకపోవడాన్ని ఆక్షేపించింది. ఆధార్ తో పాటు రేషన్ కార్డు, ఓటరు కార్డుల్ని ఓటు వేసేందుకు అనుమతించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో జూలై 21 కల్లా ఈసీ కౌంటర్ దాఖలు చేయాలని, 28న దీనిపై తిరిగి విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications