పెళ్లికి ముందు సె*క్సువల్ రిలేషన్: సుప్రీంకోర్టు అదిరిపోయే క్లారిటీ!
ఒక అభ్యర్థి తన వ్యక్తిగత జీవితంలో నడిపిన ప్రేమ బంధం.. పెళ్లితో ముగియనంత మాత్రాన అతని క్యారెక్టర్‌ను తక్కువ అంచనా వేయవచ్చా? పాత లవ్ ట్రాక్, ఆ కారణంగా గతంలో నమోదైన ఒక క్రిమినల్ కేసును సాకుగా చూపి ప్రభుత్వ ఉద్యోగాన్ని నిరాకరించడం చట్టబద్ధమేనా? ఈ అంశాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) సామాజిక దృక్పథంతో కూడిన ఒక సంచలన తీర్పును వెలువరించింది.
తెలంగాణకు చెందిన గజ్వేల తిరుపతి అనే అభ్యర్థి అన్ని అర్హతలతో 'పోలీస్ కానిస్టేబుల్' పోస్టుకు ఎంపికయ్యారు. అయితే, ఆయనపై గతంలో ఐపీసీ సెక్షన్లు 417, 420, 506 కింద ఒక కేసు నమోదైంది. పొరుగున ఉన్న మహిళతో నాలుగేళ్లు ప్రేమ వ్యవహారం నడిపి, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ తర్వాత వేరే మహిళను వివాహం చేసుకున్నారనేది ఆరోపణ. అయితే, ఈ వివాదం 2015లోనే లోక్ అదాలత్ ద్వారా ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కారమైంది. ఈ విషయాన్ని ఆయన తన అటెస్టేషన్ ఫారమ్‌లో ముందే వెల్లడించారు. అయినప్పటికీ, ఇది 'నైతిక పతనం' (Moral Turpitude) కిందకు వస్తుందని భావించిన తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, ఆయన నియామకాన్ని రద్దు చేసింది.

సుప్రీంకోర్టు ఘాటు విమర్శలు.. ఏకపక్ష నిర్ణయం చెల్లదు!
ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రిక్రూట్‌మెంట్ బోర్డు తీసుకున్న నిర్ణయం పూర్తిగా ఏకపక్షమని తేల్చింది. సంబంధిత ఇరుపక్షాలూ మేజర్లని, వారి మధ్య పరస్పర అంగీకారంతోనే నాలుగేళ్లు సంబంధం కొనసాగిందని కోర్టు గుర్తుచేసింది. ఇందులో ఎలాంటి బలవంతపు చర్యలు లేవని, లోక్ అదాలత్ సెటిల్మెంట్‌ను అపరాధ అంగీకారంగా పరిగణించడం అధికారుల 'అవివేకపూరిత' చర్య అని న్యాయస్థానం విమర్శించింది. కేవలం ఊహల ఆధారంగా ఒక అభ్యర్థి కెరీర్‌ను దెబ్బతీయలేరని స్పష్టం చేసింది.
ప్రతీ బంధం పెళ్లితోనే ముగియాలా..?
ప్రస్తుత ఆధునిక సమాజ వాస్తవాలను అధికారులు గుర్తించాలని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ లతో కూడిన ధర్మాసనం సూచించింది. "ప్రస్తుత సమాజంలో వివాహానికి ముందు ఇటువంటి సంబంధాలు సర్వసాధారణం. పెళ్లికాని ఇద్దరు వ్యక్తులు తమ అంగీకారంతో కలిసుండటాన్ని దేశంలో ఏ చట్టమూ నిషేధించలేదు. ప్రతి సంబంధం ఖచ్చితంగా వివాహంతోనే ముగియాలనే నిబంధన లేదు. పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకుని, విడిపోయినంత మాత్రాన క్యారెక్టర్‌ను తప్పుబట్టలేం " అని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
తక్షణమే నియామకం చేపట్టాలని ఆదేశం
బాధితుడు ఎక్కడా ఏ విషయాన్ని దాచలేదని, ఇది పూర్తిగా ఇద్దరి మధ్య జరిగిన ప్రైవేట్ వ్యవహారమని కోర్టు స్పష్టం చేసింది. ఫలితంగా, తిరుపతి నియామకాన్ని రద్దు చేస్తూ గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన పాత ఉత్తర్వులను పునరుద్ధరిస్తూ, తిరుపతికి తక్షణమే పోలీస్ కానిస్టేబుల్‌గా నియామక పత్రాలు అందజేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.














Click it and Unblock the Notifications