ఢిల్లీపై పెత్తనం ఎవరిది ? సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
ఢిల్లీలో కొన్నేళ్లుగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికీ, కేంద్రం నియమిస్తున్న లెఫ్టినెంట్ గవర్నర్లకు మధ్య వార్ కొనసాగుతోంది. ఢిల్లీలో ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడంలో విఫలమవుతున్న బీజేపీ.. కేంద్రంలో తమకున్న అధికారంలో లెఫ్టినెంట్ గవర్నర్లను నియమించి వారితో ఢిల్లీపై పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆప్ ప్రభుత్వానికీ, లెఫ్టినెంట్ గవర్నర్ కూ మధ్య జరుగుతున్న పోరుపై గతంలో విచారణ జరిపిన కోర్టులు.. ప్రభుత్వం కంటే గవర్నర్ కే అధికారం ఉందని తేల్చిచెప్పాయి. ఇవాళ సుప్రీంకోర్టు ఆ తీర్పుల్ని కొట్టేసింది.
ఢిల్లీలో కార్యనిర్వాహక అధికారం విషయంలో ప్రభుత్వానికీ, లెఫ్టినెంట్ గవర్నర్ కూ మధ్య జరుగుతున్న పోరు సుప్రీంకోర్టుకు చేరిన నేపథ్యంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాదని కేంద్రం నియమిస్తున్న లెఫ్టినెంట్ గవర్నర్లు ప్రతీ విషయంలో జోక్యం చేసుకుంటూ పాలనకు ఆటంకాలు కలిగిస్తున్నారని ఆప్ ప్రభుత్వం వాదించింది. దీనిపై విచారణ జరిపిన ఛీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం.. లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయాల్సిందేనని ఏకగ్రీవంగా తేల్చిచెప్పింది.

ఢిల్లీలో పాలన కూడా ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఉంటుందని, లెఫ్టినెంట్ గవర్నర్ సైతం ఇతర రాష్ట్రాల తరహాలోనే ప్రభుత్వ నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు ఢిల్లీలో సర్వీసుల విషయంలో తమకే అధికారం ఉండాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం వాదనతో ఏకీభవించింది. దీంతో ఇప్పటివరకూ లెఫ్టినెంట్ గవర్నర్ల నియామకంతో ఆప్ ప్రభుత్వంపై పైచేయి సాధించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.












Click it and Unblock the Notifications