UGC కుల వివక్ష నిరోధక రూల్స్ పై కేంద్రం యూటర్న్ ? అగ్రకులాల వ్యతిరేకత వేళ..!
యూనివర్శిటీలతో పాటు ఉన్నత విద్య సంస్థల్లో కుల వివక్షను రూపుమాపే లక్ష్యంతో యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఈ ఏడాది కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇందులో ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీలకు కూడా రక్షణ కల్పించింది. దీనిపై అగ్రవర్ణాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. త్వరలో ఉత్తరాదిలోని యూపీ, పంజాబ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గతంలో యూజీసీ నిబంధనల్ని (UGC Equity Regulations) గతంలో సమర్దించిన కేంద్రం.. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
కుల వివక్షలతో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల తల్లి రాధిక, డాక్టర్ పాయల్ తద్వీ తల్లి ఆబేదా సలీమ్ 2019లో ఈ మేరకు యూనివర్సిటీల్లో ఎలాంటి కుల వివక్ష లేకుండా నిబంధనలు విధించేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యూజీసీ ఈ కొత్త కుల వివక్ష నిరోధక నిబంధనల్ని తీసుకొచ్చింది. ఈ ఏడాది జనవరిలో యూజీసీ ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చిన తర్వాత, వీటికి వ్యతిరేకంగా పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన సుప్రీంకోర్టు.. ఈ నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయని, దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ వీటి అమలుపై స్టే విధించింది. ఇప్పడు వీటిపై విచారణ సందర్బంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా .. వీటిని కేంద్రం పునఃపరిశీలిస్తుందని కోర్టుకు తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.

మరోవైపు ఉన్నత విద్యాసంస్థల్లో సమానత్వాన్ని తీసుకురావడానికి తెచ్చిన ఈ నిబంధనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వేషన్ లేని జనరల్ కేటగిరీ విద్యార్థులు ఈ నిబంధనలను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. నూతన నిబంధనలు సాధారణ కేటగిరీ విద్యార్థులపై వివక్ష చూపేలా ఉన్నాయని, ముఖ్యంగా నిబంధన 3(1)(సి)లో పేర్కొన్న కుల వివక్ష నిర్వచనాన్ని పూర్తిగా కుల రహితంగా మార్చాలని వారు వాదిస్తున్నారు. మరోవైపు రిజర్వ్‌డ్ తరగతుల విద్యార్థులు ఈ నిబంధనల ఉపసంహరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విద్యాసంస్థల్లో భద్రత, సమానత్వం కల్పించే ప్రక్రియపై ఉన్న అభ్యంతరాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్పులు తీసుకు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.













Click it and Unblock the Notifications