సింగరేణి కార్మికులకు భారీ శుభవార్త.. బోనస్ ప్రకటించిన కేంద్రం.. ఒక్కొక్కరికి ఎంతంటే..?
మరికొద్ది రోజుల్లో దసరా, దీపావళి, నవరాత్రి పండుగలు రానున్నాయి. ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ ప్రకటించింది. సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 1,10,250 చొప్పున బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు అందుకు సంబంధించిన వివరాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశానికి వెలుగులు పంచేందుకు పగలు, రాత్రి కష్టపడి పనిచేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని అన్నారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదు.. సింగరేణి పరిశ్రమ మన తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారం అని స్పష్టం చేశారు.
లక్షలాది కుటుంబాలకు జీవనాధారం.. దేశాభివృద్ధిలో, తెలంగాణ అభివృద్ధిలో కీలక భాగస్వామి అని వివరించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, సింగరేణి భవిష్యత్తు కోసం సింగరేణి యాజమాన్యం, కార్మికులు మరింత సమన్వయంతో పనిచేయాలని కోరుతున్నానని తెలిపారు. ప్రస్తుత అవసరాలు, భవిష్యత్తు దృష్ట్యా సింగరేణి కూడా బొగ్గు ఉత్పత్తిని మరింతగా పెంచేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని పేర్కొన్నారు.
అలాగే దేశ ప్రగతిలో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి మరింత కీలకపాత్ర పోషించాలని కోరుతున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సింగరేణికి ఇవ్వాల్సిన రూ.60 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ మేరకు సింగరేణి కార్మికులకు, ఉద్యోగులు వారి కుటుంబసభ్యులకు దసరా, దీపావళి పండుగల సందర్భంగా ముందస్తు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక గతేడాది కోలిండియా, అనుబంధ సంస్థలతోపాటు సింగరేణి కార్మికులకు రూ.1,03,000 పీఎల్ ఆర్ అందించారు. ఈ ఏడాది కాస్త పెరిగడంతో కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన సమావేశంలో యూనియన్ ప్రతినిధులు రూ.1.20 లక్షల పీఎల్ ఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు యాజమాన్యం ప్రతిపాదనలతో చర్చలు కొనసాగించారు. అయితే చివరకు రూ.1,10,250 పీఎల్ ఆర్ పై ఏకాభిప్రాయం కుదిరినట్లు కార్మిక సంఘాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications
