ఫారం 7తో భారీగా ఓట్ల తొలగింపు..! తెలంగాణ సీఈఓ కీలక ఆదేశాలు..!
తెలంగాణలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం(SIR)లో అర్హులైన ఓటర్లను కూడా భారీ ఎత్తున తొలగిస్తున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఫామ్ 7 (Form 7 ) ను వాడి ముస్లిం ఓటర్లను పలు నియోజకవర్గాల్లో తొలగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి సంబంధిత అధికారులకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.
రాష్ట్రంలో జరుగుతున్న ప్రత్యేక విస్తృత ఓటర్ల జాబితా సవరణ సమయంలో అర్హులైన ఓటర్లను జాబితా నుండి తప్పుగా తొలగించడానికి ఫారం 7లను సమర్పించిన వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని సీఈఓ సుదర్శన్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, హైదరాబాద్ జిల్లా విద్యాధికారి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లు, డిఇఓలకు ఆదేశాలు జారీ చేశారు. ఈఆర్ఓల ముందు ఫారం 7లో పెద్దమొత్తంలో దరఖాస్తులు దాఖలు చేస్తున్న ఉదంతాలు తమ కార్యాలయం దృష్టికి వచ్చాయని, అలాంటి ఫారాలు నిజమైనవి కావని కూడా ఆరోపణలు ఉన్నాయని నోట్ లో తెలిపారు.

ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 31 నిబంధనల ప్రకారం ఫారం 6, 6A, 7, 8 లలో తెలిసి తప్పుడు వాంగ్మూలం లేదా రాతపూర్వక ప్రకటన చేసిన దరఖాస్తుదారులపై కలెక్టర్లు, డిఇఓలు, ఇఆర్‌ఓలతో సహా అధికారులు చర్య తీసుకోవాలని ఆ మెమోలో పేర్కొన్నారు. అలా చేయడానికి ముందు ఓటర్ల నమోదు నియమావళి 1960లోని రూల్ 20 ప్రకారం విచారణ జరపాలని కూడా ఆ మెమోలో తెలిపారు. ఫారం 7 దుర్వినియోగం ఆరోపణలపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల కార్యాలయం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సీఈఓ ఈ ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే హైదరాబాద్ పరిధిలోని ముషీరాబాద్, బహదూర్ పుర, గోషా మహల్ వంటి నియోజకవర్గాల్లో బీజేపీ బీఎల్ఏలు ఇచ్చిన ఫామ్ 7 దరఖాస్తుల ఆధారంగా భారీ ఎత్తున ఓట్లు తొలగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సీఈఓ ఈ ఆదేశాలు ఇచ్చారు.














Click it and Unblock the Notifications
