TCS మెడకు ఫామ్ 6 ఉచ్చు ? ఈసీతో పాటు టార్గెట్ చేసిన రాహుల్ ..!
కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల నమోదు కోసం ఇచ్చే ఫామ్ 6 దరఖాస్తుల్లో గతంలో మార్పులు చేసింది. వీటి ప్రకారం తల్లితండ్రులు, వాళ్ల తల్లితండ్రుల పేర్లను కూడా అడిగింది. తద్వారా ఫామ్ 6 (Form 6 ) దరఖాస్తుల్ని తిరస్కరించడం సులువుగా మారింది. దీని వల్ల భారీ ఎత్తున యువ ఓటర్లు ఓటు హక్కు కోల్పోయారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే అంశంపై గతంలో ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్లు సీఈసీ జ్ఞానేష్ కుమార్ కు తమ అభ్యంతరాలు తెలిపారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ఇచ్చింది. ముప్పేట దాటితో ఎన్నికల సంఘం తాజాగా ఫామ్ 6లో గతంలో చేసిన ఆ మార్పుల్ని వెనక్కి తీసుకుంది.
ఈ నేపథ్యంలో అసలు ఫామ్ 6లో మార్పులకు ఆదేశాలు ఎవరి నుంచి వెళ్లాయి, ఎవరు వీటిని ఆమోదించారు, ఇందులో సాఫ్ట్ వేర్ నిర్వహిస్తున్న టీసీఎస్ పాత్ర ఎంత అన్న అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. వీటిపై ఇవాళ విపక్ష నేత రాహుల్ గాంధీ ఈసీతో పాటు టీసీఎస్ ను కూడా ప్రశ్నిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఫామ్ 6లో చేసిన మార్పులకు ఎవరి నుంచి ఆదేశాలు వెళ్లాయి, వాటిని ఎవరు ఆమోదించారంటూ ప్రశ్నించారు. అలాగే టీసీఎస్ లో ఈ మార్పులకు ఎవరు ఆమోదం తెలిపారని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రశ్నించారు.

The online Form 6 was changed illegally - as the EC's own Commissioners have recorded.
— Rahul Gandhi (@RahulGandhi) October 1, 2026
Who at the ECI ordered Tata Consultancy Services to make that change?
Who at TCS signed off on it? And were they pressured into doing it?
ఆన్‌లైన్ 'ఫారం 6' చట్టవిరుద్ధంగా మార్చారని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనిని స్వయంగా ఎన్నికల సంఘలో కమిషనర్లే అభ్యంతరంగా నమోదు చేశారని రాహుల్ గుర్తుచేశారు. ఆ మార్పులు చేయమని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)ను ఎన్నికల సంఘంలో ఎవరు ఆదేశించారని ఆయన ప్రశ్నించారు. టీసీఎస్ లో ఎవరు దీనికి ఆమోదం తెలిపారని కూడా అడిగారు. అలాగే, అలా చేయడానికి వారిపై ఒత్తిడి తీసుకువచ్చారా అని కూడా రాహుల్ గాంధీ వరుసగా ప్రశ్నలు సంధించారు. దీంతో టీసీఎస్ కూడా ఈ వ్యవహారంలో జవాబు చెప్పాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. ముఖ్యంగా ఈసీ నుంచి తమకు వచ్చిన ఆదేశాలు, వాటి అమలుకు సంస్ధలో ఎవరు ఆమోదం తెలిపారన్న అంశాల్ని ఇప్పుడు టీసీఎస్ బయటపెడుతుందా లేక ఈసీపైనే నెపం వేసి తప్పించుకుంటుందా అన్న చర్చ జరుగుతోంది.













Click it and Unblock the Notifications
