నిప్పుతో చెలగాటమా ? పంజాబ్, తమిళనాడు గవర్నర్లపై సుప్రీంకోర్టు కన్నెర్ర !
పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, తమిళనాడు గవర్నర్ బీఎన్ రవిపై సుప్రీంకోర్టు ఇవాళ సీరియస్ అయింది. తాము గవర్నర్లుగా ఉన్న రాష్ట్రాల అసెంబ్లీలు పంపిన బిల్లుల్ని ఆమోదించకుండా రాజకీయాలు చేయడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు నిప్పుతో చెలగాటం అడుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు గవర్నర్లపై ఆయా ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా సీజే ఫైర్ అయ్యారు.
అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ పంజాబ్, తమిళనాడు ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా గవర్నర్లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం... ఎన్నికైన అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆలస్యం చేయవద్దని ఇరువురు గవర్నర్‌లను కోరింది. దయచేసి ఎన్నికైన అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల గమనాన్ని మళ్లించవద్దు, ఇది చాలా తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.

మీరు నిప్పుతో ఆడుకుంటున్నారు. గవర్నర్ ఇలా బిలుల్ని ఎలా ఆపుతారు ? పంజాబ్‌లో జరుగుతున్న దానితో మేము సంతోషంగా లేమని సీజే చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కొనసాగిస్తున్నామా అని గవర్నర్లను ప్రశ్నించారు. భారతదేశం సంప్రదాయాలపై నడుస్తోందని, వాటిని అనుసరించాల్సిన అవసరం ఉందని సీజేఐ చంద్రచూడ్ ఈ సందర్భంగా ఇద్దరు గవర్నర్లకు గుర్తుచేశారు.
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ఆమోదం తెలపడంలో జాప్యం చేస్తున్నారని పంజాబ్ ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పంజాబ్ ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ.. ఆర్థిక నిర్వహణ, విద్యకు సంబంధించిన ఏడు బిల్లులను గవర్నర్ వెనక్కి తీసుకున్నారని చెప్పారు. జూలైలో గవర్నర్ ఆమోదం కోసం బిల్లులు పంపించామని, ఆయన నిష్క్రియాపరత్వం పాలనపై ప్రభావం చూపిందని అన్నారు.దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ తీసుకున్న చర్యల వివరాలను రికార్డులో ఉంచాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది.












Click it and Unblock the Notifications