భారీ షాక్: శశికళను దోషిగా నిర్ధారించిన సుప్రీం, నాలుగేళ్లు జైలు, పన్నీరింట సంబరం
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి అయిన శశికళ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా? లేదా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలి జైలు పాలవుతారారా?
చెన్నై: దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళను దోషిగా నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు.. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అంతేగాక, నాలుగు వారాల్లోగా లొంగిపోవాలంటూ శశికళకు ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు జడ్జీలు పినాకి చంద్రఘోష్, అమితవ రాయ్‌లు ఆమెను దోషిగా తేల్చారు. 20ఏళ్ల ఈ కేసులో శశికళ సహా ఇళవరసి, సుధాకరన్‌లను కూడా సుప్రీం కోర్టు దోషిగా తేల్చింది.
శశికళకు రూ. 10 కోట్ల జరిమానా విధిస్తున్నట్టు న్యాయమూర్తి పినాకి చంద్రఘోష్ చెప్పారు. ఈ కేసును తనతో పాటు విచారించిన అమితవ్ రాయ్ ఇప్పుడు ఆయన తీర్పును చెబుతారని అన్నారు. ఆ తర్వాత జస్టిస్ అమితవ్ రాయ్ తన తీర్పును వెలువరిస్తూ, అవినీతి విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేసులోని నిందితులందరినీ దోషులుగా ప్రకటిస్తున్నానని తీర్పునిచ్చారు.

అయితే, శశికళ ఇప్పటికే ఆరునెలల శిక్షను అనుభవించడంతో మరో మూడున్నరేళ్లు ఆమె జైలుకి వెళ్లవలసి ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు మాజీ అడ్వొకేట్ జనరల్ బీవీ ఆచార్య మాట్లాడుతూ.. మన జుడీషియరీ ఎంతబలంగా ఉందో ఈ తీర్పు ద్వారా తెలుస్తుందని ఉద్ఘాటించారు.
కాగా, సుప్రీం తీర్పుతో పదేళ్లు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయారు శశికళ. ఈ క్రమంలో అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఇంటివద్ద సంబరాలు మొదలయ్యాయి. శశికళ దోషిగా తేలిన నేపథ్యంలో పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టేందుకు లైన్ క్లియర్ అయ్యిందని చెప్పవచ్చు.

అంతకుముందు కథనం..
దివంగత ముఖ్యమంత్రి జయలలిత, శశికళను నిర్దోషులుగా ప్రకటిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక ప్రభుత్వం, ఇతరులు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జయలలిత మరణించినందున ఆమెపై కేసు వీగిపోవచ్చు. ఈ కేసులో శశికళతో పాటు ఆమె బంధువులు వి.ఎన్.సుధాకరన్, ఇళవరసి కూడా నిందితులుగా ఉన్నారు.
శశికళపై తిరుగుబాటుబావుటా ఎగరవేసి ముఖ్యమంత్రిగా కొనసాగాలనుకుంటున్న ఒ.పన్నీరు సెల్వం రాజకీయ భవిష్యత్తుకూ ఇదే తీర్పు కీలకం కానుంది. శశికళకు వ్యతిరేకంగా తీర్పు వస్తే పన్నీరుకు లైన్ క్లియర్ అవుతుంది. కాగా, సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో చెన్నైతోపాటు తమిళనాడు వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. కీలక ప్రాంతాల్లో బలగాలను మోహరించారు.
శశికళ నిర్దోషి అని తేలితే..
శశికళ అన్ని అభియోగాల్లోనూ నిర్దోషి అని తేలితే తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టకుండా అడ్డుకునే న్యాయపరమైన అవరోధాలు పెద్దగా ఉండవు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఆరు నెలల లోపు శాసనసభకు ఎన్నికవ్వాల్సి ఉంటుంది.
దోషి అని తేలితే...
శశికళ దోషి అని తేలితే ఆమెను అరెస్టు చేసి కర్ణాటక జైలుకు తరలిస్తారు. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించరు. ఆమె శిబిరం కొత్త నేతను ఎంచుకోవాలో లేదా పన్నీరు సెల్వం శిబిరంలో చేరాలో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications