కులగణనపై సుప్రీం సంచలన తీర్పు, 'ఇది ప్రభుత్వ ఇష్టం'
దేశంలో కులగణన (Caste Census) నిర్వహణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న కులగణనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం బుధవారం సంచలన తీర్పుతో కొట్టివేసింది. వెనుకబడిన కులాల జనాభా ఎంతో కచ్చితంగా తెలిసినప్పుడే దేశంలో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు తేల్చి చెప్పింది.
కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న కులగణనను సవాల్ చేస్తూ సుధాకర్ గుమ్మల అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు (కేసు: సుధాకర్ గుమ్మల v/s యూనియన్ ఆఫ్ ఇండియా | డైరీ నెం. 50275/2025). ఈ పిటిషన్‌ను బుధవారం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలిలతో కూడిన ధర్మాసనం విచారించింది.

విచారణ సందర్భంగా, దేశంలో కులాల సమాచారాన్ని సేకరిస్తే అది దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని పిటిషనర్ తరపున సుధాకర్ వాదించారు. ఈ డేటా గనుక కార్పొరేట్ సంస్థలు, రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్తే సమాజంలో తీవ్ర సమస్యలు వస్తాయని, అసలు ఈ విధమైన డేటా సేకరణ దేశానికి అవసరం లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే ప్రభుత్వాల వద్ద తగినంత డేటా ఉందని కూడా పేర్కొన్నారు.
పిటిషనర్ వాదనలను తోసిపుచ్చిన సీజేఐ ధర్మాసనం!
పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలను సుప్రీంకోర్టు ధర్మాసనం పూర్తిగా తోసిపుచ్చింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. "ఇవన్నీ పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన (Policy) అంశాలు. దేశంలో జనాభా గణన అనేది కుల ఆధారితంగా ఉండాలా వద్దా అనేది పూర్తిగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం. ఇందులో ఎలాంటి తప్పు లేదు" అని స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి ఆ సమాచారం అవసరం: సుప్రీంకోర్టు
"ఏ ప్రభుత్వానికైనా సరే, సమాజంలో వెనుకబడిన తరగతులకు చెందిన వారు ఎంత మంది ఉన్నారనే సంఖ్య తెలియడం చాలా అవసరం. వారి జనాభా ఎంతో తెలిస్తేనే, వారి సంక్షేమ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం ప్రణాళికలు రచించగలదు. ఇది పూర్తిగా ప్రభుత్వ పాలసీ పరిధిలోనిదే" అని సీజేఐ అభిప్రాయపడ్డారు.
వెనుకబడిన తరగతుల సంక్షేమం మరియు వారి సమగ్ర అభివృద్ధి కోసం ఈ సంఖ్యలు ప్రభుత్వానికి దిక్సూచిలా పనిచేస్తాయని న్యాయస్థానం పేర్కొంది. కులగణన ప్రక్రియ అనేది ప్రభుత్వ పరిధిలోని అంశం కాబట్టి న్యాయపరంగా తాము ఇందులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ సుధాకర్ గుమ్మల దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టదలచిన కులగణన ప్రక్రియకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయినట్లయింది.


Click it and Unblock the Notifications