సీఎం విజయ్ కేసును తేల్చేసిన సుప్రీం: కోర్టును రాజకీయ వేదికగా మార్చొద్దంటూ హితబోధ
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కరూర్ తొక్కిసలాట కేసు వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోవాల్సిందిగా ప్రతిపక్ష డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయస్థానాలను రాజకీయ వేదికగా మార్చవద్దని హితబోధ చేసింది. ఈ సందర్భంగా పిటిషనర్లకు సుప్రీంకోర్టు గట్టి హెచ్చరికలు ఇచ్చింది.
కరూర్ జిల్లాలో 2025 సెప్టెంబర్ 27న టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సభకు ఊహించిన దానికంటే అత్యధిక సంఖ్యలో జనం ఒక్కసారిగా తరలిరావడంతో ఈ ఘటన సంభవించింది. ఇందులో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

టీవీకే అధికారంలోకి వచ్చిన అనంతరం దీనిపై తాజాగా డీఎంకే సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. కొందరు మంత్రులు సాక్షులను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తోన్నారని ఆరోపిస్తూ ఆ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి భారతి ఈ పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరాధేతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల వెకేషన్ బెంచ్ కొద్దిసేపటి కిందటే విచారణ చేపట్టింది.
డీఎంకే తరఫున సీనియర్ అడ్వొకేట్ రంజిత్ కుమార్ తన వాదనలను వినిపించారు. టీవీకే తరఫున నీరజ్ కిషన్ కౌల్ వాదించారు. ప్రభుత్వంలో కీలక పదవుల్లో కొనసాగుతూ తమ అధికార బలంతో దర్యాప్తును ప్రభావితం చేయడానికి కొందరు మంత్రులు ప్రయత్నిస్తున్నారని రంజిత్ కుమార్ అన్నారు. బహిరంగ వేదికలపై చేస్తున్న వ్యాఖ్యలు కేసు దర్యాప్తు దిశను మార్చేలా, కొత్త ప్రచారానికి తెరలేపేలా ఉన్నాయని చెప్పారు.
ఆయన వాదనలతో బెంచ్ ఏకీభవించలేదు. కరూర్ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తును నిష్పక్షపాతంగా నిర్వహించడానికి ఇప్పటికే సీబీఐకి అప్పగించిన విషయాన్ని గుర్తు చేసింది. దర్యాప్తు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ప్రత్యర్థి పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను తాము ఎలా స్వీకరిస్తామని ప్రశ్నించింది. రాజకీయ పోరాటాలను ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని, అందుకోసం కోర్టు ప్రాంగణాలను వాడుకోవడం ఏమాత్రం సరికాదని హితవు పలికింది.
"ముఖ్యమంత్రి పర్యటనలను, ఆయన ప్రయాణ ప్రణాళికను కూడా సుప్రీంకోర్టు నియంత్రించాలని కోరుకుంటున్నారా?, ఆ వివరాలన్నీ కూడా మేమే స్వయంగా నిర్ణయించాలా?" అని జస్టిస్ విశ్వనాథన్ అడ్వొకేట్ రంజిత్ కుమార్ ను ప్రశ్నించారు. ఈ పిటిషన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లకుండా ఉపసంహరించుకోవడమే మంచిదని, లేనిపక్షంలో తామే దీనిని తిరస్కరిస్తామని స్పష్టం చేసింది. దీంతో డీఎంకే తరపు న్యాయవాది వెనక్కి తగ్గారు.
ప్రస్తుతం సీబీఐ ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తును నిర్వహిస్తోంది. ఈ తరుణంలో రాజకీయ లబ్ధిని ఆశించి దాఖలయ్యే పిటిషన్ల వల్ల దర్యాప్తు ప్రక్రియ దెబ్బతింటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. రాజకీయ వివాదాలకు కోర్టులు పరిష్కార వేదికలు కావని, దర్యాప్తు ప్రక్రియలో అనవసరంగా జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.












Click it and Unblock the Notifications