రాష్ట్రపతికి సుప్రీంకోర్టు అసాధారణ ఆదేశం-3 నెలల డెడ్ లైన్..!
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ అసాధారణ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఓ కీలక విషయంలో డెడ్ లైన్ విధించింది. ఇప్పటివరకూ దేశంలో వివిధ వర్గాల అధికారులు, నేతలు, ప్రభుత్వాలకు డెడ్ లైన్లు పెట్టిన సుప్రీంకోర్టు ఇప్పుడు ఏకంగా రాష్ట్రపతికే డెడ్ లైన్ విధించడం చర్చనీయాంశమవుతోంది. తాజాగా తమిళనాడు గవర్నర్ బీఎన్ రవి విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఇవాళ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.
రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించి పంపిన బిల్లుల్ని ఆమోదించడం లేదా తిరస్కరించడం చేయకుండా పెండింగ్ లో పెట్టుకుంటున్న గవర్నర్లకు చెంపపెట్టులాంటి ఆదేశాల్ని సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చింది. తమిళనాడు గవర్నర్ బీఎన్ రవి ఇలా తమిళనాడు అసెంబ్లీ పంపిన 10 బిల్లుల్ని ఎటూ తేల్చకుండా పెండింగ్ లో పెట్టుకోవడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు వాటిని ఆమోదిస్తున్నట్లు తెలిపింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా రాష్ట్రపతి వద్దకు వచ్చే బిల్లులపై స్పందించింది. తమిళనాడు గవర్నర్ విషయంలో ఇచ్చిన తీర్పును ఆన్ లైన్లో సుప్రీం అప్ లోడ్ చేసింది.

గవర్నర్ రాష్ట్రపతి పరిశీలన కోసం పంపిన బిల్లుల్ని పెండింగ్ లో పెట్టకుండా మూడు నెలల్లోనే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇవాళ తొలిసారి ఆదేశాలు ఇచ్చింది. ఆ బిల్లులను రిజర్వ్ చేసిన తేదీ నుండి మూడు నెలల వ్యవధిలోపు రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్దేశించిన గడువును అమలు చేయడం రాష్ట్రపతి బాధ్యత అని తెలిపింది.
మూడు నెలల గడువు దాటి ఏదైనా ఆలస్యం జరిగితే, తగిన కారణాలను నమోదు చేసి సంబంధిత రాష్ట్రానికి తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్రంతో రాష్ట్రాలు కూడా మాట్లాడి ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. తద్వారా బిల్లుల్ని మాత్రం పెండింగ్ లో పెట్టడానికి వీల్లేదని తేల్చిచెప్పేసింది.












Click it and Unblock the Notifications