కేంద్రానికి సుప్రీం షాక్ .. వ్యవసాయ చట్టాలను నిలిపివేస్తారా ? మేం ఆ పని చెయ్యాలా ?
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు, ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. కేంద్రం నిర్ణయం పట్ల రైతుల నిరసనలకు సంబంధించిన కీలక పిటిషన్లను ఈరోజు సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బొబ్డే నేతృత్వంలోని అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం జరిపిన విచారణలో కేంద్రం తీరు పట్ల అసహనం వ్యక్తం చేసింది.

కేంద్రం చర్యల పట్ల తాము తీవ్ర అసంతృప్తితో ఉన్నామన్న సుప్రీంకోర్టు
కేంద్రం చర్యల పట్ల తాము తీవ్ర అసంతృప్తితో ఉన్నామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది . కొత్త వ్యవసాయ చట్టాల అమలును మీరు నిలిపి వేస్తారా లేక కోర్టును ఆ పని చేయమంటారా అంటూ అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది
. విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బొబ్డే చర్చలు ఏమి జరుగుతున్నాయో మాకు తెలియదు? వ్యవసాయ చట్టాలను కొంతకాలం నిలిపివేయవచ్చా? మూడు వ్యవసాయ చట్టాల యొక్క రాజ్యాంగ ప్రామాణికతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విన్నప్పుడు సిజెఐ మా లక్ష్యం ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడం అనిపిస్తుంది అంటూ వ్యాఖ్యానించారు .

ఈ చట్టాలను కొంతకాలం నిలిపివేయలేరా అంటూ ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం
ప్రస్తుతం కేంద్రానికి రైతులకు మధ్య జరుగుతున్న చర్చల పట్ల తాము తీవ్ర అసంతృప్తితో ఉన్నామని స్పష్టం చేశారు. చట్టాలను రద్దు చేయమని తాము చెప్పడం లేదని ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడమే తమ ప్రధాన ఉద్దేశమని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది.
ఈ చట్టాలు ప్రయోజనకరం అని చెప్పడానికి ఒక ఉదాహరణ కూడా కనిపించడం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ చట్టాలను కొంతకాలం నిలిపివేయలేరా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

రైతుల ఆందోళనల విషయంలో కేంద్రం తీరుపై జస్టిస్ బోబ్డే అసహనం
ఇక నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చాలా రోజులుగా రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఆందోళనలో పాల్గొన్న చాలా మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే కేంద్రంపై అసహనం వ్యక్తం చేశారు. యావద్దేశం మీ చట్టాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తోందని పేర్కొన్నారు.

ఇంకా తాత్సారం చెయ్యకుండా సమస్యకు పరిష్కారం వెతకాలని సూచించారు.
నేడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీం విచారణ
నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు వ్యవసాయ చట్టాలను తొలగించాలన్న విజ్ఞప్తితో పాటు, కేంద్రం ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాల రాజ్యాంగ ప్రామాణికతను సవాలు చేస్తూ డిఎంకె ఎంపి తిరుచి శివా, ఆర్జెడి ఎంపి మనోజ్ కే ఝా దాఖలు చేసిన పిటిషన్ల సుప్రీంకోర్టు విచారణలో భాగంగా సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
సుప్రీం కోర్టు కోలిన్ గోన్సాల్వ్స్, ప్రశాంత్ భూషణ్, హెచ్.ఎస్.ఫూల్కా , దుష్యంత్ దవే లను ఆందోళన చేస్తున్న రైతు సంఘాల తరపు న్యాయవాదుల కమిటీగా ప్రకటించింది .