ఒక్క ట్వీట్: చిన్నారి ఆకలిని తీర్చిన కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: కేవలం సోషల్ మీడియాలో వచ్చిన ఒక్క ట్వీట్‌కి స్పందించి ఆకలితో అలమటిస్తున్న ఓ చిన్నారి ఆకలిని తీర్చారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు. వివరాల్లోకి వెళితే.. అవినాశ్(5) అనే చిన్నారి గురువారం ఉదయం తన తల్లి కుసుమ్ యాదవ్‌తో కలిసి మధురై నుంచి న్యూఢిల్లీ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నాడు.
మంచు ఎక్కువగా కురుస్తుండటంతో.. రైలు ఆలస్యంగా ప్రయాణించింది. ఈ నేపథ్యంలో తీవ్ర ఆకలితో బాలుడు ఏడుపు మొదలుపెట్టాడు. బాలుడి తల్లి ఈ విషయాన్ని ఢిల్లీలో ఉన్న తన భర్తకు తెలియజేసింది.

విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి వెంటనే రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభుకి ట్విట్టర్ ద్వారా సమాచారాన్ని తెలియజేశాడు. ఆ ట్వీట్‌కి స్పందించిన సురేష్ ప్రభు.. వెంటనే అక్కడి అధికారులకు సమాచారం తెలియజేశాడు.
బాలుడికి పాలు అందేలా చూడాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో ఆ రైలు మాల్వియా ప్రాంతానికి చేరుకునే సరికి.. రైల్వే అధికారి వారికి అల్పాహారం అందజేశారు. అక్కడి నుంచి రైలు కాన్పూర్‌కి చేరుకున్నాక.. రైల్వే అధికారులు బాలుడికి పాలు, బిస్కెట్లు అందజేశారు. దీంతో ఆ బాలుడి తల్లి వారికి కృతజ్ఞతలు తెలిపింది.
ఇటీవల ఇలాంటి ఘటనే మరోటి కూడా చోటు చేసుకుంది. రైలులో ఒంటరిగా వెళుతున్న యువతిని వేధింపులకు గురి చేస్తున్న ఓ వ్యక్తి గురించి ఆ యువతి కేంద్రమంత్రి ట్విట్టర్‌లో పేర్కొంది.
వెంటనే స్పందించిన కేంద్రమంత్రి సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రైలు తర్వాతి స్టేషన్‌కు చేరుకున్నాక ఆ యువతి వద్దకు వెళ్లిన పోలీసులు.. వేధిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇంత వేగంగా స్పందించిన కేంద్రమంత్రికి, పోలీసులకు ఆ యువతి కృతజ్ఞతలు తెలుపుకుంది.












Click it and Unblock the Notifications