కోవిడ్ తర్వాత రైళ్లలో ధర్డ్ ఏసీ ప్రయాణాలకు భారీ డిమాండ్- రీజన్ ఇదే..!
దాదాపు ఐదేళ్ల క్రితం భారత్ తో పాటు ప్రపంచ దేశాల్ని కోవిడ్ 19 మహమ్మారి కుదిపేసింది. ఎక్కడో చైనాలో పుట్టిన ఈ వైరస్ అన్ని దేశాలకు క్రమంగా పాకేసింది. దీంతో ప్రభుత్వాలు వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి లాక్ డౌన్ లు విధించడంతో పాటు పలు తీవ్ర చర్యలు చేపట్టాల్సి వచ్చింది. ఇదే క్రమంలో భారత్ లోనూ రైలు ప్రయాణాల్లో చాలా మార్పులు వచ్చాయి. కోవిడ్ సమయంలో రైళ్ల రాకపోకల్ని భారీగా నియంత్రించారు. దీంతో కోవిడ్ తగ్గాక కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని తాజా గణాంకాలు చెబుతున్నాయి.
అప్పట్లో కోవిడ్ కారణంగా రైళ్లలో ప్రయాణించాలంటేనే భయపడే పరిస్ధితి. దీంతో రైల్వే కూడా ఏసీ రైళ్లను మాత్రమే నడిపింది. అలాగే కోవిడ్ తర్వాత జనంలో పరిశుభ్రతపై అవగాహన కూడా బాగా పెరిగింది. అంతిమంగా దీని ప్రభావం రైళ్లలో ప్రయాణించే వారిపై పడింది. గతంలో స్లీపర్ క్లాస్ లో ప్రయాణాలు చేసిన ప్రయాణికులు క్రమంగా ధర్డ్ ఏసీ ప్రయాణాలు చేయడం ప్రారంభించారు. ఈ ఐదేళ్లలో పెరిగిన మధ్య తరగతి ఆదాయాలు కూడా ఇందుకు మరో కారణం.

ఇవన్నీ కలిసి ఇప్పుడు రైల్వేశాఖ ఆదాయం కూడా భారీగా పెరిగింది. గతంలో కోవిడ్ కు ముందు అంటే 2019-20 సీజన్ లో రైలు ప్రయాణికుల సంఖ్య 11 కోట్లు ఉండగా.. ఇందులో కేవలం 1.4 శాతం మాత్రమే ధర్డ్ ఏసీ ప్రయాణాలు చేసేవారు. 2024-25 నాటికి ఈ సంఖ్య ఏకంగా 19 శాతం పెరగడంతో మొత్తం ప్రయాణించే వారి సంఖ్య ఏకంగా 26 కోట్లకు చేరిపోయింది. అలాగే 2019-20లో రైల్వేల్లో ధర్డ్ ఏసీ ప్రయాణాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.12,370 కోట్లు ఉండగా.. 2024-25లో అది కాస్తా రూ.30,089 కోట్లకు చేరింది.
మరోవైపు భారతీయ రైల్వేలకు ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయంలోనూ ధర్డ్ ఏసీ ప్రయాణాలు పెను మార్పులు తెచ్చాయి.
కరోనాకు ముందు స్లీపర్ క్లాస్ ద్వారా రైల్వేలకు ఎక్కువ ఆదాయం వచ్చేది. కానీ కోవిడ్ తర్వాత దాని స్ధానం థర్డ్ ఏసీ ప్రయాణాలు ఆక్రమించాయి. దీంతో రైల్వే వర్గాలు కూడా దీనిపై సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. దీనంటికీ ప్రధాన కారణం కరోనా తర్వాత ప్రయాణికులు పరిశుభ్రతకు ఇచ్చే ప్రాధాన్యం, పెరిగిన మధ్య తరగతి ఆదాయాలే అనేది రైల్వే వర్గాల మాట.












Click it and Unblock the Notifications