పతనంతిట్ట అభ్యర్థిపై వీడని సందిగ్ధత : రేసులో శ్రీధరన్, సురేంద్రన్
తిరువనంతపురం : సాధారణ ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తోన్న బీజేపీ, అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి స్పందిస్తోంది. ఆ నియోజకవర్గంలో అభ్యర్థికి ఉన్న క్రేజీ, సామాజిక సమీకరణాలు, సర్వేల ఆధారంగా పేర్లను ఖరారు చేస్తోంది. నిన్న 184 మందితో తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. కేరళలో 20 స్థానాల్లో బీజేపీ పోటీచేస్తోంది. పొత్తులో భాగంగా భారత్ ధర్మ జనసేనక 5 చోట్ల, కేరళ కాంగ్రెస్ ఒక్కస్థానంలో బరిలోకి దిగుతున్నాయి. 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సిన బీజేపీ 13 చోట్ల పేర్లను ఖరారుచేసింది. శబరిమల ఆలయం పరిధిలోని పతనంతిట్టకు అభ్యర్థి ఎంపికలో మల్లగుల్లాలు పడుతోంది కమలదళం.
ఎందుకీ జాప్యం ? కారణమిదేనా ?
పతనంతిట్ట నియోజకవర్గం పరిధిలో శబరిమల ఆలయం ఉంటుంది. గత ఏడాది శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం కోసం సుప్రీంకోర్టు అనుమతిచ్చిన నేపథ్యంలో .. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ ప్రోద్బలంతోనే ఆలయంలో మహిళల ప్రవేశం జరిగిందనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో మహిళల ఎంట్రీ తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో .. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని బీజేపీ భావిస్తోంది. అందుకోసమే పతనంతిట్ట నియోజకవర్గంలో గెలిచేందుకు గట్టి అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది.

రేసులో వీరిద్దరూ ..
పతనంతిట్ట నియోజకవర్గంలో కమళం వికసించాలని బీజేపీ భావిస్తోంది. అందుకోసం బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిల్లై, జనరల్ సెక్రటరీ కే సురేంద్రన్ పేర్లను పరిశీలిస్తోంది. వీరిలో ఎక్కువ ప్రభావం చూపి, విజయం సాధిస్తారనే అంచనాతో అభ్యర్థిత్వంపై మల్లగుల్లాలు పడుతోంది. సురేంద్రన్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతోంది. సురేంద్రన్ అభ్యర్థిత్వం పట్ట ఆరెస్సెస్ కూడా మొగ్గుచూపిస్తోంది. వీరితోపాటు ఇటీలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన టామ్ వడక్కం పేరును కూడా తెరపైకి వచ్చింది. నిన్న ప్రకటించిన 13 స్థానాల్లో ఈయనకు అవకాశం కల్పించకపోవడంతో .. పతనంతిట్ట అభ్యర్థి రేసులో ఉన్నారు.
13 స్థానాల్లో ప్రముఖులకు చోటు
నిన్న ప్రకటించిన జాబితాలో కేరళ బీజేపీ ప్రముఖులను చోటు దక్కింది. మిజోరం మాజీ గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ తిరువనంతపురం నుంచి బరిలోకి దిగనున్నారు. ఇక్కడినుంచి ఆయన గెలుపు నల్లేరుమీద నడకేనని అభిప్రాయం ఉంది. అదేవిధంగా కేంద్రమంత్రి అల్ఫోన్స్ కన్నన్‌థానమ్ ఎర్నాకులం నుంచి పోటీచేయనున్నారు. మరో 11 మందికి సామాజిక వర్గాలు, గెలుపుపై సర్వేల అంచనా ఆధారంగా టికెట్లను కేటాయించారు.












Click it and Unblock the Notifications