విపత్తులు: బాబు, మోడీలపై స్వరూపానంద సంచలనం
హైదరాబాద్/న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల పైన శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ, చంద్రబాబు ప్రమాణ స్వీకార ముహూర్తాలు బాగా లేకపోవడంవల్లే దేశంలో, రాష్ట్రంలో విపత్తులు సంభవిస్తున్నాయని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది.
బియాస్ నదిలో విద్యార్థులు కొట్టుకుపోయిన ఘటన నుంచి కాకినాడ ప్రమాదం వరకు జరిగిన ప్రతీ అనర్ధానికి ముహూర్త వేళనే కారణమన్నారు. శాంతి హోమాలు చేయిస్తే ఆ దోషాలు తొలగిపోయి మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. విశాఖలో విపత్తు సంభవిస్తుందని ముందే హెచ్చరించామన్నారు.
కాశ్మీర్ వరదలు, విశాఖ తుపానుకు అదే కారణమన్నారు. ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలను రక్షించేందుకు, భగవంతుని ఆరాధన కోసం పీఠాధిపతులతో భేటీ నిర్వహించాలన్నారు. లేదంటే మరో మూడేళ్ల పాటు వైపరీత్యాలు తప్పవన్నారు. తాజాగా గుజరాత్‌ను కూడా తుపాను తాకనుందని, అక్కడ జరిగే నష్టాలకు కూడా ఇదే కారణమన్నారు. తాను పుట్టిన రోజు జరపుకోనని రెండు వేలమందికి వస్ర్తాలు దానం చేస్తానని స్వరూపానందేంద్ర తెలిపారు.

హిల్లరీ క్లింటన్ ఆరోగ్యంగా, చిరంజీవిగా ఉండాలి: మోడీ
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి, అగ్రరాజ్య విదేశాంగ శాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హిల్లరీ ఆరోగ్యంగా, చిరంజీవిగా ఉండాలని అభిలషించారు. 1947 అక్టోబర్ 26న జన్మించిన హిల్లరీ 67వ వడిలోకి అడుగిడారు.
బీజేపీ వైపు కిరణ్ బేడీ మొగ్గు!
దేశంలో తొలి మహిళా ఐపీఎస్ అధికారిగానే కాక విధి నిర్వహణలో నిజాయతీ అధికారిగా పేరుగాంచిన కిరణ్ బేడీ, ఆమ్ ఆద్మీ పార్టీకి క్రమంగా దూరమవుతున్నారు. అదే సమయంలో అధికార బీజేపీకి చేరువవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఢిల్లీ సీఎం రేసులో తాను లేనని ప్రకటించిన కిరణ్ బేడీ, కేంద్రంలో స్థిరమైన కూటమికే ప్రజలు ఓటేశారని చెప్పారు.
ఢిల్లీపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, స్వచ్ఛ భారత్ అందులో ఓ భాగమేనని, అవినీతిరహిత భారత్ కోసం రామ్ లీలా మైదానంలో చేసిన పోరుకు సమాంతరంగా మోడీ పని చేసుకుపోతున్నారని, స్థిరమైన పాలన అందించడమే కాక, స్వచ్ఛమైన నాయకత్వం నెరపుతున్నారని, గడచిన ఐదు నెలల్లో మిలియన్ డాలర్ల మేర జరిగిన ఒప్పందాల్లో ఒక్క అవినీతి మరక కూడా కనిపించలేదని ప్రశంసించారు.
లంచం తీసుకోను, తీసుకోనివ్వను అని మోడీ చెప్పారని, ఓ విజన్‌తో ముందుకెళుతున్నారని, వ్యవస్థ మూలాలు, సాంకేతికత, మాస్ ఫాలోయింగ్ ఉన్న మోడీలాంటి సర్కారుతో కలసి పని చేయడంలో తప్పేముందని కిరణ్ బేడీ అన్నారు. మోడీ సర్కారు పని తీరును చూసిన ఢిల్లీ ఓటర్లు కేంద్రాన్ని బాధపెట్టే నిర్ణయం తీసుకోరన్నారు.












Click it and Unblock the Notifications