గోవాలో సిరియా పౌరుడి అరెస్ట్, ఉగ్రకోణంలో విచారణ
పనాజీ: గోవాలో అక్రమంగా నివసిస్తున్న ఓ సిరియా దేశస్థుడిని పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో భాగంగా అతడిని విచారించగా, వీసా గడువు పూర్తయినట్లు తెలిసింది.
దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఐజీ సునీల్ గార్గ్ తెలిపారు. సిరియా పౌరుడి అరెస్టుని గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పరేస్కర్ సైతం ధ్రువీకరించారు. ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయా అనే కోణంలో ప్రస్తుతం అతడిని ఇంటిలిజెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారని ఐజీ సునీల్ గార్గ్ చెప్పారు.

'కాసినో ప్రాంతంలో గతరాత్రి అతడిని అరెస్ట్ చేశాం. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా భారత్‌లోనే ఉండడం అనుమానాలకు తావిస్తోంది. అక్రమంగా ఉన్నందుకు అతడిపై కేసు నమోదు చేశాం' అని గార్గ్ తెలిపారు. అయితే అతడిని తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయో, లేవా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని అన్నారు.
దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. అయితే ఐసీస్ ఉద్రవాదుల జాబితాలో గోవా కూడా ఉందని ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం. భారత్‌లో విదేశీ టూరిస్ట్‌లను ఎక్కువగా ఆకర్షించే ప్రాంతాలలో గోవా ఒకటి. ఇది ఇలా ఉంటే గత వారంలో దేశ వ్యాప్తంగా ఐసిస్‌తో సంబంధాలున్న 15 మంది వ్యక్తులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications