టీ-20 వరల్డ్ కప్: టీమిండియా ఆటగాళ్లెవరు? వారిపై ఉన్న అంచనాలేంటి?
2007లో జరిగిన తొలి ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచింది. కానీ, మళ్లీ ఆ టైటిల్‌ను ఇంత వరకు అందుకోలేక పోయింది.
ఈసారి సెలెక్షన్ కమిటీ ఐదుగురు బ్యాట్స్‌మెన్, ఒక వికెట్ కీపర్, ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు ఆల్ రౌండర్లు, ముగ్గురు బౌలర్లతో ఒక బ్యాలన్స్‌డ్ టీమ్‌ను ఎంపిక చేసింది.
ప్రపంచకప్‌లో భారత జట్టుకు కె.ఎల్.రాహుల్, రోహిత్ శర్మలు ఓపెనర్లుగా ఉంటారని ఇటీవల ఓ మ్యాచ్ టాస్ సందర్భంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రకటించారు.
రోహిత్ శర్మకు విశ్రాంతి అవసరం కావడంతో ఇంగ్లాండ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌కు అవకాశం లభించింది.
అక్టోబర్ 24న పాకిస్తాన్‌తో భారత్ తన ప్రపంచ కప్ మ్యాచ్ ఆడనుంది. మరి భారత జట్టులో ఎవరు ఏ పాత్ర పోషించబోతున్నారు, ఏయే బాధ్యతలు ఎవరి మీద పెట్టారో ఒకసారి చూద్దాం.
- టీ20 కెప్టెన్సీపై విరాట్ కోహ్లీ కీలక నిర్ణయం
- విరాట్ కోహ్లీ: స్థాయి లేనోడా? భయం లేనోడా? ఈ సంజ్ఞపై ఎందుకింత చర్చ?

విరాట్ కోహ్లీ (కెప్టెన్)
విరాట్ కోహ్లీ ట్వంటీ-20 ఫార్మాట్‌లో నిలకడగా ఆడుతుండటంతో ఆయన్ను పరుగుల మెషీన్‌గా అభివర్ణిస్తున్నారు. 2014, 2016 వరల్డ్ కప్ టోర్నమెంట్లలో కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.
అంతర్జాతీయ ట్వంటీ -20 క్రికెట్‌లో ఎక్కువ కాలం అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ అగ్రస్థానంలో ఉన్నారు. ప్రస్తుతం నాలుగో ర్యాంకులో కొనసాగుతున్న కోహ్లీ, ఇప్పటి వరకు ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా.
విరాట్ కోహ్లీ నాయకత్వంలో భారత జట్టు ఏ ఐసీసీ టోర్నమెంట్‌లోనూ గెలవలేకపోయింది. ట్వంటీ-20 ప్రపంచకప్ తర్వాత కెప్టెన్ పదవిని వదులుకుంటానని కోహ్లీ ఇప్పటికే ప్రకటించారు. ఈ టోర్నమెంట్ గెలిచి తన వారసుడికి కెప్టెన్సీని అప్పగించాలని ఆయన కోరుకుంటున్నారు.
రోహిత్ శర్మ
రోహిత్ శర్మకు 'హిట్ మ్యాన్' అనే పేరుంది. భారత జట్టుకు వైస్-కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోహిత్, ఓపెనింగ్ స్థానంలో చక్కగా ఆడతారు. జట్టుకు మంచి ఆరంభాన్ని ఇస్తారు. వయసు, అనుభవం, పెర్ఫార్మెన్స్...ఈ మూడింటిలోనూ రోహిత్ తన ప్రత్యేకతను చాటుకున్నారు.
అద్భుతమైన స్ట్రైక్ రేట్, ఫోర్లు, సిక్సర్లను కొట్టే సామర్థ్యం, జట్టు ఇన్నింగ్స్‌ను పటిష్ట పరిచి, స్థిరమైన భాగస్వామ్యాన్ని నిర్మించే సామర్థ్యం రోహిత్‌కున్న బలాలు.
రోహిత్ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ జట్టు అయిదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ షిప్‌ను గెలుచుకుంది.
రోహిత్ ట్వంటీ-20 క్రికెట్‌లో 4 సెంచరీలు చేశారు. నెల రోజుల కిందట ఇంగ్లాండ్ పర్యటనలో కూడా సెంచరీ సాధించారు. అయితే, ఆ ఫామ్‌ని కొనసాగించలేక పోయారు.
రోహిత్ కున్న మరో పెద్ద ప్లస్ పాయింట్ అనుభవం. 2007లో మొట్టమొదటి ట్వంటీ-20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఆయన సభ్యుడు. మళ్లీ ఇప్పుడు 2021లో అంటే 14 ఏళ్ల తర్వాత కూడా ఆయన టీమిండియాలో సభ్యుడు.
వివిధ దేశాలతో ఆడిన అనుభవం, ఇప్పటికే ప్లేయర్‌గా ఆయనకున్న స్కిల్స్ రోహిత్‌కు అదనపు ప్రత్యేకతలు.
- ఎంఎస్ ధోనీ: 'జట్టులో ఉండే ముగ్గురు, నలుగురు ఆటగాళ్లలో నేను ఉండాలని అనుకోవడం లేదు’
- టీ-20 వరల్డ్ కప్: 'భారత్‌తో మ్యాచ్ పాకిస్తాన్ గెలిస్తే, ఇన్షా అల్లా..’ - రమీజ్ రాజా
కె.ఎల్.రాహుల్
అన్ని క్రికెట్ ఫార్మాట్లలో రాహుల్ స్పెషలిస్ట్. ట్వంటీ-20 ఫార్మాట్‌లో ఆయన ఇండియా టీమ్‌కు స్తంభంలాంటి వాడు. జట్టు అవసరం మేరకు ఏ స్థానంలోనైనా ఆడగల సమర్ధుడు.
వివిధ రకాల షాట్లను ఆడగలుగుతాడు. ఈ టోర్నీకి అవసరమైతే వికెట్ కీపర్‌గా కూడా వ్యవహరించవచ్చు.
ఇంటర్నేషనల్ ట్వంటీ-20 క్రికెట్ ర్యాంకింగ్‌లో రాహుల్ టాప్ టెన్ ప్లేయర్లలో ఒకడు. ఇంగ్లాండ్ పర్యటనలో నిలకడను ప్రదర్శించాడు.
ఇటీవల జరిగిన ఐపీఎల్ సీజన్‌లో భారీ స్కోర్లు సాధించడం ద్వారా తాను ట్వంటీ -20 ప్రపంచ కప్‌కు సిద్ధంగా ఉన్నానని నిరూపించుకున్నాడు.
సూర్యకుమార్ యాదవ్
30 ఏళ్ల వయసులో ఇండియన్ నేషనల్ టీమ్‌లో వన్డే, ట్వంటీ-20లో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సూర్యకుమార్ యాదవ్‌కు దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ టోర్నమెంట్‌లలో ఆడిన విశేష అనుభవం ఉంది.
కాకపోతే ప్రపంచకప్‌లో ఆడటం మాత్రం ఇదే తొలిసారి. కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లకు ఆడిన సూర్య కుమార్ వివిధ స్థానాల్లో బ్యాటింగ్ చేశాడు.
- పాకిస్తాన్లో ఆగ్రహావేశాలు.. న్యూజీలాండ్, ఇంగ్లండ్‌లపై ప్రతీకారం తీర్చుకుంటామన్న రమీజ్ రాజా
- టీ-20 వరల్డ్ కప్-2007 ఫైనల్: మిస్బా-ఉల్-హక్‌ను ఇప్పటికీ వెంటాడుతున్న పెడల్ స్వీప్ షాట్
రిషబ్ పంత్
రిషబ్ పంత్‌ను ధోనీ వారసుడిగా చెబుతారు. చాలా చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద స్కోర్లు సాధించాడు. తుపానులా విరుచుకుపడటం తన స్టైల్.
అన్ని క్రికెట్ ఫార్మాట్లలో రిషబ్ తనదైన ముద్ర వేశాడు. కెరీర్ ప్రారంభంలో వికెట్ కీపింగ్ టెక్నిక్‌లో కొన్ని లోపాలు ఉన్నాయి. కానీ, గత రెండేళ్లలో తన టెక్నిక్‌ని మార్చుకోవడానికి చాలా శ్రమించాడు.
కఠినమైన పిచ్‌లపై, పదునైన బౌలింగ్‌ను ఎదుర్కొంటున్నప్పుడు రిషబ్ తడబడినట్లు కనిపిస్తాడు. అలాగే వినూత్నమైన షాట్లు ఆడే క్రమంలో వికెట్ కోల్పోతూ జట్టును ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ప్రపంచకప్‌లో రిషబ్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వహిస్తారు. సెలెక్షన్ కమిటీ అంచనాలకు తగ్గట్టుగా ఆయన రెండు బాధ్యతలను సమర్ధవంతంగా నెరవేర్చాల్సి ఉంది.
- అఫ్గానిస్తాన్ మహిళల క్రికెట్ జట్లు సభ్యులు ఎక్కడ, తాలిబాన్ల భయంతో పారిపోయారా?
- ఐపీఎల్ 2021 విన్నర్ సీఎస్కే: కోల్‌కతాను ఓడించి నాలుగోసారి టైటిల్ గెలిచిన చెన్నై
ఇషాన్ కిషన్
తన దూకుడైన బ్యాటింగ్‌తో సెలక్షన్ కమిటీని ఆకట్టుకుని జట్టులో ఇషాన్ స్థానం సంపాదించాడు. శిఖర్ ధవన్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది.
గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్ వంటి ఐపీఎల్ జట్ల కోసం ఆడిన ఇషాన్, ఇప్పటికే తన సత్తా నిరూపించుకున్నాడు. అవసరమైతే ఆల్టర్నేట్ వికెట్ కీపర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉంది. ఇషాన్‌కు ఇది తొలి వరల్డ్ కప్.
రవీంద్ర జడేజా
ఆల్ రౌండర్‌గా పేరున్న రవీంద్ర జడేజా దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు. బౌలింగ్‌లోనూ సత్తా చాటగలడు. అద్భుతమైన ఫీల్డర్ కూడా. అందుకే ఆయన జట్టులో చేరడంతో టీమ్‌కు అదనపు బలం చేకూరినట్లయింది. టెస్టులు, వన్డేలు, ట్వంటీ -20 క్రికెట్‌లో విశేషమైన అనుభవం ఉంది.
జడేజా బౌలింగ్‌లో పరుగులు చేయడానికి బ్యాట్స్‌మన్ కష్టపడతారు. ఇక విజయవంతమైన పార్ట్‌నర్ షిప్‌లను విడదీసే సత్తా కూడా ఆయనకు సొంతం.
కాలం గడుస్తున్న కొద్దీ ఆయన బ్యాటింగ్ మెరుగుపడింది. అలాగే, తన ఫీల్డింగ్‌తో కనీసం పది పరుగులనైనా ఆపగలరన్న పేరుంది.
ప్రస్తుతం జడేజా పూర్తి ఫామ్‌లో ఉన్నారు కాబట్టి, ఆయన కచ్చితంగా టీమిండియాకు బలం.
- విరాట్ కోహ్లీ: స్థాయి లేనోడా? భయం లేనోడా? ఈ సంజ్ఞపై ఎందుకింత చర్చ?
- పాకిస్తాన్‌కు మరో దెబ్బ: టూర్ రద్దు చేసుకున్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టు
హార్దిక్ పాండ్యా
హార్దిక్ పాండ్యా విధ్వంసకరమైన బ్యాట్స్‌మన్, మాస్టర్ బౌలర్, గొప్ప ఫీల్డర్ కూడా. ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్న ఆయన టీమిండియాలో స్థానం సంపాదించడం పెద్ద విశేషం కాదు.
గాయాల కారణంగా ఇంగ్లాండ్ పర్యటనలో హార్ధిక్ పాల్గొనలేక పోయారు. మొన్నటి ఐపీఎల్ టోర్నమెంట్‌లో ముంబై ఇండియన్స్ తరఫున కొన్ని మ్యాచ్‌లు ఆడారు కానీ, బౌలింగ్ చేయలేకపోయారు.
హార్దిక్‌ను తుది 11మంది జట్టులో చేరిస్తే జట్టు బ్యాలన్స్ కూడా బాగుంటుంది. అదనపు బౌలర్, బ్యాట్స్‌మన్ ప్లేస్‌ను ఆయన పూరించగలరు. స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ అయినప్పటికీ, ఇటీవల ఆయన పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఆయనకు తుది 11మందిలో చోటు దొరుకుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
శార్ధూల్ ఠాకూర్
హార్దిక్ బౌలింగ్ చేయలేకపోతే, జట్టుకు బౌలింగ్ చేయగల ఆల్ రౌండర్ అవసరమనే అభిప్రాయంతో, చివరి క్షణంలో శార్దూల్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పర్యటనల సమయంలో శార్ధూల్ బౌలింగ్, బ్యాటింగ్‌లలో చక్కగా రాణించారు.
చాలా సంవత్సరాలుగా దేశీయ క్రికెట్‌లో ముంబై తరఫున స్థిరంగా రాణిస్తున్నారు శార్దూల్. చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో ఐపీఎల్ ఛాంపియన్‌షిప్ విజయంలో ఆయన తన వంతు పాత్ర పోషించారు.
ఒత్తిడిలో కూడా ఆత్మవిశ్వాసంతో ఆడగలగడం ఆయన ప్రత్యేకత.
రవిచంద్రన్ అశ్విన్
భారత ప్రపంచకప్ జట్టులో అశ్విన్‌కు చోటు దక్కడం ఒక ఆశ్చర్యకరమైన విషయం. 2017 నుంచి అశ్విన్ టీమిండియాలో ట్వంటీ-20 ఆడుతున్నారు. మొదట యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌ల వైపు సెలక్షన్ కమిటీ మొగ్గు చూపింది.
కానీ, బ్యాట్స్‌మన్ మానసిక స్థితిపై దృష్టిసారించి అనుభవం, నైపుణ్యంతో బౌలింగ్ చేసే వ్యక్తిగా అశ్విన్‌ను గుర్తించింది. దీంతో ఆయనకు టీమ్‌లో చోటు దక్కింది.
జస్‌ప్రీత్ బుమ్రా
తక్కువ దూరం నుంచి పరుగెత్తి, అనూహ్యమైన బంతులు విసరడంలో బుమ్రాకు మంచి పేరుంది. ఐపీఎల్ టోర్నమెంట్ల సమయంలో ముంబై ఇండియన్స్ ప్రధాన ఆయుధాలలో ఆయన ఒకరు. బుమ్రా బౌలింగ్ ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మెన్‌లను కూడా ఇబ్బంది పెట్టింది.
యార్కర్లు, బౌన్సర్లు, నిదానమైన బంతులు, కట్టర్‌లతో వైవిధ్యమైన బంతులు విసురుతారు బుమ్రా. మొదటి, చివరి ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేయడం, వికెట్లు తీయడంలో ఆయనకున్న పేరు జట్టులో ఆయనకు స్థానం ఖరారు చేసిందని చెప్పవచ్చు.
భువనేశ్వర్ కుమార్
కచ్చితమైన బౌలింగ్‌తో బ్యాట్స్‌మన్‌ను ఇబ్బంది పెట్టగల బౌలర్లలో భువనేశ్వర్ ఒకరు. స్వింగ్ బౌలింగ్‌లో ఆయనది అందె వేసిన చెయ్యి.
బుమ్రా లాగే ఆరంభ, చివరి ఓవర్లలో జాగ్రత్తగా బౌలింగ్ చేయడంలో భువనేశ్వర్ దిట్ట.
గాయాల కారణంగా ఇటీవల జరిగిన ఐపీఎల్ టోర్నమెంట్‌లో తన జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడలేక పోయారు. ఇంగ్లాండ్ పర్యటనను కూడా మిస్సయ్యారు. కానీ, ఇప్పుడు ఫిట్‌గా ఉన్నారు.
జట్టులో భువనేశ్వర్ చేరడం అనివార్యమని విరాట్ కోహ్లీ ఇప్పటికే స్పష్టం చేశారు. చక్కటి ఫీల్డర్, బ్యాట్స్‌మన్ కావడం ఆయన అదనపు అర్హతలు.
మహ్మద్ షమీ
మహ్మద్ షమీని కెప్టెన్ విరాట్ కోహ్లీ గన్ బౌలర్ అని అంటుంటారు. బ్యాట్స్‌మన్‌ను చికాకు పెట్టగల బౌలింగ్ ఆయన సొంతం. ఆయన బౌలింగ్ వేగం, కచ్చితత్వాల సంగమం.
షమీకి భారత్ తరఫున ట్వంటీ-20 ఆడిన అనుభవం లేనప్పటికీ, చాలా సంవత్సరాలుగా ఐపీఎల్ టోర్నమెంట్‌లలో ఆడుతున్నారు. దిల్లీ, కోల్‌కతా, పంజాబ్ జట్లకు ఆయన ప్రాతినిధ్యం వహించారు.
- టెండూల్కర్‌తో మాట్లాడమని కోహ్లీకి గావస్కర్ ఎందుకు సలహా ఇచ్చారు?
- ఎంఎస్ ధోని: 'నమ్మిన దాని కోసం పోరాడుతూనే ఉండండి’
రాహుల్ చాహర్
భారత క్రికెట్ జట్టు వన్డే, ట్వంటీ-20 జట్లలో యుజువేంద్ర చాహల్ కీలకమైన వ్యక్తి. కానీ, ఆయన ఫామ్‌లో లేకపోవడంతో రాహుల్ చాహర్‌ను ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ.
ఇంతకు ముందు భారత వన్డే జట్టు, ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన యుజువేంద్ర చాహల్ అనుభవం ప్రపంచ కప్‌లో సహాయపడుతుందంటూ సోషల్ మీడియా చర్చలతో హోరెత్తింది.
ఇటీవలి ఐపీఎల్ సీజన్‌లో కూడా యుజువేంద్ర బాగా రాణించారు. మరోవైపు, రాహుల్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. కాబట్టి, రాహుల్‌కు బదులుగా యుజువేంద్రను ఎంపిక చేయాలని డిమాండ్‌లు వినిపించాయి.
కానీ, చివరకు రాహుల్ ప్రపంచకప్ టీమ్‌కు ఎంపికయ్యారు. జట్టుకు యుఏఈలోని పిచ్‌లపై వేగంగా బౌలింగ్ చేయగల స్పిన్నర్ అవసరం. రాహుల్ రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్, ముంబై ఇండియన్స్ తరపున కూడా ఆడారు. ఆయనకు ఇదే తొలి ప్రపంచ కప్.
- ధోనీ హెలికాప్టర్ షాట్ ఎలా పుట్టింది? ఆ టెక్నిక్ నేర్పిందెవరు?
- 'తాలిబాన్ల రాకతో శాంతి వెల్లివిరుస్తుంది’ - పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది
వరుణ్ చక్రవర్తి
బ్యాట్స్‌మన్‌ను కన్ఫ్యూజ్ చేసేలా బంతులు వేయడంలో వరుణ్ చక్రవర్తి సిద్ధహస్తుడు. తమిళ్ ప్రీమియర్ లీగ్‌లో వరుణ్ పెర్ఫార్మెన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఆకట్టుకుంది. అందుకే ఆయన కొన్నాళ్లుగా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్నారు.
వైవిధ్యమైన బౌలింగ్ ఆయన స్పెషాలిటీ. ధోనీ కూడా వరుణ్ గూగ్లీ బంతిని ఎదుర్కోలేక పోయారు. స్థిరంగా వికెట్లు తీయడం, బ్యాట్స్‌మన్ పరుగులు తీయకుండా కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడం వరుణ్ ప్రత్యేకతలు.
గాయాల కారణంగా ఆస్ట్రేలియా టోర్నమెంట్‌లో వరుణ్ ఆడలేకపోయారు. కానీ, కోల్‌కతా తరఫున ఆడే సమయంలో తన సత్తా ప్రదర్శించారు. ఈ వరల్డ్ కప్‌లో భారత జట్టుకు వరుణ్ ఒక నమ్మకమైన ఆయుధం.
రిజర్వ్ ప్లేయర్లు
శ్రేయాస్ అయ్యర్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్ రిజర్వ్ ప్లేయర్లుగా ఉంటారు. కరోనా నిబంధనల ప్రకారం ఈ ఆటగాళ్లలో ఎవరైనా అవసరమైతే జట్టులో చేరతారు.
నెట్ బౌలర్లు
ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్, వెంకటేశ్ అయ్యర్, అవేశ్ ఖాన్, లుక్మన్ మేరివాలా, కరణ్ శర్మ, షాబాజ్ అహ్మద్, కృష్ణప్ప గౌతమ్‌లు నెట్ బౌలర్లుగా ఉంటారు.
ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు, ప్రధాన జట్టులోని ఆటగాళ్లు గాయపడినప్పుడు ఐసీసీ టెక్నికల్ కమిటీ అనుమతితో రిజర్వ్ ఆటగాళ్లలో ఎవరైనా జట్టులో చేరవచ్చు.
- ఆ ఒక్క బాల్‌తో క్రికెట్ రూల్స్ మారిపోయాయి
- ఒలింపిక్స్‌లో క్రికెట్ ఎందుకు లేదు? అసలు ఆ ప్రయత్నాలేమైనా జరిగాయా
మెంటార్గా మహేంద్ర సింగ్ ధోనీ
మాజీ కెప్టెన్, కెప్టెన్ కూల్, ఫైన్ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోనీ మొదటిసారి మెంటార్ క్యాప్ ధరించబోతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత ఆయన ఆ బాధ్యతను తీసుకోవడం ఇదే మొదటిసారి.
బ్యాట్స్‌మన్‌గా, అత్యుత్తమ కెప్టెన్‌గా ధోనీ అనుభవం భారత జట్టుకు ఎంతో కీలకం. అందుకే బీసీసీఐ ఆయన్ను ప్రత్యేకంగా నియమించింది.
కోహ్లీ నాయకత్వంలో భారత జట్టు ఏ ఐసీసీ టోర్నమెంట్‌లోనూ గెలవలేదు. భారత ట్వంటీ-20 జట్టు కెప్టెన్‌గా కోహ్లీకి ఇది చివరి టోర్నమెంట్.
ఇక జట్టు సహాయక సిబ్బందిలో కూడా చాలామందికి ఇది చివరి టోర్నమెంట్.
ఈ ప్రపంచ కప్ తర్వాత, కొత్త సహాయక సిబ్బంది, చీఫ్ కోచ్‌ను కూడా నియమిస్తారు. భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్‌గా తన చివరి టోర్నమెంట్‌లో పాల్గొంటున్న మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత రవిశాస్త్రికి భారత జట్టు వీడ్కోలు పలకనుంది.
చీఫ్ కోచ్ రవిశాస్త్రి, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్‌లకు కూడా ఇది చివరి టోర్నమెంట్.
- క్రికెట్ 2050: వాతావరణ మార్పులతో ఈ ఆట ఆడే తీరే మారిపోతుందా?
- లార్డ్స్‌లో ఇంగ్లండ్ చేసిన ఆ ఒక్క తప్పే భారత్‌కు ఘన విజయాన్ని ఇచ్చిందా?
ట్వంటీ-20 ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శన
2007లో విజేతగా నిలిచిన భారత్... 2009లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది.
2010, 2012 వరల్డ్ కప్‌లలో సూపర్ 8 దశకు చేరింది.
ఇక 2014లో రన్నరప్ కాగా, 2016లో సెమీ ఫైనల్ వరకు వచ్చింది.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్ 19: జీవిత భాగస్వాములను కోల్పోయిన మహిళలు ఆర్థికంగా ఎలా ఇబ్బంది పడుతున్నారు
- అత్యాచార బాధితులు 26వ వారంలో అబార్షన్ చేయించుకునేందుకు అనుమతి ఇవ్వడం సురక్షితమేనా
- బంగ్లాదేశ్: 'దుర్గాపూజ మండపంలో ఖురాన్ పెట్టిన వ్యక్తిని గుర్తించాం’ - పోలీసుల ప్రకటన
- ఆర్యన్ ఖాన్ కస్టడీ అక్టోబరు 30 వరకు పొడిగింపు
- ఫేస్‌బుక్ ఇక కొత్త ప్రపంచాన్ని చూపించనుందా? ఏమిటీ మెటావర్స్
- ఫ్యాబ్ఇండియా: అడ్వర్టైజ్మెంట్ నచ్చక కంపెనీని టార్గెట్ చేసిన హిందూ గ్రూపులు
- వైఎస్ జగన్: 'విపక్ష నేతలు బూతులు మాట్లాడుతున్నారు.. వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు’
- అడవిలో తప్పిపోయిన ఆ ఇద్దరు అయిదు రోజులు నీళ్లు లేకుండా ఎలా బతికి బయటపడ్డారు?
- కోవిడ్ భయం ఉన్నా వన్యప్రాణులను తినేస్తున్నారు
- బ్రిటన్ ఎంపీ హత్య: ప్రపంచ వ్యాప్తంగా ఎంపీలు, రాజకీయ నాయకులకు ఎలాంటి భద్రత ఉంటుంది?
- తరతరాలుగా అమ్మమ్మలు, నానమ్మలు చేసే సంప్రదాయ మసాజ్ రహస్యం కనిపెట్టిన అమెరికా పరిశోధకులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)