తమిళం తీరే వేరు: అమెరికాలో మారుమోగుతోంది: ప్రధాని మోడీ
చెన్నై: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ హిందీని జాతీయ భాషగా అమలు చేయాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన సంచలనం రేపుతుండగా..ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాంతీయ భాషల గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. తన అమెరికా పర్యటన సందర్భంగా హ్యూస్టన్ లో నిర్వహించిన హౌడీ మోడీ కార్యక్రమంలో ఎనిమిది భాషల్లో మాట్లాడారాయన. తాను తమిళంలో మాట్లాడిన సమయంలో వేలాది మంది తనను అదే భాషలో పలకరించారని చెప్పుకొచ్చారు. హౌడీ మోడీ కార్యక్రమంలో మిగిలిన అన్ని భాషల కంటే తమిళం ఎక్కువగా వినిపించిందని, సభలో మారుమోగిపోయిందని అన్నారు.
Speaking at Chennai Airport. Watch. https://t.co/7qWBSkMO5R
— Narendra Modi (@narendramodi) September 30, 2019
ఐఐటీ-మద్రాస్ స్నాతకోత్సవంలో హాజరు కావడానికి నరేంద్ర మోడీ సోమవారం ఉదయం చెన్నైకి చేరుకున్నారు. న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను భారతీయయ జనతాపార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. వరుసగా రెండోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయన చెన్నైకి రావడం ఇదే తొలిసారి. దీనితో ఆయనను స్వాగతించడానికి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు విమానాశ్రయానికి తరలి వచ్చారు. కేంద్ర మాజీమంత్రి పొన్ రాధాకృష్ణన్ సహా పలువురు బీజేపీ నాయకులు, అన్నా డీఎంకే కార్యకర్తలు విమానాశ్రయం వద్ద మోడీకి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మోడీ కొద్దిసేపు మాట్లాడారు. వణక్కం.. అంటూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రపంచంలోనే అతి ప్రాచీన భాషగా తమిళానికి గుర్తింపు ఉందని, అమెరికాలో ఆ భాషను గౌరవించే వారి సంఖ్య వేలల్లో ఉందని చెప్పారు. మనదేశం పట్ల ప్రపంచ దేశాల్లో గౌరవ భావం పెరిగిందని, ఆ తేడా తనకు స్పష్టంగా కనిపించిందని అన్నారు. హౌడీ, మోడీ కార్యక్రమానికి హాజరైన భారతీయుల పట్ల అమెరికన్లు గౌరవ భావాన్ని ప్రదర్శించారని, ఇదే పరిస్థితి దాదాపు అన్ని చోట్లా కనిపించిందని చెప్పారు. తమిళ భాష పట్ల తనకు ఆసక్తి ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications