‘స్టాలిన్ సర్.. నోరు విప్పండి!’.. నిలదీసిన సీఎం విజయ్!
తమిళ రాజకీయాల్లో గ్రానైట్ వ్యాపారి ఆర్.వీరమణికి సంబంధించిన మైనర్ బాలికల లైంగిక వేధింపుల కేసు తీవ్ర కలకలం రేపుతోంది. గతంలో డీఎంకే పాలనలో ఈ కేసుపై ఫిర్యాదు అందినప్పటికీ.. అధికారంలో ఉన్నవారు ఈ దారుణమైన నేరాన్ని, దాని వెనుక ఉన్న మిస్టరీని పూర్తిగా తొక్కి పెట్టారని తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ ఆరోపించారు.
ఈ కేసు ప్రధానంగా జెమ్ గ్రానైట్స్ అధినేత ఆర్.వీరమణికి సంబంధించింది. మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై వీరమణితో పాటు ఆయనకు సహకరించిన శాంతి, ఆమె భర్త మహేంద్ర సింహన్‌లను పోలీసులు ఆగస్టులో అరెస్ట్ చేశారు. 2025 అక్టోబరులో డీఎంకే ప్రభుత్వ హయాంలో ఓ చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్, మైనర్ బాలికపై లైంగిక దాడికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ఉన్న పెన్ డ్రైవ్‌ను యాంటీ వైస్ స్క్వాడ్‌కు అందించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

అక్టోబర్ 6న జరగనున్న ఉపఎన్నికల ప్రచారం సీఎం విజయ్ ప్రసంగిస్తూ డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "తమిళనాడు ప్రజలు దీని వెనుక ఉన్న డీల్ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 'స్టాలిన్ సర్ నోరు విప్పండి'. మీతో చేతులు కలిపి అన్నాడీఎంకే కూడా ఈ విషయంలో నోరు విప్పడం లేదు. ఇలాంటి సున్నితమైన, దారుణమైన విషయంలో కూడా మీ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందాలు, కుమ్మక్కు రాజకీయాలు ఉంటాయా?" అని సీఎం విజయ్ ప్రశ్నించారు.
తనను లేదా తన తల్లిని రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తిగతంగా విమర్శించినప్పుడు తాను సహించానని, కానీ తమిళనాడులోని నా అక్కాచెల్లెళ్లు, తల్లుల పట్ల అశ్లీలంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోనని విజయ్ స్పష్టం చేశారు. డీఎంకే, వారి కుటుంబ సభ్యులు ఇటువంటి అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారని, దానిని ఎంకే స్టాలిన్ కుటుంబం ఆస్వాదిస్తోందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. డీఎంకే ప్రభుత్వ హయాంలో వీరమణిపై ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ.. అతడిని అరెస్ట్ చేయకుండా సరైన ఆధారాలు లేవనే సాకుతో కేసును మూసివేశారు. అయితే ఇటీవల ప్రత్యేక పోక్సో కోర్టు ఈ క్లోజర్ రిపోర్టును తిరస్కరించి, కేసును తిరగదోడి సమగ్ర విచారణకు ఆదేశించింది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేయడమే కాకుండా.. బాధితురాలి ప్రకటనను మెజిస్ట్రేట్ ముందు నమోదు చేశారు. ఈ విచారణలో మరికొందరు బాధితులను కూడా గుర్తించి వారి వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించారు.













Click it and Unblock the Notifications
