వేచి చూసి కరుణానిధిని 'విజయకాంత్'తో దెబ్బకొట్టిన శిష్యుడు!
చెన్నై: కరుణానిధి ఓటమికి తనయుల ఆధిపత్య పోరుతో పాటు ఆయన శిష్యుడు వైగో కూడా ఓ కారణమని అంటున్నారు. వైగో డీఎంకేలో విద్యార్థి నాయకునిగా చేరారు. వైగో ఎదుగుదల తన కుటుంబంలోని రాజకీయ వారసులకు అడ్డంకి కాగలదని భావించడంతో వైగోను 1993లో వేర్వేరు కారణాలు చూపి కరుణానిధి పార్టీ నుంచి బహిష్కరించారు.
దీంతో డీఎంకేను చీల్చి వైగో ఎండీఎంకే పేరుతో వేరు కుంపటి పెట్టుకున్నారు. అప్పటి నుంచి కరుణానిధిపై రాజకీయపరమైన విజయం సాధించేందుకు వైగో వేచి చూశారు. ఈ ఎన్నికల్లో దానిని సాధించారని అంటున్నారు.
గతంలో డీఎంకే తమిళనాడులో ప్రతిపక్షంలో ఉన్న తరుణంలో అధికార పార్టీకి వ్యతిరేక ఓట్లు చీలకుండా కరుణానిధి పటిష్టమైన వ్యూహ రచన చేసేవారు. అధికార పార్టీకి దూరంగా ఉండే పార్టీలన్నింటినీ ఒక గూటి కిందకి తెచ్చి బలమైన కూటమి ఏర్పాటు చేసేవారు.

కానీ, ఇప్పుడు మరోసారి కరుణ వ్యూహం పారలేదు. కరుణానిధి చక్రం తిప్పడాన్ని గుర్తించిన వైగో తనదైన శైలిలో చక్రం తిప్పాడు. కరుణానిధికి షాకిచ్చారని అంటున్నారు.
శాసనసభ ఎన్నికలకు ఎంతో ముందే వైగో.. వామపక్షాలు, దళిత సామాజిక వర్గ పార్టీలైన వీసీకేలతో ప్రజా సంక్షేమ కూటమి పేరుతో ఓ కూటమి ఏర్పాటు చేశారు. జయలలిత కేంద్రంలోని బీజేపీతో మిత్ర పూర్వక ధోరణితో వ్యవహరిస్తుండటంతో అన్నాడీఎంకేతో పొత్తుకు వామపక్షాలు సుముఖంగా లేవు.
రెండో ప్రత్యామ్నాయంగా కరుణానిధి నేతృత్వంలోని డీఎంకేతో జట్టుకట్టేందుకు వామపక్షాలకు పెద్దగా అభ్యంతరాలుండేవి కావు. కానీ ప్రజా సంక్షేమ కూటమితో ఆ ప్రయత్నాలకు వైగో అడ్డుకట్ట వేశారు. ప్రజాసంక్షేమ కూటమిలోని విజయకాంత్‌కు చెందిన డీఎండీకేతో కరుణానిధిని దెబ్బతీశాడు. విజయకాంత్.. కరుణతో కలిస్తే ఫలితాలు వేరేలా ఉండేవని అంటారు. అలాగే వామపక్షాలు కలిసినా కూడా బాగుండేవని అంటున్నారు.












Click it and Unblock the Notifications