తమిళనాడు ఎన్నికల పోరు ... కమల్ హాసన్ పై నటి గౌతమి సంచలన వ్యాఖ్యలు
తమిళనాడు ఎన్నికల రాజకీయాలు రసకందాయంగా మారాయి. ప్రధాన పార్టీలు ఆరోపణలు ,ప్రత్యారోపణలు ,విమర్శలు, ప్రతి విమర్శలతో, ఓటర్లను ఆకట్టుకునే వ్యూహ ప్రతివ్యూహాలతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నా యి. ముఖ్యంగా సీఎం పళనిస్వామి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి . అమ్మ పాలన కొనసాగాలంటే రెండాకుల గుర్తుకే ఓటు వేయాలని సీఎం పళనిస్వామి విజ్ఞప్తి చేస్తుంటే, ఉదయ్ సూర్యుడికి ఓటేస్తే ప్రజల హక్కులను కాపాడుతూ, సుపరిపాలన సాగిస్తామని స్టాలిన్ విజ్ఞప్తి చేస్తున్నారు.

మార్పు కోసం ఐజేకే కూటమి అంటూ కమల్ ఎన్నికల ప్రచారం
ఇదిలా ఉంటే మూడవ కూటమి ఏర్పడిన మక్కల్ నీది మయ్యం,సమత్తువమక్కల్ కట్చి, జననాయగ కట్చి లు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
కమల్ హాసన్ తమిళనాడు రాజకీయాలలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అలాంటి మార్పును తీసుకురావడానికి ఐజేకే కూటమి ప్రయత్నం చేస్తుందని యుద్ధ ప్రాతిపదికన ప్రచారం చేస్తున్నారు . పరిపాలనలో ఒక మార్పు తీసుకు వస్తామని ప్రజలకు ప్రమాణం చేస్తున్నామని ,వాస్తవికతకు దగ్గరగా ఉండే తమ మేనిఫెస్టోను చూసి ఓటేయాలని కమల్ హాసన్ అభ్యర్థిస్తున్నారు. ఇక ఐజేకే కూటమి సీఎం అభ్యర్థిగా కమల్ హాసన్ ఉన్నారు .

బీజేపీ నుండి స్టార్ క్యాంపెయినర్ గా నటి గౌతమి
ఇదిలా ఉంటే బిజెపి నుండి ఎన్నికల ప్రచారంలో కి స్టార్ క్యాంపెయిన్ గా నేరుగా రంగంలోకి దిగిన గౌతమి కమల్ హాసన్ పై ఫైర్ అయ్యారు.
కమల్ హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించి, కొన్నేళ్ల పాటు ఆయన స్నేహితురాలిగా మెలిగిన, ఆయనతో కలిసి సహజీవనం చేసిన గౌతమి ఇప్పుడు కమల్ హాసన్ పై విరుచుకుపడుతున్నారు. కమల్ హాసన్ తో అభిప్రాయ భేదాల కారణంగా ఆయనకు దూరంగా ఉంటున్న గౌతమి ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం తమిళనాడులో జరిగిన ఒక ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన గౌతమి కమల్ ను టార్గెట్ చేశారు.

ప్రజలను మభ్యపెట్టడం కోసం కమల్ హాసన్ మార్కెటింగ్ మాయాజాలం అంటూ ఫైర్
తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మార్పులు చేస్తామని కమల్ హాసన్ చెబుతున్నారని, అసలు అటువంటి మార్పును ప్రజలు కోరుకుంటున్నారా? లేదా అన్నది కౌంటింగ్ జరిగే మే రెండవ తేదీన తేలిపోతుందని బిజెపి నేత, నటి గౌతమి పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టడం కోసం కమల్ హాసన్ మార్కెటింగ్ మాయాజాలాన్ని వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు. మొత్తానికి మొన్నటి వరకు కమల్ హాసన్ తో సహజీవనం చేస్తున్న గౌతమి ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో కమల్ హాసన్ ని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేయడం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications