Tamilnadu elections : పీపీఈ కిట్ ధరించి ఓటు వేసిన డీఎంకె ఎంపీ కనిమొళి...
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో డీఎంకె ఎంపీ కనిమొళి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇటీవల కరోనా బారిన పడిన ఎంపీ... పీపీఈ కిట్ ధరించి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. చెన్నైలోని మైలాపూర్‌లో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకూ జరిగిన పోలింగ్‌లో... చివరి గంట సమయాన్ని ఎన్నికల కమిషన్ కోవిడ్ 19 పేషెంట్ల కోసం కేటాయించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో చివరి గంటలో కరోనా పేషెంట్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సాయంత్రం 7గంటల వరకూ తమిళనాడులో 65.11శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ మందకొడిగానే సాగింది. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎడప్పాడి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 73శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది.

ఇక పోలింగ్ వేళ డీఎంకె అభ్యర్థి ఉదయనిధి స్టాలిన్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని అన్నాడీఎంకె పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. డీఎంకె ఎన్నికల చిహ్నంతో కూడిన షర్ట్‌ను ఉదయనిధి స్టాలిన్ ధరించాడని... ఇది ఎన్నికల కోడ్‌కు విరుద్దమని ఫిర్యాదులో పేర్కొంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. మొత్తంగా తమిళనాడులో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సామాన్యులు మొదలు సినీ,రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాగా,తమిళనాడులో మొత్తం 6.28కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 3.18కోట్ల మంది మహిళా ఓటర్లు,3.08కోట్ల మంది పురుష ఓటర్లు,7200 మంది ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారు.మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో 3,998 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ కోసం 88,937 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఎన్డీయే,యూపీఏ కూటముల మధ్యే ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది. ఎన్డీయేలో అధికార ఏఐఏడీఎంకే, బీజేపీ, పీఎంకే పార్టీలు ఉండగా... యూపీఏలో డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఎండీఎంకే పార్టీలు ఉన్నాయి. కమల్ హాసన్ నేతృత్వంలోని ఎంఎన్ఎం, ఐజేకే, ఏఐఎస్ఎంకే, నామ్ తమిళర్ కట్చి పార్టీలు మరో కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఇక టీటీవీ దినకరన్‌కు చెందిన ఏఎంఎంకే, ఎంఐఎంతో పాటు మరికొన్ని చిన్న పార్టీలతో కలిసి కూటమిగా పోటీ చేస్తోంది. గెలుపుపై అటు డీఎంకె,ఇటు అన్నాడీఎంకె ధీమాగా ఉన్నాయి. అయితే ఇప్పటికే వెలువడిన పలు సర్వేలు మాత్రం డీఎంకెదే విజయమని అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ ఓటరు ఏ పార్టీకి పట్టం కట్టాడన్నది తెలియాలంటే మే 2 వరకూ వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications