మహిళతో అసభ్యంగా,అశ్లీలంగా-అడ్డంగా దొరికిన బీజేపీ నేత-సొంత పార్టీ నేత స్టింగ్ ఆపరేషన్..
తమిళనాడు బీజేపీ ప్రధాన కార్యదర్శి కేటీ రాఘవన్ తన పదవికి రాజీనామా చేశారు. సొంత పార్టీ నేత ఒకరు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ఆయన అడ్డంగా దొరికిపోయారు. పార్టీకి చెందిన ఓ మహిళా నేతతో జరిపిన వీడియో కాల్ సంభాషణలో రాఘవన్ అసభ్యంగా వ్యవహరించారు. అర్థనగ్నంగా కూర్చొని ఆమెతో అశ్లీలంగా మాట్లాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాఘవన్ రాజీనామా చేయక తప్పలేదు.
బీజేపీకే చెందిన రవిచంద్రన్ అనే యూట్యూబర్ ఈ వీడియోను లీక్ చేశారు. గతేడాది అక్టోబర్‌లో రవిచంద్రన్ పార్టీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై అంగీకారంతోనే రాఘవన్ వీడియోను సోషల్ మీడియాలో బయటపెట్టినట్లు చెప్పారు. అంతేకాదు,బీజేపీకి చెందిన మరో 15 మంది నేతల ఆడియో,వీడియో టేపులు తన వద్ద ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాఘవన్ లాగే వారు కూడా లైంగిక వేధింపులకు పాల్పడినవారేనని చెప్పారు.

రవిచంద్రన్ విడుదల చేసిన వీడియోపై కేటీ రాఘవన్ స్పందిస్తూ... తనపై,పార్టీపై బురదజల్లేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలను న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. అంతిమంగా ధర్మం వైపే విజయం ఉంటుందన్నారు. పార్టీ అధ్యక్షుడు అన్నామలైని కలిసి రాజీనామా సమర్పించినట్లు తెలిపారు. గత 30 ఏళ్లుగా బీజేపీ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నానని... తాను ఎలాంటి వాడినో తన తమిళ ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు.సోషల్ మీడియాలో తన వీడియో వైరల్ అయిన కొద్ది గంటలకు రాఘవన్ ఇలా స్పందించారు.
రాఘవన్ రాజీనామాను అన్నామలై ఆమోదించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి నేత్రుత్వంలోని కమిటీతో రాఘవన్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతామన్నారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయన్నారు. రవిచంద్రన్ తన వద్ద మరికొందరు నేతల వీడియోలు ఉన్నాయని చెప్పారని... ఆధారాలు బయటపెడితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే రవిచంద్రన్ ఆ వీడియో ఆధారాలు తమకు ఇచ్చేందుకు నిరాకరించారని చెప్పారు. అంతేకాదు,వారిపై యాక్షన్ తీసుకోకపోతే వీడియోలు బయటపెడుతానని హెచ్చరించాడన్నారు. రవిచంద్రన్ తీరుపై అన్నామలై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజానిజాలను పరిశీలించకుండా చర్యలు సాధ్యపడవన్నారు. రవిచంద్రన్ తనకు నచ్చింది చేసుకోవచ్చునని అసహనం వ్యక్తం చేశారు.
రెండు నెలల క్రితం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి మహాబలిపురంలో పార్టీ కార్యక్రమానికి హాజరైనప్పుడు ఆయనకు వందలాది ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. పార్టీకి చెందిన చాలామంది మహిళలు... ఓ నేత నుంచి తాము లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నట్లు సీటీ రవికి ఫిర్యాదు చేశారు. ఆ నేత ఎవరా అనే దానిపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. ఇంతలోనే రాఘవన్ వ్యవహారం ఇలా వెలుగుచూడటం గమనార్హం.












Click it and Unblock the Notifications