టీడీపీ, జేడీయూలో అదే భయం ? స్పీకర్ పోస్టు డిమాండ్ వెనుక ?
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీయే కూటమిలో కీలక పార్టీలుగా అవతరించిన టీడీపీ, జేడీయూ ఇప్పుడు కేంద్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో తీసుకోబోయే మంత్రి పదవుల కంటే కూడా లోక్ సభ స్పీకర్ పోస్టుపైనే దృష్టిపెట్టాయి. ఓ కీలక కారణంతో ఈ రెండు పార్టీలు స్పీకర్ పోస్టు తమకే ఇవ్వాలని బీజేపీని పట్టుబట్టనున్నాయి. ఇంకా చెప్పాలంటే స్పీకర్ పోస్టు ఇవ్వకపోతే జేడీయూ ఎన్డీయేకు గుడ్ బై చెప్పేసినా ఆశ్చర్యం లేదు. అయితే ఈ రెండు పార్టీలూ లోక్ సభ స్పీకర్ పోస్టు తమకే కావాలని ఎందుకు కోరుకుంటున్నాయో చూద్దాం..
గత పదేళ్లలో కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్నో పార్టీలను మిత్రపక్షాలుగా చేర్చుకోవడమూ, లేక ఉన్న వాటిని తరిమేయడమో, ఇంకా చెప్పాలంటే తమ రాజకీయ లబ్ది కోసం చీల్చేసిన బీజేపీకి ఇప్పుడు ఆ అనుభవాలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 సీట్ల మ్యాజిక్ మార్కు దాటినా కేవలం 20 సీట్ల మెజార్టీ మాత్రమే లభించింది. దీంతో ఇప్పుడు ఆ 20 సీట్ల మెజార్టీని కాపాడుకుంటూనే రాజకీయాన్ని పూర్తిగా తమవైపు తిప్పుకునేందుకు కేంద్రం ప్రయత్నించడం ఖాయం.

ఇందులో భాగంగా మహారాష్ట్ర తరహాలోనే మిత్రపక్షాల్ని సైతం చీల్చేందుకు బీజేపీ వెనుకాడదన్న అంచనాలున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీకి మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, జేడీయూ రెండు పార్టీల్లో చీలికలు సృష్టించడం ద్వారా తమ ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకునేందుకు కాషాయ పార్టీ వెనుకాడదు. అందుకే ఇప్పుడు ఈ రెండు పార్టీలు భవిష్యత్తులో బీజేపీ వేయబోయే ఎత్తుకు ముందు జాగ్రత్తగా మరో ఎత్తు వేసేస్తున్నాయి.
లోక్ సభ స్పీకర్ పోస్టు తమకు ఇవ్వాల్సిందేనని ఇప్పుడు టీడీపీ, జేడీయూ బీజేపీని పట్టుబడుతున్నాయి. కేంద్రంలో మీకు మద్దతివ్వాలంటే స్పీకర్ పోస్టు ఇమ్మని కోరుతున్నాయి. భవిష్యత్తులో బీజేపీ తమ పార్టీల్ని చీల్చినా స్పీకర్ అండతో దాన్నుంచి బయటపడొచ్చనేది ఇరు పార్టీల ఆలోచన. దీంతో స్పీకర్ పోస్టు ఇవ్వాల్సిందేనని బీజేపీని పట్టుబడుతున్నాయి. ఇవాళ జరిగే ఎన్డీయే కూటమి భేటీలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.












Click it and Unblock the Notifications