పిక్చర్: గద్దర్ తరహాలో శివప్రసాద్ విభజనపై నిరసన

న్యూఢిల్లీ : విభజన తీరును నిరసిస్తూ తెలుగుదేశం సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు బుధవారంనాడు పార్లమెంటు ఒకటో నెంబర్ గేట్ వద్ద ఆందోళనకు దిగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలని కోరుతూ వారు నినాదాలు చేశారు. చిత్తూరు పార్లమెంటు సభ్యులు శివప్రసాద్ మాత్రం తనదైన శైలిలో ఎప్పటి మాదిరిగానే వినూత్న తరహాలో నిరసన తెలిపారు.
ఆ విచిత్ర వేషధారణతో నిరసన తెలుపుతూ శివప్రసాద్ మరోసారి మీడియా దృష్టిని ఆకర్షించారు. అయితే ఈసారి షర్టు విప్పి, భుజంపై గొంగళి వేసుకున్నారు. చేతిలో ఓ కర్ర పట్టుకుని ముందున్న మీడియా, పక్కనే ఉన్న ఎంపీలు కూడా అదిరిపడేలా ఓ విప్లవ గీతం అందుకున్నారు.
విప్లవ గాయకుడు గద్దర్‌ను తలపిస్తూ ఆయన గేయం అందుకున్నారు. సోనియా ఏందిరో సోనియా పీకుడేందిరో అంటూ గానం చేశారు. దొర ఏందిరో.. దొర పీకుడేందిరో అనే విప్లవ గీతానికి పేరడీ కట్టి సోనియా ఏందిరో...ఆమె పీకుడేందిరో అంటూ పాడారు.
రాష్ట్ర విభజనకు పూనుకున్న కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై, ఆ పార్టీపై విరుచుకుపడ్డారు. గతంలోనూ ఇలాగే పార్లమెంట్ ఆవరణలో కొరడాతో కొట్టుకొని వినూత్న రీతిలో ఆయన నిరసన తెలిపారు.












Click it and Unblock the Notifications