టాయిలెట్లలో సమస్య! 10 గంటల తర్వాత షికాగో-ఢిల్లీ విమానం వెనక్కి
సాంకేతిక సమస్య తలెత్తడంతో షికాగో నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఎయిరిండియా (Air India) విమానం తిరిగి వెనక్కి వెళ్లింది. దాదాపు 10 గంటలు ప్రయాణించిన అనంతరం తిరిగి షికాగోకు మళ్లించినట్లు విమానయాన సంస్థ వెల్లడించింది. విమానంలోని టాయిలెట్లు మూసుకుపోవడం వల్లే విమానాన్ని వెనక్కి మళ్లించాల్సి వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
షికాగోలోని ఓఆర్డీ విమానాశ్రయం నుంచి బోయింగ్ 777-337 ఈఆర్ విమానం ఢిల్లీకి బయల్దేరింది. మొత్తం 340 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ విమానంలో పది టాయిలెట్లు ఉన్నాయి. ఈ క్రమంలో విమానం బయల్దేరిన తర్వాత వీటిలో కేవలం ఒక్కటి మాత్రమే పనిచేస్తున్నట్లు గుర్తించారు. అప్పటికే 10 గంటలపాటు ప్రయాణించినప్పటికీ.. వెంనటే విమానాన్ని తిరిగి షికాగోకు మళ్లించారు.

ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, మార్చి 6న కూడా సాంకేతిక కారణాలతో షికాగో నుంచి ఢిల్లీకి వచ్చే ఏఐ 126 ఎయిరిండియా విమానాన్ని తిరిగి వెనక్కి పంపించినట్లు ఎయిరిండియా అధికార ప్రతినిధి వెల్లడించారు.
ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులు, సిబ్బందికి బస కల్పించామని, అంతేగాక, వారు గమ్యస్థానాలు చేరేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఎవరైనా ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే.. పూర్తి మొత్తాన్ని చెల్లిస్తామన్నారు. రీషెడ్యూల్ కు కూడా అవకాశం కల్పించామని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications