బీహార్ డిప్యూటీ సీఎంకు 2 ఓటర్ కార్డులు-తేజస్వీ మరో షాక్-వాస్తవంగా నిర్ధారణ..!
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ వరుస సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే తనకు ఓటర్ ఐడీ కార్డు లేదంటూ విపక్ష ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ చేసిన ఆరోపణ గతంలో సంచలనం రేపింది. దీనిపై ఈసీ స్పందించి వివాదానికి పుల్ స్టాప్ పెట్టింది. ఇవాళ తేజస్వీ మరో సంచలనం రేపారు. బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ సిన్హాకు రెండు ఓటర్ కార్డులు ఉన్న విషయాన్ని ఆధారాలతో సహా బయటపెట్టారు. దీంతో ఈసీ మరోసారి ఇరుకునపడింది.
ఈ ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించిన తేజస్వీ యాదవ్.. బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా వద్ద రెండు ఎపిక్ నంబర్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ నంబర్లు రెండు వేర్వేరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్నాయన్నారు. అలాగే ఈ రెండు కార్డులలో ఆయన వయస్సు కూడా భిన్నంగా ఉందని ఆరోపించారు. ఓ ఎపిక్ నంబర్ బంకిపూర్ సెగ్మెంట్‌లో ఉందని, ఇందులో ఆయన వయస్సు 60గా ఉందన్నారు. మరో ఎపిక్ నంబర్ లఖిసరాయిలో ఉందని, అందులో అతని వయస్సు 57 గా ఉందన్నారు.

కాబట్టి ఈ రెండు ఎపిక్ కార్డుల జారీ కోసం విజయ్ సిన్హా సంతకాలు చేసి ఉండొచ్చని, లేదా మొత్తం ఓటర్ల జాబితా సవరణ మోసం కావచ్చని తేజస్వీ యాదవ్ ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తేజస్వీ యాదవ్ విడుదల చేసిన ఓటర్ కార్డుల గురించి అంతా ఆరా తీయడం ప్రారంభించారు. దీంతో గంటల వ్యవధిలోనే డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా స్పందించారు. ఇందులో ఓ నియోజకవర్గం నుండి తన పేరును తొలగించాలని తాను ఇప్పటికే ఈసీని అభ్యర్థించానని తెలిపారు. కాబట్టి తేజస్వీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఎదురుదాడికి దిగారు.

ఇప్పటికే బీహార్ లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై ఆర్జేడీ, కాంగ్రెస్ తో కూడిన విపక్ష ఇండియా కూటమి తీవ్ర విమర్శలు చేస్తోంది. బీహార్ లో భారీ ఎత్తున ఓట్లను తొలగించేందుకు చేపట్టిన ప్రక్రియగా దీన్ని ఆరోపిస్తోంది. ఇలాంటి సమయంలో ఏకంగా డిప్యూటీ సీఎం రెండు ఎపిక్ కార్డులు కలిగి ఉండటంతో ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లయింది. ఈసీ మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు.












Click it and Unblock the Notifications