వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: బతుకమ్మ చీరలు... 17 రంగులు, 15 డిజైన్లు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
చీరల తయారీ(ప్రతీకాత్మక చిత్రం)

తెలంగాణలో బతుకమ్మ చీరలు సిద్ధమయ్యాయని, 17 రంగులు, 15 డిజైన్లలో తయారైన ఈ చీరలు జిల్లాలకు చేరుకొంటున్నాయని 'నమస్తే తెలంగాణ’ కథనం తెలిపింది.

''ఈసారి కూడా 18 ఏళ్లు దాటిన అర్హులైన మహిళలందరికీ చీరలు పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. అక్టోబర్‌ 6లోగా పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా అర్హులైన మహిళలందరికీ ఉచితంగా చీరలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.

రాష్ట్రంలో 1.05 కోట్ల మంది అర్హులైన మహిళలుండగా, ఏటా దాదాపు 97 లక్షల మంది బతుకమ్మ చీరలు తీసుకొంటున్నారు.

దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈసారి రూ.333 కోట్లు కేటాయించి టెస్కో ఆధ్వర్యంలో కోటి చీరలను తయారు చేయించేందుకు మూడు జిల్లాల్లోని పవర్‌లూమ్స్‌కు ఆర్డర్‌ ఇచ్చింది.

దీంతో సిరిసిల్లలోని పవర్‌లూమ్స్‌పై 75 లక్షలు, వరంగల్‌లో 13 లక్షలు, కరీంనగర్‌లో 12 లక్షల చీరలు తయారు చేశారు.

వీటిలో ఇప్పటికే 35 లక్షల చీరలను 18 జిల్లాలకు తరలించి గోదాముల్లో భద్రపరిచారు.

మిగిలిన జిల్లాలకు రానున్న పదిహేను రోజుల్లో చీరలు రవాణా చేసేందుకు ప్రణాళిక రూపొందించారు.

వృద్ధులకు 6.3 మీటర్లు, ఇతరులకు 5.5 మీటర్ల చీరలను తయారు చేశారు. వీటి తయారీ ద్వారా దాదాపు 10 వేలమంది నేత కార్మికులు, 5 వేలమంది డిజైనర్లు, ఇతర అనుబంధ కార్మికులు ఉపాధి పొందినట్లు అధికారులు వివరించారు’’ అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఏపీలో పింఛను ఏ నెలకు ఆ నెలే

ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై సామాజిక పింఛన్లు రెండు నెలలవి ఒకేసారి తీసుకోవడం సాధ్యపడదని 'ఈనాడు' తన కథనంలో తెలిపింది.

''రెండు మూడు నెలలు పింఛను తీసుకోకపోయినా ఆ తరువాత ఒకేసారి ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ప్రతి నెలా మొదటి మూడు రోజుల్లోనే తీసుకోవాలని స్పష్టం చేసింది. ఏ నెలైనా సమయానికి తీసుకోకపోతే ఆ నెల పింఛను చేతికి రానట్లే. పింఛను తొలగించరు కానీ ఏ నెలది ఆ నెలే ఇస్తారు.

ఈ విషయం వైఎస్ఆర్ పింఛను కానుక పథక లబ్ధిదారులకు తెలియజేయాలని వలంటీర్లకు ప్రభత్వం ఆదేశాలిచ్చింది.

మరోవైపు గత 3 నెలలుగా ప్రభుత్వం వివిధ కారణాలతో 2.28 లక్షల మందికి పింఛన్లు నిలిపివేసింది.

జూన్‌లో 61.46 లక్షలు ఉన్న పింఛనుదారుల సంఖ్య సెప్టెంబరు నాటికి 59.18 లక్షలకు చేరింది'' అని ఆ కథనంలో రాశారు.

కేసీఆర్‌ చేతిలో రాష్ట్రం బందీ: వైఎస్‌ షర్మిల

తాలిబన్ల చెరలో అఫ్గానిస్తాన్‌ బాధలు పడుతున్నవిధంగానే సీఎం కేసీఆర్‌ చేతిలో తెలంగాణ బందీగా మారిందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారని 'సాక్షి’ పత్రిక కథనం తెలిపింది.

''సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో షర్మిల మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. అంతకుముందు గజ్వేల్‌ మండలం అనంతరావుపల్లికి చెందిన కొప్పు రాజు కుటుంబీకులను వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఉద్యోగం రావడంలేదనే బాధతో 7 నెలల క్రితం రాజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందేన్నారు.

ప్రజ్ఞాపూర్‌ చౌరస్తాలోని వైఎస్సార్‌ విగ్రహానికి షర్మిల పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం దీక్షాస్థలికి చేరుకుని దీక్షను కొనసాగించారు.

కొప్పు రాజు తల్లిదండ్రులు లక్ష్మి-సత్తయ్యలు సాయంత్రం షర్మిలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

అనంతరం షర్మిల మాట్లాడుతూ 'టీఆర్‌ఎస్‌ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు, అలాంటప్పుడు కేసీఆర్‌ లాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా..'అని ప్రశ్నించారు.

కొత్త జిల్లాల ఆవిర్భావం తర్వాత ఖాళీ పోస్టుల సంఖ్య 3.80 లక్షలకు పెరిగినా, ప్రభుత్వం వాటిని భర్తీ చేయకపోవడంతో మనోస్థైర్యాన్ని కోల్పోతున్న నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు.

నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపలేని ప్రభుత్వం ఉన్నా, లేకున్నా, ఒక్కటేనని చెప్పారు. నిరుద్యోగులు అధైర్యపడవద్దని, వారి తరపున పోరాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని భరోసా ఇచ్చారు.

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు భారీగా నామినేషన్లు వేయాలని, నిజామాబాద్‌లో కవితను ఓడించినట్లే, హుజూరాబాద్‌లోనూ టీఆర్‌ఎస్‌ను ఓడించాలని షర్మిల పిలుపునిచ్చార’’ని ఆ కథనంలో రాశారు.

వెలిగొండను తక్షణమే గెజిట్‌లో చేర్చాలి

రాష్ట్ర విభజన చట్టానికి కట్టుబడి.. ప్రకాశం జిల్లా జీవనాడి వెలిగొండ ప్రాజెక్టును తక్షణమే గెజిట్‌లో చేర్చాలని ప్రకాశం, నెల్లూరు జిల్లాల టీడీపీ ప్రస్తుత/మాజీ ఎమ్మెల్యేలు, నేతలు కేంద్రానికి విజ్ఞప్తి చేశారని 'ఆంధ్రజ్యోతి’ కథనం తెలిపింది.

''వారంతా మంగళవారం దిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సమావేశమై వినతి పత్రం సమర్పించారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతోనూ భేటీ అయ్యారు. వెలిగొండ సమస్యను ఆయనకు వివరించగా.. ఆయన వెంటనే షెకావత్‌తో ఫోన్లో మాట్లాడారు.

వెలిగొండ ప్రాజెక్టును గెజిట్‌లో పొందుపరచాలని కోరారు. అందుకు జలశక్తి మంత్రి సానుకూలంగా స్పందించారు. అంతకుముందు.. షెకావత్‌ను కలిసినప్పుడు.. ఈ ప్రాజెక్టుపై ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలు ఆధారపడి ఉన్నారని.. వారికి సాగు, తాగునీటి ప్రయోజనాలు కలుగుతాయని టీడీపీ నేతలు వివరించారు

. గెజిట్‌లోని 24వ పేజీలో అనుమతిలేని ప్రాజెక్టుగా పేర్కొన్నారని.. దీనిని తెలంగాణ ప్రభుత్వం సాకుగా తీసుకుని.. అడ్డంకులు సృష్టిస్తోందని తెలిపారు. మంత్రిని, ఉపరాష్ట్రపతిని కలిసినవారిలో ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌ (అద్దంకి), డోలా బాల వీరాంజనేయ స్వామి (కొండపి), ఏలూరి సాంబశివరావు (పరుచూరు) తదితరులు ఉన్నార’’ని ఆ కథనంలో రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Telangana: Batukamma sarees 17 colors, 15 designs
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X