రాజ్యసభలో రేపు బిల్లు: టిపై ఫరూక్, కిరణ్ రిజైన్‌పై టిజి
రాజ్యసభలో రేపు: టి బిల్లుపై ఫరూక్, కిరణ్ రిజైన్‌పై టిజి
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లును రేపు (మంగళవారం) మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు రాజ్యసభలో ప్రవేశ పెట్టనున్నారని సమాచారం. దీనికి సంబంధించి కేంద్రమంత్రులు కమల్ నాథ్, సుశీల్ కుమార్ షిండే, జైరామ్ రమేష్‌లు రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీతో భేటీ అయ్యారని తెలుస్తోంది.

టిపై ఫరూక్ అబ్దుల్లా
తెలంగాణ అంశంపై ఇప్పటికే అధుపు తప్పిందని కేంద్రమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా అన్నారు. రాష్ట్ర ప్రజలు విభజన వద్దని చెబుతున్నప్పుడు, అసెంబ్లీ కూడా విభజన బిల్లును తిరస్కరించినప్పుడు పార్లమెంటు దానిని గుడ్డిగా ఆమోదించవద్దన్నారు. విభజన ప్రక్రియలో తప్పులు దొర్లాయని విమర్శించారు. తెలంగాణ బిల్లును శుక్రవారం మంత్రివర్గం ఆమోదించినప్పుడు ఆ భేటీలో తాను లేనని చెప్పారు.
టి బిల్లుపై కాంగ్రెసు కుట్రపూరితంగా: ప్రకాశ్ జవదేకర్
తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ మండిపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేతలపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. అలాంటప్పుడు తెలంగాణ మంత్రులు సిఎంకు సహకరించాలని చెప్పడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆ తర్వాతే కిరణ్ ఆలోచిస్తారు: సీమాంధ్ర మంత్రులు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారనేది కేవలం ఊహాగానాలేనని మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డిలు సోమవారం హైదరాబాదులో అన్నారు. కిరణ్ రాజీనామాపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైరన రాష్ట్రపతి నిర్ణయం తర్వాతనే కిరణ్ ఆలోచన చేస్తారని చెప్పారు. తెలంగాణ బిల్లు పైన రాష్ట్రపతి కూడా డైలమాలో ఉన్నారని చెప్పారు. కాగా, మంత్రులు టిజి, ఏరాసులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. అనంతరం కాసు వెంకటకృష్ణా రెడ్డి, గంటా శ్రీనివాస రావు, టిజి, ఏరాసులు భేటీ అయ్యారు.
జానారెడ్డితో ఖమ్మం జిల్లా నేతల భేటీ
పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డితో ఖమ్మం జిల్లా నేతలు మల్లు భట్టి విక్రమార్క, రాంరెడ్డి వెంకట రెడ్డి, మహబూబాబాద్ ఎంపి బలరాం నాయక్ తదితరులు భేటీ అయ్యారు. భద్రాచలం ముంపు ప్రాంతాలని సీమాంధ్రలో కలుపుతారనే కథనాల నేపథ్యంలో వారు జానాను కలిశారు.
మరోవైపు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంతో బాటు, అందుకు అనుగుణంగా ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలుపుతారనే వార్తల నేపథ్యంలో పోలవరం డిజైన్ మార్చి ముంపు ప్రాంతాన్ని తగ్గించాలని కోరుతూ అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ నేతలు దీక్ష చేపట్టారు. డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి బలరాం నాయక్, రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఇంకా కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలు ఈ దీక్షలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications