సవతి తల్లి ప్రేమ: మోడీ ప్రభుత్వంపై తెలంగాణ గుర్రు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తూ తెలంగాణకు కొద్గిగా మాత్రమే రాయితీ కల్పించడంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 850 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది. తెలంగాణకు పరిమిత స్థాయిలో ఆర్థిక రాయితీని ప్రకటించింది.
అన్ని రాష్ర్టాలనూ సమ దృష్టితో చూస్తామని స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించినా చివరకు తెలంగాణను మాత్రం పక్షపాత దృష్టితోనే చూశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆంధ్రప్రదేశ్‌కు అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించింది. తెలంగాణ ప్రస్తావన మాత్రం చేయలేదని అంటున్నారు. పది జిల్లాలున్న తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలు వెనకబడినవేనని కేంద్రమే గుర్తించినప్పటికీ ఈ జిల్లాల అభివృద్ధికి మాత్రం ప్రత్యేక ప్యాకేజీ కింద ఎలాంటి ఆర్థిక సాయాన్నీ ప్రకటించలేదు.

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 46 (2), (3) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ఈ సాయాన్ని ఇస్తున్నట్లు చెప్పిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి సైతం ఇదే చట్టంలోని సెక్షన్ 94(1) ప్రకారం పన్ను రాయితీలు, పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్లు తెలిపింది. పరిశ్రమలను ప్రోత్సహించడం, ఆర్థికాభివృద్ధిని సాధించడం తదితరాలను లక్ష్యంగా చేసుకుని ఈ రాయితీలను ఇవ్వనున్నట్లు తెలిపింది.
కొత్తగా ఏర్పడిన రెండు రాష్ర్టాలకూ కేంద్రం తగిన ప్రాధాన్యం ఇస్తుందని, ఒకదానిపట్ల ఎక్కువ ప్రేమను చూపించదని పలుమార్లు కేంద్రం పెద్దలు వ్యాఖ్యానించినప్పటికీ ఆచరణలో మాత్రం భిన్నంగా వ్యవహరించిందనే విమర్శలు వస్తున్నాయి.
వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు రూ.350 కోట్లు సహాయం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వానికి మరో రూ.500 కోట్లు ఆర్థిక మద్దతు ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం రాత్రి దీనిపై ప్రకటన జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 46(2), 46(3) సెక్షన్ల ప్రకారం కొత్తగా ఏర్పడ్డ ఏపీలోని వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు, రాయలసీమలోని నాలుగు, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటన చేసింది. 2014-15 సంవత్సరానికి జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున ఏడు జిల్లాలకు రూ.350 కోట్లు మంజూరు చేస్తున్నామని ఆర్థిక శాఖ తన ప్రకటనలో తెలిపింది.












Click it and Unblock the Notifications