IIT Madras: ఐఐటీ నుంచి తల్లీ, కొడుకూ ఒకేసారి గ్రాడ్యుయేషన్..!
మన దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటైన ఐఐటీ మద్రాస్ (IIT Madras)లో తాజాగా ఓ అద్భుతం చోటు చేసుకుంది. ఐఐటి మద్రాస్ లో నిర్వహించిన స్నాతకోత్సవ వేడుకల్లో వేదికపై 45 ఏళ్ల జిగీషా టైలర్ అనే మహిళ, ఆమె కుమారుడు 21 ఏళ్ల ఆదిత్య కపాడియా ఒకేసారి గ్రాడ్యుయేట్ డిగ్రీలు తీసుకున్నారు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఐఐటీ నిర్వహించిన ఆన్‌లైన్ డేటా సైన్స్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన వీరిద్దరూ ఒకేసారి ఈ డిగ్రీలు తీసుకున్నారు.
ఈ తల్లీ కొడుకూ ఇద్దరూ ఒకే ప్రోగ్రామ్ నుండి డిగ్రీలు పొందినా.. కలిసి పట్టభద్రులు కావాలని మాత్రం అనుకోలేదు. జిగీషా గుజరాత్‌లోని భరూచ్‌లో ఒక ఇంజనీరింగ్ కళాశాలలో 16 సంవత్సరాల పాటు ఎలక్ట్రానిక్స్ బోధించారు. 2019లో కుటుంబ బాధ్యతల కారణంగా ఆమె ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. మూడేళ్ల తర్వాత ఐఐటీ మద్రాస్ ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లో చేరమని ఆమె కుమారుడు ప్రోత్సహించడంతో జిగీషా తిరిగి చదువు ప్రారంభించారు. ఆదిత్య తన 18వ ఏట 2021లో ఐఐటీ మద్రాస్ ఆన్‌లైన్ బీఎస్ ఇన్ డేటా సైన్స్ అండ్ అప్లికేషన్స్ కోర్సులో చేరాడు.

కోవిడ్ కారణంగా దేశంలో ఉన్న కాలేజీలన్నీ ఆన్‌లైన్ కు మారిపోయాయి. దీంతో తాను ఏదైనా ఐఐటీ, ఎంఐటీ లేదా స్టాన్‌ఫోర్డ్ నుండి రెగ్యులర్ కోర్సు చేసి ఉంటే అది కేవలం ఆన్‌లైన్‌లోనే ఉండేదని, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఆసక్తి ఉండటంతోనే ఆ ప్రోగ్రామ్‌ను ఎంచుకున్నట్లు ఆదిత్య ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు వెల్లడించాడు. ఆ సమయంలో ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లోని విద్యార్థులు కాలేజీలో కూడా నమోదు చేసుకోవాల్సి వచ్చేది. దీంతో ఐఐటీ మద్రాస్ ప్రోగ్రామ్ చేస్తూనే, ఆదిత్య అహ్మదాబాద్‌లోని ఒక కళాశాలలో డిప్లొమా కోర్సులో చేరాడు. ఆ తర్వాత, ఐఐటీ మద్రాస్ సెనేట్ బీఎస్ డిగ్రీని సాధారణ నాలుగేళ్ల ప్రోగ్రామ్‌కు సమానంగా గుర్తించాక, డిప్లొమా కోర్సును వదిలిపెట్టి, ఐఐటీ మద్రాస్‌లోనే చదువు కొనసాగించాడు.
జిగీషా మొదట తన కొడుకు ఇంటి నుంచే చదువుకోవడం చూసింది, ఆమెకు ఎలక్ట్రానిక్స్‌లో ఉన్న నేపథ్యానికి సంబంధించినవే కాకుండా, కొత్త కాన్సెప్ట్ లను కూడా పరిచయం చేసిన స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సిస్టమ్స్ వంటి సబ్జెక్టులను కూడా చూసింది. ఆదిత్య ఆమెను ఈ ప్రోగ్రామ్‌లో చేరమని పదేపదే ప్రోత్సహించగా ఆమె చివరకు 2022 చివరిలో చేరింది. ఆమె ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన లైవ్ సందేహ నివృత్తి తరగతులకు హాజరవ్వడంతో పాటు, సహవిద్యార్థులు ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా సాయం దొరికింది. ఎక్కువ పనిభారం మోసిన తన కొడుకులా కాకుండా, ఆమె ప్రతి సెమిస్టర్‌లో ఒకటి లేదా రెండు సబ్జెక్టులను మాత్రమే చదవాలని అనుకుంది. కాలం గడిచేకొద్దీ, తల్లీకొడుకులు చదువులో భాగస్వాములుగా, అలాగే స్నేహపూర్వక పోటీదారులుగా మారారు. చివరికి ఇద్దరూ ఒకేసారి ఉత్తీర్ణులై డిగ్రీలు పొందారు.














Click it and Unblock the Notifications