ఎంపీలకు ప్రణబ్ హితవు: రాజ్యసభలో కెవిపి నినాదాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యులు తమ బాధ్యతను గుర్తెరిగి మసలుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సూచించారు. పార్లమెంటు ఉన్నది సమస్యలు చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకేనని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సహా పలు కీలక బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశాలు ఉండడం మరోవైపు విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఎంపీలు పార్లమెంటులో నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి ఇలా సూచించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్లమెంటు సభ్యులు తమ బాధ్యతను ఆత్మావలోకనం చేసుకోవాలని సూచించారు. సభ ఉన్నది అడ్డుకునేందుకు కాదని హితవు పలికారు.
మరోవైపు, సోమవారం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన ఇరు సభలు కాసేపటికే వాయిదా పడ్డాయి. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత ఎంపీలు నినాదాలు చేయడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో ఉభయ సభలు గంటపాటు వాయిదా పడ్డాయి.

అనంతరం పన్నెండు గంటలకు ప్రారంభమైన లోకసభలో పరిస్థితి మారలేదు. దీంతో సభాపతి మీరా కుమార్ రేపటికి వాయిదా వేశారు. సభ్యులు సభ జరిగేందుకు సహకరించాలని ఆమె కోరినా వినిపించుకోలేదు. సభ్యుల గందరగోళం మధ్యనే జీరో అవర్ కొనసాగించారు. ఆ తర్వాత సభను రేపటికి వాయిదా వేశారు.
రాజ్యసభలోను అదే పరిస్థితి నెలకొనడంతో చైర్మన్ హమీద్ అన్సారీ సభను పావుగంట వాయిదా వేశారు. ఇరు సభల్లో ఇరు ప్రాంతాల ఎంపీలు నినాదాలు చేస్తూ పోడియం వద్దకు వచ్చే ప్రయత్నాలు చేశారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన కెవిపి రామచంద్ర రావుతో సహా ఇతర ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. కెవిపి పైన రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు మండిపడ్డారు. అధిష్టానం అండతో రాజ్యసభకు ఎన్నికైన కెవిపి పెద్దలను ధిక్కరించడం సరికాదన్నారు.
అనంతరం రాజ్యసభ ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. కెవిపి, ఇతర ఎంపీలు సమైక్య ప్లకార్డులతో నిరసన తెలిపారు. రాజ్యసభలో పేపర్లు చింపి గాల్లోకి విసిరేశారు.












Click it and Unblock the Notifications