గోల్డెన్ బే రిసార్ట్ వద్ద ఉద్రిక్తత: పోలీసులపై రాళ్ల దాడి, శశికళపై పెరుగుతున్న వ్యతిరేకత
గోల్డెన్ బే రిసార్ట్ వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడ ఉన్న ఎమ్మెల్యేల వాంగ్మూలం తీసుకునేందుకు రిసార్ట్ వద్దకు వెళ్లగా..
చెన్నై: గోల్డెన్ బే రిసార్ట్ వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తనకు మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలందర్నీ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ.. గోల్డెన్ బే రిసార్టులో ఉంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడ ఉన్న ఎమ్మెల్యేల వాంగ్మూలం తీసుకునేందుకు రిసార్ట్ వద్దకు వెళ్లారు.

శశికళ వర్గీయుల రాళ్లదాడి
పోలీసులు, రెవెన్యూ అధికారులు.. ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు కోసం రిసార్ట్ లోపలికి వెళుతుండగా.. శశికళ వర్గంవారు వాగ్వాదానికి దిగారు. అంతేగాక, వారిపై రాళ్ల దాడితో విరుచుకుపడ్డారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి.

హైకోర్టు ఆదేశాలతోనే..
ఈ పరిణామంతో పోలీసులు, అధికారులు రిసార్ట్ లోపలికి వెళ్లలేకపోయారు. అక్కడి సీసీటీవీల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. సోమవారం లోపల క్యాంపులోని ఎమ్మెల్యేల వివరాలతోపాటు వాంగ్మూలం తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు చేపట్టిన నేపథ్యంలో భారీ బలగాలతో మరోసారి వచ్చి ఎమ్మెల్యేల వాంగ్మూలాన్ని తీసుకోనున్నారు.

దాడి చేసిన నిందితుల అరెస్ట్ చేసే అవకాశం..
దాడులకు పాల్పడిని వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల వాంగ్మూలం కోసం 150మంది పోలీసులు, రెవెన్యూ అధికారులు రిసార్ట్ వద్దకు వెళ్లినట్లు తెలిసింది. దాడి నేపథ్యంలో శశికళపై మరింత వ్యతిరేకత పెరిగే అవకాశం ఏర్పడింది. అయితే, అన్నాడీఎంకే సీనియర్ నేతలు.. అక్కడి ఎమ్మెల్యేలతో భేటీ అయిన తర్వాత పోలీసులతో ఎమ్మెల్యేలను మాట్లాడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గవర్నర్ సూచనలే కీలకం
కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 15వేల మంది కేంద్ర బలగాలున్నాయి. వీటిని కూడా గవర్నర్ సూచనల మేరకు రాష్ట్ర పోలీసులు ఉపయోగించుకోనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర పోలీసులు.. సీఎం కావాలనుకుంటున్న అన్నాడీఎంకే కార్యదర్శి శశికళ, అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఆదేశాలు కాకుండా గవర్నర్ సూచనల మేరకే పని చేస్తుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications