దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు ప్రారంభం-ఢిల్లీలో ఉద్రిక్తత-కాంగ్రెస్ ర్యాలీ అడ్డగింపు
నిరుద్యోగం, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టింది. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్, ప్రధాని నివాసాల ముట్టడికి కాంగ్రెస్ నేతలు బయలుదేరారు. అంతకు ముందు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో ఇప్పుడు ప్రజాస్వామ్యం లేదని, మన దేశం నలుగురి నియంతృత్వ పాలనలో ఉందని అన్నారు. భారతదేశం ప్రజాస్వామ్య మరణాన్ని చూస్తోందన్నారు. దాదాపు శతాబ్ధం క్రితం ఒక్కో ఇటుక పేర్చి నిర్మించిన మన దేశం మీ కళ్ల ముందు నాశనం అవుతోందన్నారు. నియంతృత్వం యొక్క ఈ ఆలోచనకు వ్యతిరేకంగా నిలబడిన ఎవరైనా దుర్మార్గంగా దాడి చేస్తారని కేంద్రాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఢిల్లీలో యంగ్ ఇండియన్ సంస్ధ కార్యాలయానికి ఈడీ సీల్ వేయడం, రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గేకు ఈడీ పార్లమెంటు సమావేశాల్లో ఉండగానే విచారణకు రావాలని సమన్లు జారీ చేయడం తీవ్ర కలకలం రేపాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఢిల్లీలో ప్రధాని మోడీ నివాసం ముట్టడికి పిలుపునిచ్చింది. రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ అనంతరం ప్రధాని ఇంటికి కాంగ్రెస్ నేతలు ర్యాలీగా బయలుదేరారు. అయితే మధ్యలోనే వారిని పోలీసులు, పారామిలటరీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. ఢిల్లీలో ఉద్రిక్తల్ని నివారించేందుకు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

మరోవైపు కాంగ్రెస్ నేతల నిరసనను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు పార్లమెంట్ హౌస్ సమీపంలోని ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యాలయం ప్రవేశ ద్వారం వద్ద బారికేడ్లు వేశారు. గేటు వద్ద ఢిల్లీ పోలీసులు, పారామిలటరీ బలగాలను మోహరించారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ర్యాలీలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా పార్టీ నేతలు వెనక్కి తగ్గడం లేదు. ఆగస్టు 5 నుంచి దేశవ్యాప్త నిరసనలు, ప్రధాని మోడీ ఇల్లు ముట్టడికోసం పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై నిన్న కాంగ్రెస్ అగ్ర నేతలు చర్చించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు ముకుల్ వాస్నిక్, అజయ్ మాకెన్, అవినాష్ పాండే, ఇన్‌ఛార్జ్‌లు రాజీవ్ శుక్లా, శక్తిసిన్హ్ గోహిల్, మాణికం ఠాగూర్, డీకే శివకుమార్‌తోపాటు రాష్ట్ర శాఖ అధ్యక్షులు డికె శివకుమార్‌తో పాటు పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొని నిరసనను విజయవంతం చేయడంపై చర్చించారు.












Click it and Unblock the Notifications