భారతీయ పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60 రోజుల ఫ్రీ వీసా క్యాన్సిల్!
భారతీయ పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడే టూరిస్ట్ ప్లేస్ లలో థాయ్‌లాండ్ ఒకటి. అందమైన పర్యాటకస్థలాలు, బీచ్‌లు, సంస్కృతి, ఆహారం, షాపింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ దేశం భారతీయులకు వీసా లేకుండా 60రోజుల పాటు ఉండే అవకాశం కల్పించింది. కానీ ఇప్పుడు ఆ సౌకర్యాన్ని పూర్తిగా రద్దు చేస్తూ థాయ్‌లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది భారతీయులతో పాటు మొత్తం 90 దేశాల పర్యాటకులకు షాక్ ఇస్తుంది.
కొత్త వీసా నిబంధనలు తీసుకువచ్చిన థాయ్ ల్యాండ్ ప్రభుత్వం
థాయ్‌లాండ్ క్యాబినెట్ ఈ మే 19న కొత్త వీసా నిబంధనలకు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం, భారత్‌తో సహా 93 దేశాలకు వర్తించే 60 రోజుల ఉచిత వీసా ప్రోగ్రామ్‌ను తొలగించారు. బదులుగా 'వీసా ఆన్ అరైవల్’ సౌకర్యం కింద భారతీయులు థాయ్‌లాండ్ చేరుకున్న తర్వాత 15 రోజులు మాత్రమే ఉండే అనుమతి ఉంటుంది. ఇందుకోసం ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

ఈ కారణాలతోనే థాయ్ ల్యాండ్ షాక్
థాయ్ ల్యాండ్ ప్రభుత్వం ఈ మార్పును భద్రతా కారణాలతో తీసుకున్నట్టు చెప్తోంది. 60 రోజుల ఉచిత వీసా విధానం కారణంగా అక్రమ చొరబాట్లు, అంతర్జాతీయ నేరాలు, మాదకద్రవ్యాల స్మగ్లింగ్ వంటి సమస్యలు పెరిగాయని అధికారులు భావిస్తున్నారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో 2024 జూలైలో భారత్‌ను 60 రోజుల వీసా ఫ్రీ జాబితాలో చేర్చారు. అయితే ఇప్పుడు భద్రత, ఆర్థిక ప్రయోజనాలు, స్పష్టమైన నియమాలపై దృష్టి సారించారు.
కొత్త వీసా విధానంలో భారీ మార్పులు చేసిన థాయ్ ల్యాండ్
ఈ కొత్త విధానంలో మరికొన్ని మార్పులు కూడా ఉన్నాయి. 30 రోజుల వీసా మినహాయింపు దేశాల సంఖ్యను 57 నుంచి 54కి తగ్గించారు. కొత్తగా మూడు దేశాలకు 15 రోజుల వీసా ప్రోగ్రామ్ ప్రారంభించారు. వీసా ఆన్ అరైవల్ దేశాల సంఖ్యను 31 నుంచి 4కి పరిమితం చేశారు. ఈ నిబంధనలు 'రాయల్ గెజిట్’లో ప్రచురించిన 15 రోజుల తర్వాత అమలులోకి వస్తాయి.
థాయ్ ల్యాండ్ లో ఎక్కువ రోజులు ఉండాలనుకునేవారికి కష్టమే
థాయ్‌లాండ్‌లో దీర్ఘకాలం గడపాలనుకునే భారతీయులకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ఇప్పటికే బ్యాక్‌ప్యాకర్లు, ఫ్రీలాన్సర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎక్కువగా వెళ్తున్న దేశం అయిన థాయ్ ల్యాండ్ లో ఇక ముందు 15 రోజులకు మించి ఉండడం కష్టం. ఎక్కువ రోజులు ఉండాలనుకునేవారు ముందుగానే ఇ-వీసా లేదా ఇతర వీసా రకాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
భారత్-థాయ్‌లాండ్ పర్యాటక సంబంధాలపై ప్రభావం
థాయ్‌లాండ్ పర్యాటక మంత్రి సురసక్ ఫంచారోయెన్ వోరాకుల్ కూడా ఈ మార్పులను సమర్థించారు. కేవలం పర్యాటకుల సంఖ్యను పెంచడం కంటే, నాణ్యత, భద్రత, స్థిరమైన ప్రమాణాలపై దృష్టి పెట్టాలని వారు అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం భారత్-థాయ్‌లాండ్ పర్యాటక సంబంధాలపై కొంత ప్రభావం చూపవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ, థాయ్‌లాండ్ ఇప్పటికీ భారతీయులకు ఇష్టమైన గమ్యస్థానంగానే ఉంటుందని అంచనా. కానీ ప్రయాణానికి ముందు తాజా వీసా నిబంధనలను తప్పకుండా చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications