కావేరీ జలాలు: సుప్రీం కోర్టుకు చేరిన నిపుణుల నివేదిక
న్యూఢిల్లీ: కావేరీ జలాలు పంపిణి విషయంపై అధ్యయనం చేసిన కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక నిపుణుల కమిటీ అక్టోబర్ 17వ తేది సోమవారం నివేదికను సుప్రీం కోర్టులో సమర్పించింది. తమిళనాడు, కర్ణాటక అన్నదాతల పరిస్థితి, పరిహారం చెల్లించే విషయం, వర్ష ప్రభావం గురించి పూర్తి వివరాలు సేకరించి నివేదిక తయారు చేసి సుప్రీం కోర్టులో సమర్పించారు.
ఈ కమిటీలో కేంద్ర జనవనరుల శాఖకు చెందిన జీఎస్. ఝూ (చేర్మన్ గా), మసూద్ హుసేన్, ఆర్ కే గుప్తా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ప్రభుత్వ సీనియర్ ఇంజనీర్లు మెంబర్లుగా ఉన్నారు. సీడబ్ల్యూసీ కమిటీ కావేరీ జలాల పంపిణి విషయంపై అధ్యయనం చేశారు. సీడబ్లూసీ సమర్పించిన నివేదికలోని వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
కావేరీ నీటిపై ఆదారపడిన 48 తాలుకాలలో 42 కరువుపీడిత తాలుకాలుగా గుర్తించారు. కర్ణాటక, తమిళనాడులో చెరుకు పంటలకు నీరు సరఫరా చెయ్యలేకపోయారు. కర్ణాటకలోని మండ్య జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. అనేక మంది అన్నదాతలు కావేరీ జలాలు అందకపోవడంతో పంటలు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నారని నివేదికలో తెలిపారు.

2016 అక్టోబర్ 13 వరకు కర్ణాటక జలాశయాల్లో 22.90 టీఎంసీల నీరు సేకరించారు.తమిళనాడులోని మెట్టూరు డ్యాంలో 31.66 టీఎంసీల నీరు సేకరించారు. కావేరీ నదీ ప్రాంతాల్లోని కరువు పీడిత తాలుకాల్లో నిరుద్యోగం తాండవం చేస్తుందని నివేదికలో పొందుపరిచారు. అనావృష్టి ఎదురైన సమయంలో ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.
కర్ణాటకకు అవసరమైన నీరు
2016 అక్టోబర్ 1 నుంచి 2017 మే వరకు కర్ణాటకకు 33.38 టీఎంసీల నీరు అవసరం అవుతుంది. దాదాపు 4.27 లక్షల ఎకరాలను కావేరీ నీరు సరఫరా చేయవలసి ఉంది. బెంగళూరు తాగు నీటి అవసరాలకు 23.10 టీఎంసీల నీరు అవసరం అవుతుందని గుర్తించారు. ఈ నివేదికలో పరిశ్రమలకు ఎంత నీరు అవసరం అవుతుంది అనే వివరాలు పొందుపరచలేదు.
తమిళనాడుకు అవసరమైన నీరు
2016 అక్టోబర్ 1 నుంచి 2017 మే వరకు తమిళనాడుకు 133 టీఎంసీల నీరు అవసరం అవుతుంది. సుమారు 12 లక్షల ఎకరాలకు నీరు సరఫరా చేయవలసి ఉంది. తాగు నీటి కోసం 22 టీఎంసీల నీరు అవసరం అవుతుంది. పుదుచ్చేరికి ఇదే వ్యవధిలో 3 టీఎంసీల నీరు అవసరం అవుతుందని నివేదికలో పొందుపరిచారు.












Click it and Unblock the Notifications