వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా పడగ నీడలో వణికిపోతున్న దిల్లీ నగరం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
దిల్లీ ఆస్పత్రుల దుస్థితి

గత కొన్ని రోజులుగా దిల్లీలో ఎక్కడ చూసినా ఆక్సిజన్ కొరత, మందులు దొరక్కపోవడం, వెంటిలేటర్ సహాయం అందకపోవడం, మరణాలు పెరగడంతో... పరిస్థితి భయానకంగా మారింది.

వాస్తవాలు తెలుసుకోవడానికి శనివారం నేను కారులో బయలుదేరి పలు ఆస్పత్రులు, బస్సులు, రైల్వే స్టేషన్లు పరిశీలించాను.

రోడ్డు మీద వెళ్తుంటే అంబులెన్స్ మోత మోగిపోతోంది. నిర్విరామంగా రోడ్డుకు రెండువైపులా అంబులెన్సులు తిరుగుతూనే ఉన్నాయి.

సుమారు రెండున్నర కోట్ల జనాభా ఉన్న ఈ నగరంలో లాక్‌డౌన్ కారణంగా చాలావరకు దుకాణాలు మూసి ఉన్నాయి. రోడ్లపై కొన్ని కార్లు తప్ప పెద్దగా వాహనాలు లేవు.

మొదట సోమవారం వరకే లాక్‌డౌన్, కర్ఫ్యూ ప్రకటించిన దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదివారం కర్ఫ్యూను మరో వారానికి పొడిగించినట్లు ప్రకటించారు.

దిల్లీలో కరోనా

ఆస్పత్రుల పరిస్థితి

ఆసపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా నిండుకుంటోంది. కరోనా రోగుల బంధువులు ఎలాగైనా ఆక్సిజన్ సంపాదించాలని తాపత్రయపడుతున్నారు. తమ కుటుంబ సభ్యులను బతికించమని డాక్టర్లను ప్రాధేయపడుతున్నారు.

ఆస్పత్రుల బయట "పడకలు అందుబాటులో లేవు" అని బోర్డులు తగిలిస్తున్నారు.

రోగుల బంధుల ముఖాల్లో నిరాశ, నిస్సహాయత తాండవిస్తోంది. ఏదో ఒక ఆస్పత్రిలో తమ ఆత్మీయులకు పడక దొరక్కపోతుందా అనే ఆశతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

ఒకరి ద్వారా ఒకరికి, వాళ్ళ నుంచి మరొకరికి ఫోన్లు చేస్తూ ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేయాలని, పడకలు సంపాదించాలని రోగుల స్నేహితులు, బంధువులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రభుత్వం పూర్తిగా విఫలమైన ఈ సమయంలో స్నేహితులు, బంధువులే తమ ఆత్మీయులను కాపాడేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. మానవత్వం ఇంకా మిగిలే ఉందని నిరూపిస్తున్నారు.

డబ్బున్నవాళ్లు, పేదవాళ్లు, హిందువులు, ముస్లింలు అనే భేదాలన్నీపోయాయి. అందరి లక్ష్యం ఒక్కటే.. ఎలాగైనా కరోనా రోగులను కాపాడాలి. వారికి చికిత్స అందించి బతికించుకోవాలి.

దిల్లీ ఆస్పత్రుల దుస్థితి

బంధువుల నిస్సహాయత

మొట్టమొదట నేను ఎయిమ్స్‌కు వెళ్లాను. ఇది దిల్లీలో చాలా పెద్ద, విశాలమైన ఆస్పత్రి. దేశవ్యాప్తంగా ప్రజలు చికిత్స కోసం ఇక్కడకు వస్తుంటారు.

ఇక్కడ కరోనాకు మంచి చికిత్స అందిస్తున్నారు.

గత సంవత్సరం నా సోదరుడికి కరోనా సోకినప్పుడు 12 రోజులపాటూ ఇక్కడే చికిత్స అందించారు.

నా సోదరుడిని చేరుస్తున్నప్పుడు ఆయన బతికే అవకాశాలు 50 శాతం మాత్రమే ఉన్నాయని ఆస్పత్రి డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. కానీ, రెండు వారాల తరువాత నా సోదరుడు పూర్తి ఆరోగ్యంతో తిరిగొచ్చారు.

శనివారం ఎయిమ్స్ ముందు వందలకొద్దీ జనం గుమికూడి ఉన్నారు. కొంతమంది పక్కనే ఫుట్‌పాత్ పైనే దుప్పట్లు పరుచుకుని కూర్చున్నారు. అక్కడే వంటలు చేసుకుని తింటున్నారు. వీరిలో అనేకమంది ఆర్థికంగా బలహీనవర్గాలకు చెందినట్లుగా కనిపించారు.

నేను అక్కడివారితో మాట్లాడడానికి ప్రయత్నించాను. అప్పుడే నాకు ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది. రోహిణిలోని జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా 20 మంది మరణించినట్లు వార్త వచ్చింది.

మూడు రోజుల ముందు సర్ గంగారాం ఆస్పత్రిలో కూడా ఆక్సిజన్ లేక 25 మంది ప్రాణాలు కోల్పోయారు.

దిల్లీ ఆస్పత్రుల దుస్థితి

అక్కడి నుంచి నేను జైపూర్ గోల్డెన్ ఆస్పత్రికి వెళ్లాను.

అక్కడ క్రిటికల్ కేర్ వార్డ్‌లో 250 మంది కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. వారంతా ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్నారు.

ముందురోజు అర్థరాత్రి దాటిన తరువాత ఆక్సిజన్ సరఫరా తగ్గడం ప్రారంభమైందని, అందరూ ప్రాణభయంతో వణికిపోయారని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు.

తన భర్తతో అక్కడకు వచ్చిన రిచాలీ అవస్థీ అనే మహిళతో నేను మాట్లాడాను. ఆస్పత్రి అధికారులపై ఆమె చాలా కోపంగా ఉన్నారు.

చనిపోయినవారిలో రిచాలీ పెద్ద తోటికోడలు సీమా అవస్థీ కూడా ఉన్నారు. సీమా ఒక స్థానిక స్కూల్లో ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు. ఆమె పిల్లలకు పెళ్లిళ్లు నిశ్చమయ్యాయి.

"ఒక సమర్థురాలైన వ్యక్తిని మన సమాజం కోల్పోయింది" అని రిచాలీ దుఃఖంతో చెప్పారు.

రాత్రి సీమాతో చాటింగ్ చేశానని, ఆస్పత్రికి వెళ్లినా తనను లోపలికి అనుమతించలేదని రిచాలీ చెప్పారు. అయితే, వాట్సాప్ చాట్ ద్వారా సీమ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిసిందని చెప్పారు.

దిల్లీలో కరోనా

ఆక్సిజన్ తరుగుదల గురించి తమకు ఎలాంటి సమాచారం అందించలేదని రిచాలీ ఆస్పత్రి వర్గాలను దుయ్యబట్టారు.

అక్కడే మరొక వ్యక్తిని కలిశాను. తన అన్నలిద్దరూ కరోనాతో జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో చేరారు.

రాత్రి 11.00 గంటలకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతోందని ఆస్పత్రి నుంచి తనకు ఫోన్ వచ్చిందని, వెంటనే స్నేహితుల సహాయంతో ఒక ఆక్సిజన్ సిలిండర్ సంపాదించి కారులో ఆస్పత్రికి తీసుకువెళ్లారని చెప్పారు.

"చావు దాకా వెళ్లినవారికే తెలుస్తుంది ఆ బాధేమిటో. భగవంతుడి దయవల్ల మా అన్నలు ఇద్దరూ బతికి బయటపడ్డారు" అని ఆయన ఏడుస్తూ చెప్పారు.

అదే సమయంలో ఒక పెద్ద ఆక్సిజన్ ట్యాంకర్ ఆస్పత్రికి చేరుకుంది. దాన్ని చూస్తూనే అక్కడున్న వారికి ప్రాణం లేచి వచ్చింది.

అప్పటికి ఆ అస్పత్రిలో ఆక్సిజన్ సంక్షోభానికి తెర పడింది.

కానీ, మరో ఆస్పత్రిలో ఇదే సంక్షోభం మొదలైంది.

దిల్లీ ఆస్పత్రుల దుస్థితి

గత కొద్ది రోజులుగా దిల్లీలోని ఆస్పత్రులన్నిట్లో ఇదే పరిస్థితి. ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతూ ఉంది. పెద్ద పెద్ద ప్రైవేటు ఆస్పత్రుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.

అప్పుడే, షాలిమార్ బాగ్‌లోకి ఒక ఆస్పత్రిలో మరో రెండు మూడు గంటల్లో ఆక్సిజన్ అయిపోతుందనే వార్తలు వచ్చాయి.

వెంటనే నేను అక్కడకు చేరుకున్నాను. కానీ, నన్ను సెక్యూరిటీ లోపలికి అనుమతించలేదు. మీడియావాళ్లను లోపలికి వెళ్లనివ్వలేదు.

నేను ఫోన్ ద్వారా ఆ ఆస్పత్రి అధికారిని సంప్రదించి, ముఖ్యమంత్రి కేజ్రీవాల్, దిల్లీలోని ప్రైవేటు ఆస్పత్రుల కారణంగానే నగరంలో ఆక్సిజన్ సరఫరా పరిస్థితి గందరగోళంలో పడిందని, అందుకే మీరు మీడియావాళ్లను లోపలికి అనుమతించట్లేదని అన్నాను.

నోయిడా నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ తెప్పించే ఏర్పాటు చేస్తున్నామని మరో గంటలో అక్కడకు ట్యాంకర్ వస్తుందని ఆ అధికారి చెప్పారు.

నేను అక్కడే మరో గంట వేచి చూశాను. కానీ, ట్యాంకర్ రాలేదు. అయితే, తరువాత ఆ అధికారి ఫోన్ చేసి ట్యాంకర్ వచ్చిందని తెలిపారు.

దిల్లీలో కరోనా

డాక్టర్ల అంకిత భావం

సర్ గంగారాం, ఎయిమ్స్‌లాంటి ఆస్పత్రులు చూసిన తరువాత, ఆక్సిజన్, మందులకు కొరత ఉంది. కానీ, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల నిబద్దతకు కొరత లేదని అనిపించింది.

గంగారాం ఆస్పత్రిలో పీపీఈ కిట్ వేసుకున్న ఒక మహిళా డాక్టర్‌తో మాట్లాడాను.

ఆమె గత 10 రోజులుగా విరామం లేకుండా రోగులకు చికిత్స అందిస్తున్నారని, ఒక్కోసారి ఓవర్ టైం కూడా చేస్తున్నారని తెలిపారు.

కరోనా వ్యాప్తి భయంకరంగా ఉందని తమకు తెలుసునని, ప్రజలకు వైద్యుల అవసరం ఉందని, అందుకు వారు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని ఆమె చెప్పారు.

జైపూర్ గోల్డెన్ ఆస్పత్రి ముందు ఇద్దరు మహిళలు బాధతో ఏడుస్తూ కనిపించారు. వారికి అక్కడ బెడ్ లేదని చెప్పారు. కానీ, వారికి వెళ్లడానికి మరో స్థలం లేదు. అందుకని అక్కడే కూర్చుని వేచి చూస్తున్నారు.

దిల్లీలో కరోనా

కూలీలు వలసబాట పట్టారు

దిల్లీలో వారంపాటు లాక్‌డౌన్, కర్ఫ్యూ విధించాక మళ్లీ రోజు కూలీలు వలసబాట పట్టారు.

గత కొద్ది రోజులుగా ఆనంద్ విహార్ బస్ స్టాండ్ వలస కూలీలతో కిటకిటలాడిపోయిన ఫొటోలు మీడియాలో కనిపించాయి.

నేను అక్కడకు వెళ్లినప్పుడు ఆనంద విహార్ బస్ స్టాండ్ పక్కనే ఉన్న రైల్వే స్టేషన్ వెలుపల భారీగా జనం గుమికూడి ఉన్నారు.

అక్కడ కొన్ని రైలు భోగీలను కోవిడ్ ఆస్పత్రులుగా మర్చారు. అన్నిచోట్లా "లోపలికి అనుమతి లేదు" అని బోర్డులు పెట్టారు.

ఒక ఆస్పత్రి నుంచి మరొక ఆస్పత్రికి తిరుగుతూ ఉంటే.. దిల్లీల్లో ఒక వింత నిశ్శబ్దం అలముకుందని నాకనిపించింది.

దీనికి కర్ఫ్యూ లేదా లాక్‌డౌన్ కారణం కాకపోవచ్చు.

ప్రజల్లో భయం అలుముకుంది. కరోనా పడగ నీడలో దిల్లీ అల్లాడిపోతోంది. కళ్లకు కనిపించని శత్రువు దిల్లీ ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. అది ఈ నగర ప్రజల ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
The city of Delhi is trembling due to fear of corona
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X